జైలుకు జేజేలు...వారి నుంచి వీరి దాకా !

జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చిన నేతలకు జనాలు నీరాజనాలు పట్టే సీన్ టీవీ తెర మీద కానీ మొబైల్ ఫోన్లలో కానీ చూసిన వారికి అదొక తమాషాగా అనిపిస్తుంది.;

Update: 2026-03-19 19:30 GMT

జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చిన నేతలకు జనాలు నీరాజనాలు పట్టే సీన్ టీవీ తెర మీద కానీ మొబైల్ ఫోన్లలో కానీ చూసిన వారికి అదొక తమాషాగా అనిపిస్తుంది. జైలుకు వెళ్ళిన నేతలు తాము అమాయకులమని చెబుతారు. అన్యాయంగా కేసులు పెట్టారని అంటారు. ఇక వారికి జైలు దారి చూపించిన పార్టీలు కానీ నేతలు కానీ తప్పు చేస్తేనే అలా జరిగింది అంటారు. ఇలా ఎవరి వాదనలు వారికి ఉంటాయి. అలాగే ఎవరి అభిమానులు వారికి ఉంటారు, ఒక్క విషయం ఏంటి అంటే జైలుకు వెళ్ళని నేతల కంటే వెళ్ళిన నేతలకే జేజేలు ఎక్కువ. లేకపోతే ఒక్కసారి లెక్క చూసుకోండి ఇటీవల కాలంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కానీ లేటెస్ట్ గా పల్నాడుకు చెందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ జైలు నుంచి బయటకు రాగానే అనుచరుల ఆనందం కానీ ఊరేగింపులు కానీ చూసిన వారికి ఆసక్తికరంగా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.

ఇంతకు ఇంత బదులు :

ఇక ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక 21 నెలలలో వైసీపీ నేతలు చాలా మంది అరెస్టు అయ్యారు. లేటెస్ట్ గా నెల్లూరు జైలు నుంచి బయటకు వచ్చిన వారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయనను ఎత్తుకుని మరీ అభిమానులు ఊరేగించారు. గజమాల మెడలో వేసి మరీ నినాదాలు చేశారు మీడియా ముందు మాట్లాడిన పిన్నెల్లి అయితే తమకూ ఒక రోజు వస్తుందని అధికార కూటమిని హెచ్చరించారు. తాము ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటామని అన్నారు అదే సమయంలో 99 రోజుల పాటు తనను జైలు పాలు చేస్తారా అని ఆయన మండిపడ్డారు. జంట హత్య కేసుతో తనకు సంబంధం లేదని అయినా ఇరికించారని ఆయన ఫైర్ అయ్యారు.

లిస్ట్ తీస్తే వీరంతా :

అదే విధంగా చూస్తే వైసీపీ నుంచి అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన అంబటి రాంబాబు అక్కడే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ కూటమి మీద గట్టిగానే ఆగ్రహించారు. తామూ చట్ట ప్రకారం తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అరెస్ట్ చేశారు, జైలుకు వెళ్ళాం, బయటకు వచ్చాం ఇంతకంటే ఏమి చేస్తారని అంబటి బిగ్ సౌండ్ చేశారు. ఇక వైసీపీ నుంచి చూస్తే మాజీ మంత్రులు జోగి రమేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇలా చాలా మంది జైలుకు వెళ్ళి బయటకు వచ్చారు. వచ్చిన వారు అంతా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రత్యర్ధులను లోపలికి పంపిస్తామని గట్టిగా ప్రతిని పూనుతున్నారు.

నయా ట్రెండ్ గా :

ఇక పదినేహేళ్ళ క్రితం చూస్తే జైలుకు రాజకీయ నేతలు వెళ్లడం అరుదుగా ఉండేది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రతిపక్షాలను టార్గెట్ చేసేది అంతగా ఉండేది కాదు, ఆ మాటకు వస్తే ప్రతిపక్షం కూడా నిర్మాణాత్మక విమర్శలు చేసేది, ఎక్కడా వ్యక్తిత్వ హననం ఉండేది కాదు, అలాగే టార్గెట్ కూడా పర్సనల్ గా అసలు ఉండేది కాదు, అందుకే ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనే రాజకీయం సాగింది. ఇక ఎపుడైతే ఉమ్మడి ఏపీలో వైసీపీ అధినేత జగన్ కాంగ్రెస్ ని ధిక్కరించి బయటకు వచ్చారో ఆయన అరెస్టుతో ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది అని గుర్తు చేస్తున్నారు. ఆ విధంగా అప్పట్లో ఆ అరెస్ట్ అతి పెద్ద రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తే తరువాత కాలంలో అంటే 2019లో వైసీపీ వచ్చాక టీడీపీ నేతల అరెస్టులు వరసబెట్టి సాగాయి. అందులో మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర వంటి వారు ఉన్నారు. ఆఖరుకు అన్నట్లుగా చంద్రబాబుని ఏకంగా 53 రోజుల పాటు జైలులో ఉంచేలా కధ సాగింది.

ఇమేజ్ పెరుగుతోందా :

ఇక్కడ మరో విషయం కూడా ఉంది. జైలు నుంచి వచ్చిన వారి మీద ఫోకస్ ఎక్కువగా ఉంటోంది. అంతే కాదు వారు ఎన్నికల్లో రాజకీయాల్లో మరింతగా రాణిస్తున్నారు. గెలుస్తున్నారు కూడా. ఎందుకో తెలియదు కానీ జైలుకు వెళ్ళి వచ్చారు అన్న సింపతీ వర్కౌట్ అవుతోంది అని అంటున్నారు. జైలుకు వెళ్ళి వచ్చిన జగన్ కానీ రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక మాజీ మంత్రులు కానీ కీలక నేతలు కానీ తరువాత ఎన్నికల్లో గెలిచారు. ఒక విధంగా సానుభూతి సెంటిమెంట్ బాగా పనిచేస్తోంది అంటున్నారు.

బెడిసికొట్టే ప్రమాదం ఉంది :

అయితే ఇదే బాగుందని అనుకుంటూ ముందుకు పోతే చివరికి ఆ సెంటిమెంట్ కూడా బెడిసికొట్టే ప్రమాదం ఉంది ఇక వారు ఏదో చేశారని వీరు చేయడం కాకుండా ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంది. తెలంగాణాలో సీఎం రేవంత్ రెడ్డి తాను జైలుకు వెళ్ళి వచ్చాను కాబట్టి బీఆర్ఎస్ అగ్ర నేతలను జైలు పాలు చేయలేదు అన్నది గుర్తు చేసుకోవాలి. రాజకీయాలు అంటే ఉన్నతమైనవి ప్రజలకోసం అన్నట్లుగా వాతావరణం మార్చాలి. నిర్మాణాత్మకమైన పాత్ర అధికార పక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా పోషించాలి. అపుడే జైలూ బెయిలూ జేజేలూ అన్న ఎపిసోడ్లకు చెక్ పడుతుంది.

Tags:    

Similar News