గ్లామర్ టు పవర్ : ఏపీలో పవన్.. తమిళనాడులో విజయ్!

వచ్చేనెలలో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీవీకే అధినేత విజయ్ పోటీ చేస్తున్నారు. 2024 ఫిబ్రవరి 2న విజయ్ టీవీకే పార్టీని ప్రారంభించారు.;

Update: 2026-03-19 14:30 GMT

దక్షిణాది రాజకీయాల్లో సినిమా గ్లామర్‌కు, అధికార పీఠానికి విడదీయలేని బంధం ఉంది. గతంలో తమిళనాట ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, ఏపీలో ఎన్టీఆర్ వంటి వారు వెండితెర వేల్పులుగా వెలిగి, అప్రతిహత విజయాలను అందుకున్నారు. అయితే, మారుతున్న కాలంలో ఒక సూపర్ స్టార్ నేరుగా రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అవ్వడం అంత సులభం కాదని రజనీకాంత్ వెనకడుగు, కమల్ హాసన్ వైఫల్యం నిరూపించాయి. ఈ క్రమంలో ఏపీలో పవన్ కల్యాణ్ సాధించిన అద్భుత విజయం ఇప్పుడు తమిళ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి ఒక ఆశాకిరణంగా కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

వచ్చేనెలలో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీవీకే అధినేత విజయ్ పోటీ చేస్తున్నారు. 2024 ఫిబ్రవరి 2న విజయ్ టీవీకే పార్టీని ప్రారంభించారు. అంతకుముందు కొన్నేళ్లుగా ఆయన 'మక్కల్ ఇయక్కం' అనే పేరుతో ఫ్యాన్ క్లబ్స్‌ నడిపారు. దీనిద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు తన ఫ్యాన్స్ నే పార్టీ కేడర్ గా మార్చుకుని ఎన్నికల రణక్షేత్రంలోకి దిగారు. ఇక పవన్ కూడా 2009 ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలుత తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం సారథిగా పనిచేశారు. 2014లో సొంతంగా జనసేన పార్టీని ప్రారంభించి పదేళ్ల పాటు పోరాడి పార్టీని కీలక స్థాయికి తీసుకువచ్చారు.

పవన్ కల్యాణ్ 2014లో జనసేనను స్థాపించినప్పుడు ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండిపోయారు. ఇక 2019లో ఆయన స్వయంగా రెండు చోట్ల ఓడిపోయారు. కానీ, పదేళ్ల పాటు క్షేత్రస్థాయిలో పోరాడి ఏపీకి డిప్యూటీ సీఎంగా ఎదిగారు. అంతేకాకుండా వంద శాతం స్ట్రైక్ రేటుతో ఎవరికీ దక్కని విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, వ్యూహాత్మకంగా అడుగులు వేసి 2024లో విజయం సాధించిన పవన్ కల్యాణ్ తమిళనాట విజయ్ కి ఆదర్శంగా మారారని వ్యాఖ్యానిస్తున్నారు.

2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రణరంగంలోకి దిగిన విజయ్ అచ్చం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాదిరిగానే అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. తన సినిమా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే నటనకు స్వస్తి పలికారు. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. పవన్ కూడా ఎన్నికలకు ముందు అంగీకరించిన సినిమాలు తప్ప, కొత్తగా మరే సినిమాకు కాల్షీట్లు ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా పవన్ మాదిరిగా విజయ్ కూడా కేవలం గ్లామర్‌ను నమ్ముకోకుండా, భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు.

ఇద్దరి మధ్య కనిపిస్తున్న ముఖ్యమైన పోలికలు

ఇక రెండు రాష్ట్రాల్లో ఇద్దరు నేతల మధ్య అనేక పోలికలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ప్రధానంగా ఇద్దరికీ యువ శక్తి ఒక ఆశాకిరణంగా కనిపిస్తోందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెనుక యువత ఒక సైన్యంలా నిలబడ్డారని అంటున్నారు. ఇప్పుడు తమిళనాట విజయ్‌కి కూడా అంతేస్థాయిలో ఫాలోయింగ్ కనిపిస్తోందని చెబుతున్నారు. దీనికి ఆయన సభలకు వస్తున్న జన సందోహమే నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. తన అభిమాన సంఘాలను రాజకీయ విభాగంగా మార్చడంలో ఇప్పటికే విజయ్ సక్సెస్ అయ్యారని చెబుతున్నారు.

విజయ్ ముందున్న సవాళ్లు

ఇక పవన్ కల్యాణ్ ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూశారు. కానీ తమిళనాడులో పరిస్థితి భిన్నంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. అక్కడ ఇప్పటికే డీఎంకే, అన్నాడీఎంకే వంటి బలమైన ద్రావిడ పార్టీలు ఉన్నాయి. విజయ్ ఒంటరి పోరు చేస్తారా లేక పవన్ లాగా మిత్రపక్షాలను కలుపుకుపోతారా అనేది ఆయన భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెబుతున్నారు. సినిమా గ్లామర్ ఓట్లను తెచ్చిపెట్టొచ్చు కానీ, పవర్ రావాలంటే పవన్ కల్యాణ్ చూపించిన ఓపిక చాలా అవసరమని అంటున్నారు. పవన్ 2014 నుంచి 2024 వరకు ఎలాగైతే అధికారం కోసం నిరీక్షించారో.. విజయ్ కూడా తమిళ రాజకీయాల్లో ఆ స్థాయి నిలకడను ప్రదర్శిస్తే.. పొరుగు రాష్ట్రంలో పవన్ సృష్టించిన ప్రభంజనాన్ని తమిళనాడులో విజయ్ పునరావృతం చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News