చీమలను స్మగ్లింగ్ చేస్తారా.. ఆ అవసరం ఎవరికి? ఎందుకోసం?

కొద్దిరోజుల క్రితం రెండు వేలకు పైగా రాణి చీమలను స్మగ్లింగ్ చేస్తూ చైనాకు చెందన వ్యక్తి కెన్యాలో పట్టుబడ్డారు.;

Update: 2026-03-19 18:17 GMT

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా చీమల స్మగ్లింగ్ ఒక పెద్ద వ్యాపారంగా మారుతోంది. కేవలం బంగారం, వజ్రాలే కాదు, ఈ చిన్ని జీవులను కూడా అక్రమంగా రవాణా చేస్తున్నారని ఇటీవల చోటుచేసుకున్న ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం రెండు వేలకు పైగా రాణి చీమలను స్మగ్లింగ్ చేస్తూ చైనాకు చెందన వ్యక్తి కెన్యాలో పట్టుబడ్డారు. ఈ వ్యవహారంలో చైనా, కెన్యా దేశాలకు చెందిన ఇద్దరిని అరెస్టు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కెన్యా రాజధాని నైరోబిలో ఝాంగ్ కెక్వన్ అనే వ్యక్తి పెద్ద సంఖ్యలో రాణి చీమలను పట్టుకుని చైనాకు వెళుతుండగా, పోలీసులు అడ్డుకున్నారు. ఝాంగ్ కెక్వన్ తన లగేజీలో కొన్ని చీమలను టెస్ట్ ట్యూబులలో పెట్టారు. మరికొన్నింటిని టిష్యూ పేపర్ రోల్స్ లో దాచి తన బ్యాగులో పెట్టుకున్నారని అధికారులు తెలిపారు. అతడిపై వన్యప్రాణుల అక్రమ రవాణా అభియోగాలు మోపి అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంతో చీమల స్మగ్లింగుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కీటక జాతికి చెందిన చీమల అక్రమ రవాణా వల్ల ఎవరికి ప్రయోజనం? ఎలాంటి నష్టమన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 'యాంట్ ఫార్మింగ్' ఒక వింత హాబీగా ప్రాచుర్యం పొందుతోందని చెబుతున్నారు. కొందరు తమ ఇళ్లలో గాజు పెట్టెల్లో అరుదైన చీమలను పెంచుకోవడానికి ఇష్టపడుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. స్థానికంగా దొరకని భారీ పరిమాణంలో ఉండే చీమలు లేదా రంగురంగుల చీమల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన 'బుల్‌డాగ్ యాంట్స్' (Bulldog Ants) వంటి అరుదైన జాతి రాణి చీమల ధర అంతర్జాతీయ మార్కెట్‌లో లక్షల్లోనే ఉంటుందని అంటున్నారు.

ఇక చీమలను మందుల తయారీకి కూడా వినియోగిస్తారని, కొన్ని దేశాల్లో ఆహారంగా స్వీకరిస్తారని చెబుతున్నారు. దీంతో ఇటీవల కాలంలో చీమల స్మగ్లింగ్ భారీగా పెరిగిందని ప్రచారం జరుగుతోంది. చీమల శరీరంలో ఉండే రసాయనాలు మందుల తయారీకి పనికొస్తాయని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దీంతో చైనా ఇతర దేశాల నుంచి చీమలను అక్రమంగా దిగుమతి చేసుకుంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని రకాల చీమల విషం నుంచి యాంటీబయోటిక్స్ లేదా నొప్పి నివారణ మందులను తయారు చేసే పరిశోధనలు జరుగుతున్నాయని, అందుకోసం స్మగ్లర్లు వీటిని అక్రమంగా తరలిస్తుంటారని చెబుతున్నారు. దీనిని 'బయో పైరసీ'గా వ్యాఖ్యానిస్తున్నారు. చైనీస్ సాంప్రదాయ వైద్యంలో బలానికి, కీళ్ల నొప్పుల నివారణకు కూడా చీమలను ఉపయోగిస్తారని అంటున్నారు.

చీమలను ఒక దేశం నుంచి మరొక దేశానికి తరలించడం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని అంటున్నారు. విదేశీ చీమలు స్థానిక పర్యావరణంలోకి ప్రవేశిస్తే, అక్కడ ఉండే స్థానిక కీటకాలను చంపేస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల పర్యావరణ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని, పంటలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. చీమల అక్రమ రవాణా వల్ల కొత్త రకమైన వైరస్‌లు ఒక దేశం నుంచి మరో దేశంలోకి ప్రవేశిస్తాయని చెబుతున్నారు. ఈ కారణంతో ప్రపంచంలో చాలా దేశాలు చీమలను లేదా ఇతర కీటకాలను అనుమతి లేకుండా తీసుకురావడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తున్నాయని అంటున్నారు. విమానాశ్రయాల్లో వీటిని పట్టుకుంటే భారీ జరిమానాలు, జైలు శిక్షలు కూడా విధిస్తారని అంటున్నారు.

Tags:    

Similar News