బెంగాల్ లో బీజేపీ 10 ఏళ్ల పోరాటం.. 2016లో మూడు సీట్లు.. 2026లో...??

పశ్చిమ బెంగాల్ లో అధికారం దక్కించుకోడానికి ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ 10 ఏళ్లుగా పోరాడుతోంది.;

Update: 2026-03-19 13:51 GMT

పశ్చిమ బెంగాల్ లో అధికారం దక్కించుకోడానికి ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ 10 ఏళ్లుగా పోరాడుతోంది. 2016 నుంచి ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ చేయని ప్రయత్నం లేదని చెబుతున్నారు. పదేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల నాటికి 77 సీట్లకు ఎగబాకింది. ఈ సారి ఏకంగా అధికారంపైనే గురిపెట్టి మడమ తిప్పని పోరాటం చేస్తోంది. అయితే మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, నాలుగోసారి కూడా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని భావిస్తున్న ఫైర్ బ్రాండ్ దీదీ మమతా బెనర్జీని ఎదుర్కొని కమలం జెండా ఎగురవేయడం సాధ్యమా? అన్నదే ఆసక్తికర చర్చగా మారింది.

2014లో కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత బీజేపీ దేశవ్యాప్తంగా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. దేశంలోని నలు దిక్కులా ఆ పార్టీ విస్తరించింది. ఈశాన్య రాష్ట్రాలలోనూ బీజేపీ పాగా వేసింది. ప్రస్తుతం బీజేపీ దేశంలో మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అధికారంలో ఉంది. ఇప్పటివరకు బీజేపీకి చిక్కని బెంగాల్ లో ఈ సారి మ్యాజిక్ చేస్తామని కమల నాథులు చెబుతున్నారు. గత ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన సువేంధు అధికారికి పార్టీ పగ్గాలు అప్పగించిన బీజేపీ గెలుపు పక్కా అంటూ భీకర ప్రతిజ్ఙలు చేస్తోంది. దీంతో పశ్చిమబెంగాల్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.

పదిహేనేళ్ల క్రితం వామపక్షాల కోటను తృణమూల్ కూల్చినట్లే.. ఇప్పుడు దీదీ మమతాను గద్దె దించుతామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పక్కా ప్లాన్ తో ముందుకు కదులుతున్నారు. వరుసగా మూడు దఫాలుగా అధికారంలో ఉన్న తృణమూల్ పై బెంగాల్ లో ప్రజా వ్యతిరేకత ఉందని బీజేపీ చెబుతోంది. సీఎం మమతా బెనర్జీ విధానాలు, ముస్లిం బుజ్జగింపు ధోరణులు, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ప్రజలు, హిందూ ఓటర్లను సంఘటితం చేయడంపై బీజేపీ ఫోకస్ చేసిందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఇటీవల విడుదలైన ఓపీనియన్ పోల్స్ కూడా బీజేపీ నేతలను ఉత్సాహ పరుస్తోందని అంటున్నారు.

గతంలో బీజేపీ సాధించిన 77 సీట్ల కంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని పలు సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయని చెబుతున్నారు. అయితే ఈ ఫలితాలు తృణమూల్ ను గద్దె దించే అంత స్థాయికి బీజేపీ ఇంకా చేరలేదని చెబుతున్నా, ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ఈలోగా మ్యాజిక్ చేస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. పక్కా వ్యూహంతో బెంగాల్ కోటను బద్దలు కట్టేలా ముందుకు కదులుతోందని అంటున్నారు. తృణమూల్ ఓటు బ్యాంకును చీల్చడం, బీజేపీ ఓటు బ్యాంకును పెంచడం అన్న లక్ష్యంతో కమల నాథులు వ్యూహాలు రచిస్తున్నారని చెబుతున్నారు

మత్స్యకారులు, రైతులను తన వైపు తిప్పుకునేలా తీర ప్రాంత ఓటు బ్యాంకును స్థిరపరుచుకోవడమే ఇందుకు కారణంగా చూపుతున్నారు. బీజేపీ నేత సువేంధు అధికారి కుటుంబానికి కోస్తా ప్రాంతమైన పర్బా మేదినపూర్ లో మంచి బలం ఉంది. 2021 ఎన్నికల్లో ఇక్కడ కేవలం 7 జిల్లాల్లో బీజేపీ గెలిస్తే, 2024 లోక్ సభ ఎన్నికల్లో ఆ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో మెజార్టీ సాధించింది. దీనిని బట్టి బీజేపీ ఒక్కో జిల్లాలో తన ప్రాబల్యం పెంచుకునేలా పనిచేస్తోందని అంటున్నారు. ఝార్గ్రాం, బంకురా, పురూలియా జిల్లాలతో కూడిన గిరిజన బెల్ట్ తోపాటు ఉత్తర బెంగాల్ మైదాన ప్రాంతాల్లో బీజేపీ విస్తరిస్తోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో 5 శాతం కంటే తక్కువ మార్జిన్ తో గెలిచిన 46 స్థానాలపై ఈ సారి ప్రత్యేక దృష్టి పెట్టారు.

Tags:    

Similar News