నీటి బుడగ పగిలింది... ఒక్కరోజులో బంగారం, వెండి భారీ విధ్వంసం!
అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిల వద్ద ట్రేడవుతున్న బంగారం, వెండి ధరలు శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి.;
అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిల వద్ద ట్రేడవుతున్న బంగారం, వెండి ధరలు శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. గత ఏడాది జనవరిలో రూ.78వేలు వద్ద ఉన్న బంగారం ధర ఈ ఏడాది జనవరికి రూ.1.78 లక్షలు దాటేసిన పరిస్థితి. అంటే... ఒక్క ఏడాది కాలంలోనే రూ. లక్ష పైన పెరిగిందన్నమాట. దీనికి ఏమాత్రం తగ్గకుండా వెండి ధరలు పరుగులు తీసి, కొండెక్కాయి. అయితే తాజాగా ఈ రెండు విలువైన లోహాల ధరలు ఊహించని స్థాయిలో పడిపోయాయి.
అవును... పసిడి ప్రియులకు, వెండి అభిమానులకు శుక్రవారం పీడకలగా మారిపోయింది. దాదాపు 15 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో ఇంతలా ఎప్పుడూ పతనమవ్వలేదని విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. వెండి ధర ఒక్క రోజులో 27 శాతానికి పైగా క్షీణించడం 2011 తర్వాత ఇదే తొలిసారని అంటున్నారు. ఈ సందర్భంగా గురువారమే ఈ విషయంలో హింట్ ఇచ్చిన ధరలు.. శుక్రవారం పతనమైన విధానం మదుపరులను షాక్ కి గురిచేసిందని అంటున్నారు.
దేశీయ మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో పసిడి ఏప్రిల్ కాంట్రాక్టు ధర గురువారం రూ.1,93,096 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకగా.. అది కాస్తా శుక్రవారానికి రూ.1,49,075కు పడిపోయింది. ఇక వెండి విషయానికొస్తే.. గురువారం రూ.4,20,048 వద్ద గతంలో ఎన్నడూ లేని స్థాయిలో గరిష్టాన్ని నమోదు చేయగా.. శుక్రవారం ఈ ధర రూ.2,91,922కి పడిపోయింది.. మదుపరులను తీవ్ర నష్టానికి గురి చేసింది.
ఈ స్థాయిలో బంగారం, వెండి ధరలు పతనమవ్వడంతో... గ్లోబల్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్ ఎకనామిస్ట్ & మేనేజింగ్ డైరెక్టర్ విలియం లీ చేసిన 'నీటి బుడగ' వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇదే సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ కొత్త ఛైర్మన్ ఎంపిక కూడా ఈ దారుణ పతనాలకు కారణమని అంటున్నారు.
విలువైన లోహాలపై కెవెన్ వార్ష్ ఎఫెక్ట్!:
అమెరికా ఫెడరల్ రిజర్వ్ కొత్త ఛైర్మన్ గా కఠిన నిర్ణయాలు తీసుకునే కెవెన్ వార్ష్ (55)ను నామినేట్ చేస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ పదవిలో ఆయన నియమితులు కానుండటం మార్కెట్ ను కలవరపెడుతున్నాయని నిపుణులు అంటున్నారు. మే నెలలో జెరోమ్ పావెల్ పదవీకాలం ముగియనుండటంతో ఆ స్థానంలో కెవిన్ రానున్న పరిణామంతో డాలర్ పుంజుకుని, బంగారం ధరలపై ఒత్తిడి పెరగడానికి కారణం అయ్యిందని అంటున్నారు.
విలియం లీ 'నీటి బుడగ' వ్యాఖ్యలు!:
బంగారం, వెండి ధరలు ఈ స్థాయిలో పెరగడంపై ఇటీవల గ్లోబల్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్ ఎకనామిస్ట్ & మేనేజింగ్ డైరెక్టర్ విలియం లీ స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... పసిడి ధరల పెరుగుదలను నీటి బుడగ తో పోల్చారు. ఈ బుడగ ఎప్పుడైనా పగిలిపోయే అవకాశం ఉందని చెబుతూ.. ఈ ధర ఏ సమయంలో అయినా భారీగా తగ్గిపోతుందని.. భవిష్యత్తులో బంగారం దొరకదేమో అని ఎగబడి బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని హెచ్చరించారు.
ఇదే సమయంలో... బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడాన్ని ఓ ట్రాప్ అని అభివర్ణించిన విలియం లీ... కొన్ని పెద్ద సంస్థలు, ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న పసిడిని ఎక్కువ ధరకు విక్రయించుకోవడానికి ఇలా చేస్తుంటారని అన్నారు. అదేవిధంగా... వస్తువులకు డిమాండ్ పెరిగినప్పుడల్లా వాటి ధర కచ్చితంగా పెరుగుతుంది కానీ.. పసిడి విషయంలో ఇది వేరని.. లండన్, న్యూయార్క్ వంటి దేశాల్లోని కొన్ని పెద్ద బ్యాంకులు ఫిక్స్ చేస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు!
ఇదే క్రమంలో... 1980లో బంగారం ధరల పెరుగుదలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇందులో భాగంగా నాడు కూడా పసిడి ధరలు ఊహకందని రీతిలో పరుగులు పెట్టాయని.. దీంతో చాలా మంది బంగారం కొనడానికి ఎగబడ్డారని.. కట్ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత ధరలు సుమారు 57% పడిపోయాయని అన్నారు. సరిగ్గా 2011లోనూ ఇలానే జరిగిందని.. ఇదే క్రమంలో.. 2026లోనూ ఇదే రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు! అన్నట్లుగానే జరుగుతుండటం గమనార్హం!