అజిత్ భార్యకు డిప్యూటీ సీఎం.. కొడుక్కి రాజ్యసభ సీటు
అనూహ్య రీతిలో విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం అనంతరం పలు రాజకీయ పరిణామాలు ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్నాయి.;
అనూహ్య రీతిలో విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం అనంతరం పలు రాజకీయ పరిణామాలు ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్నాయి. అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం బాధ్యతలు కట్టబెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అధికారిక ప్రకటన తప్పించి.. లాంఛనంగా నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. శనివారం ఆమె పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నారు.
శనివారం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై.. సునేత్రను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటాని.. అనంతరం ఆమె డిప్యూటీ సీఎంగా పదవీ ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.దీంతో,. మహారాష్ట్రకు తొలి మహిళా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రికార్డు సునేత్రా పవార్ కు దక్కుతుంది. ఇదిలా ఉండగా అజిత్ పవార్ అనూహ్య మరణం నేపథ్యంలో ఎన్సీపీ (నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ) చీలిక వర్గాల పునరేకీకరణ జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుున్నాయి.
అయితే.. అజిత్ పవార్ జీవించి ఉన్నప్పుడే ఈ పునరేకీకరణ అంశంపై కసరత్తు మొదలైందని.. ఇప్పుడు ఊపందుకుంటున్నట్లుగా పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ వాదనకు బలం చేకూరేలా.. ఈ మద్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి ఫుణె.. చించ్వాడ్ లో కలిసి పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రెండు చీలిక వర్గాల్ని విలీనం చేసే ఉద్దేశంతో గడిచిన కొంతకాలంగా అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్ తో అనేకసార్లు భేటీ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఈ పరిణామాలు బీజేపీ సీనియర్ నేతలకు తెలుసని చెబుతున్నారు. రెండు పార్టీలు విలీనం కావాలన్న ఆలోచనకు సునేత్రా పవార్ ఎలా స్పందిస్తాన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒకవేళ రెండు పార్టీలు కలిస్తే.. ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడైన శరద్ పవార్ చీఫ్ గా మారతారు. మరి.. దీనికి సునేత్ర.. ఆమె కుమారుడి ఆలోచనలు ఏమిటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. అజిత్ పవార్ అనూహ్య మరణం నేపథ్యంలో ఆయన పెద్ద కొడుకు పార్థ్ పవార్ రాజ్యసభలోకి అడుగు పెట్టేందుకు కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న అతడి తల్లి కం దివంగత అజిత్ పవార్ సతీమణి సునేత్ర డిప్యూటీ సీఎంగా బాద్యతలు చేపట్టనున్న నేపథ్యంలో.. పార్థ్ పవార్ ను రాజ్యసభకు పంపాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. నిజానికి ఇతను 2019 లోక్ సభ ఎన్నికల్లో మావల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడారు. రానున్న రోజుల్లో మహారాష్ట్ర రాజకీయాల్లో పలు పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పక తప్పదు.