'జెన్ జడ్' మీటింగ్: పాలిటిక్స్ 2.0కి పవన్ కల్యాణ్ నాంది!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన ముద్ర వేసే జనసేనాని పవన్ కళ్యాణ జెన్ జడ్ యువతతో నిర్వహించిన ప్రత్యేక సమావేశం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.;
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన ముద్ర వేసే జనసేనాని పవన్ కళ్యాణ జెన్ జడ్ యువతతో నిర్వహించిన ప్రత్యేక సమావేశం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేవలం ఓట్ల కోసమే కాకుండా, రాబోయే తరం ఆలోచనలను అర్థం చేసుకునే ఉద్దేశంతో సాగిన ఈ మీటింగ్ విశేషాలు రాజకీయంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. 'జనసేనానితో జన్ జడ్' పేరుతో నిర్వహించిన ఈ సమావేశం సుమారు 3 గంటల పాటు అత్యంత ఉత్సాహంగా సాగింది. కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాకుండా, యువతతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా చర్చించడం, యువత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
మారుతున్న రాజకీయ సమీకరణాలు
సాధారణంగా రాజకీయ సభలు అంటే మైకులు, నినాదాలు, విమర్శలు మాత్రమే ఉంటాయి. కానీ, ఈ జెన్ జడ్ మీటింగ్ పూర్తి భిన్నంగా సాగింది. ఒక కార్పొరేట్ బోర్డ్ రూమ్ డిస్కషన్ మాదిరిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ యువతతో మమేకం అవ్వడం ఆకట్టుకుందని అంటున్నారు. యువత అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం ఎంతో ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. ఈ సమావేశం సాగిన తీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో అటెన్షన్ క్రియేట్ చేసిందని చెబుతున్నారు.
టెక్నాలజీతో పుట్టి పెరిగిన ఈ తరం యువతకు పాతకాలపు రాజకీయ ఎత్తుగడలు నచ్చవు. వారిని ఆకట్టుకోవాలంటే 'డేటా', 'విజన్' కావాలి. పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని గుర్తించి వారితో నేరుగా సంభాషించారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అవినీతి రహిత పాలన, పారదర్శకతపై యువత అడిగిన ప్రశ్నలకు పవన్ ఇచ్చిన సమాధానాలు వారిలో నమ్మకాన్ని కలిగించాయని చెబుతున్నారు. మొత్తానికి డిఫరెంటుగా సాగిన ఈ సమావేశం రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
ఉద్యోగాల నుండి ఉపాధి వరకు..
జనసేనానితో జన్ జెడ్ సమావేశంలో ప్రధానంగా మూడు అంశాలపై లోతైన చర్చ జరిగింది. ఏపీని మరో సిలికాన్ వ్యాలీగా ఎలా మార్చాలి? స్థానిక యువతకు ఇక్కడే ఉద్యోగాలు ఎలా కల్పించాలి? అనే అంశాలపై పవన్ తన విజన్‌ను జన్ జెడ్ తో పంచుకున్నారు. వ్యక్తిత్వ వికాసం,రాజకీయాలపైనా ఆసక్తికర చర్చ సాగింది. రాజకీయాల్లోకి రావాలంటే కేవలం డబ్బు, బలం ఉంటే సరిపోదని బలమైన వ్యక్తిత్వం ఉండాలని పవన్ హితబోధ చేయడం యువతను ఆకర్షించిందని అంటున్నారు. అదేసమయంలో గ్లోబల్ వార్మింగ్, స్థానిక పర్యావరణ సమస్యలపై యువత చూపుతున్న ఆసక్తిని పవన్ అభినందించారు.
పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్?
ఇక పవన్, జన్ జడ్ మీటింగుపై రాజకీయ విశ్లేషకుల భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మీటింగ్ వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. మొదటిసారి ఓటు వేసే యువత ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు? అన్న విషయం తెలుసుకోడానికే పవన్ ఈ సమావేశం నిర్వహించారని అంటున్నారు. మొదటిసారి ఓటు వేసే వారు కింగ్ మేకర్స్ గా పవన్ భావిస్తున్నారని, ఆ వర్గాన్ని ఆకర్షించడంలో పవన్ కళ్యాణ్ మిగిలిన నాయకుల కంటే ఒక అడుగు ముందే ఉన్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఇక సమావేశంలో యువత అడిగిన కఠినమైన ప్రశ్నలకు పవన్ తడబడకుండా సమాధానాలివ్వడం ఆకట్టుకుందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను ఏపీ రాజకీయాలకు ఎలా అన్వయించవచ్చో వివరించడం ద్వారా తాను విజన్ ఉన్న నాయకుడిగా చాటిచెప్పాలని పవన ప్రయత్నించినట్లు చెబుతున్నారు. అదే సమయంలో నెగెటివిటీని వదిలి, నిర్మాణాత్మకమైన సమాజాన్ని నిర్మించడానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ వాడాలని సూచించడం ద్వారా పవన్ యువతకు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించే ప్రయత్నం చేశారంటున్నారు. "మార్పు అనేది మన ఇంటి నుండే మొదలవ్వాలి" అన్న పవన్ కళ్యాణ్ పిలుపు జన్ జెడ్ యువతలో కొత్త ఆలోచనలను రేకెత్తించిందని అంటున్నారు. ఈ సమావేశం కేవలం ఒక రోజు ముచ్చటగా మిగిలిపోతుందా లేక ఏపీ రాజకీయాల్లో ఒక భారీ మార్పుకు పునాది వేస్తుందా అనేది కాలమే నిర్ణయించాలని వ్యాఖ్యానిస్తున్నారు.