గులాబీ బాస్ కు డబుల్ షాక్.. ఇప్పుడేం జరగనుంది?

విషయం ఏదైనా కానీ ‘నో’ చెప్పటం అంత తేలికైన విషయం కాదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.;

Update: 2026-01-31 04:21 GMT

విషయం ఏదైనా కానీ ‘నో’ చెప్పటం అంత తేలికైన విషయం కాదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ఇదే ‘నో’ అనే మాటను ఇట్టే చెప్పేసిన గులాబీ బాస్ కం మజీ ముఖ్యమంత్రికి అంతే వేగంగా అధికారుల నుంచి నో అనే మాటను ప్రతి సమాధానంగా రిసీవ్ చేసుకోవటం అరుదైన అంశంగా చెబుతున్నారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది.

ఇప్పటికే ఇదే కేసుకు సంబంధించి కేటీఆర్.. హరీశ్ రావు.. సంతోష్ రావులను విచారించిన సిట్ అధికారులు గులాబీ బాస్ కు ఈ కేసు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. అయితే.. ఈ కేసు విచారణను ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లోనే విచారణ చేపట్టాలని కోరారు. అదే సమయంలో తాను విచారణకుహాజరు కాలేనని స్పష్టం చేశారు. తన ఇంటికే వచ్చి.. తనను ప్రశ్నలు సంధించాలని అడిగినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి వేళ.. కేసీఆర్ వినతిని సిట్ తిరస్కరించింది.

ఫిబ్రవరి 1న (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటల వేళలో హైదరాబాద్ లోని కేసీఆర్ నివాసమైన నంది నగర్ లోని ఇంట్లో విచారణ చేపడతామని పేర్కొన్నారు. దీనికి తగ్గట్లు ఎర్రవెల్లిలోని తన ఫార్మర్ హౌస్ నుంచి తాజా విచారణ కోసం బయటకు అడుగు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. మరి.. సిట్ అధికారులు ఆదేశించినట్లుగా నంది నగర్ లోని కేసీఆర్ నివాసానికి హాజరవుతారా? అన్నది ప్రశ్నగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి చూస్తే.. కేసీఆర్ తనకు లభించిన అవకాశాన్ని మిస్ చేసుకున్నట్లుగా ఉంది.

ఎందుకంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని సిట్ కోరినప్పుడు.. అందుకు అంగీకరించి వెళ్లి ఉంటే.. అంతో ఇంతో సానుభూతి వచ్చేదని చెబుతున్నారు. అందుకు భిన్నంగా అధికారుల్ని తన ఫార్మర్ హౌస్ (ఒకప్పుడు దీన్నే ఫాంహౌస్ గా) రావాలని కోరటం సరైన నిర్ణయం కాదంటున్నారు. అందుకు ప్రతిగా సిట్ అధికారులు కేసీఆర్ విన్నపాన్ని తోసిపుచ్చుతూ విచారణకు రాలేమని.. ఆయనే నంది నగర్ కు రావాలని కోరారు. ఇలా ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కేసీఆర్ కు సిట్ డబుల్ షాకిచ్చినట్లుగా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన ఎదుర్కొనే ఫోన్ ట్యాపింగ్ విచారణ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News