జగన్ వంద రోజుల పాలనపై బాబు మార్కు కామెంట్లివే

Update: 2019-09-06 16:15 GMT
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా విపక్ష నేత - టీడీపీ అధినేత - నవ్యాంధ్ర తొలి సీఎం నారా చంద్రబాబునాయుడు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా జగన్ పాలనపై తనదైన శైలి నిప్పులు చెరిగిన చంద్రబాబు... జగన్ పాలనను రాక్షస పాలనగా అభివర్ణించారు. టీడీపీ నేతలు - కార్యకర్తలపై దాడులే లక్ష్యంగానే జగన్ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చంద్రబాబు తనదైన మార్కు విశ్లేషణతో విరుచుకుపడ్డారు.

జగన్ వంద రోజుల పాలనపై చంద్రబాబు ఏమన్నారన్న విషయానికి వస్తే... టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోతున్నాయంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా నివసించే హక్కు ఉందని - కానీ వైసీపీ వాళ్ల బెదిరింపులతో సొంత ఊళ్లు వదిలేసి పరాయి గ్రామాల్లో తలదాచుకోవాలా అంటూ ఆగ్రహంతో బాబు ఊగిపోయారు. నచ్చిన పార్టీకి ఓటేసినంత మాత్రాన చంపేస్తారా? పంటపొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటారా? రోడ్లకు అడ్డంగా గోడలు కడతారా? పాడిగేదెలకు విషం పెట్టి చంపుతారా - ఎస్సీలు - ముస్లిం మైనారిటీల ప్రాణాలతో చెలగాటం ఆడతారా అంటూ మండిపడ్డారు.

బోర్లు పూడ్చివేయడం - నీటి పైపులు కోసేయడం ఇవన్నీ రైతుల కష్టం తెలిసినవాళ్లు చేసే పనులేనా? అంటూ నిలదీశారు. వైసీపీ నేతల దుర్మార్గాలతో 70 ఏళ్ల రాజ్యాంగం - 73 ఏళ్ల స్వాతంత్య్రం నవ్వులపాలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. యజ్ఞం చేస్తుంటే దాన్ని భగ్నం చేయడానికి రక్తం చిమ్మడం - ఎముకలు చల్లడం పురాణాల్లోనే విన్నామని. ఇప్పుడు అంతకుమించిన రాక్షస కృత్యాలను ప్రత్యక్షంగా చూస్తున్నామని కూడా చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మానవతావాదులందరూ ఇలాంటి చర్యలను ఖండించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి రాక్షసపాలనను ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. ఫ్యాక్షన్ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు కూడా ఎవ్వరూ గతంలో ఇలా ప్రవర్తించలేదని - కక్షపూరిత రాజకీయాలకు జగన్ తొలిసారి శ్రీకారం చుట్టారని - ఇలాంటి విధ్వంసకర రాజకీయాలు గతంలో ఎప్పుడూ లేవని అన్నారు. టీడీపీ కార్యకర్తలు - నాయకులపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. తూర్పుగోదావరి జిల్లాలో తమ వాళ్లపై 21 కేసులు బనాయించారని - తమపై దాడి చేసి తిరిగి తమపైనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారని అన్నారు. పోలీసులకు అత్యుత్సాహం పనికిరాదన్నారు. పోలీసుల్లో ఇంత దిగజారుడుతనం గతంలో ఎప్పుడూ చూడలేదని - ఐపీఎస్ అధికారులే ఇలా వ్యవహరిస్తే ఎలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. 

‘ప్రతీకారం తీర్చుకునేందుకా ప్రజలు మీకు ఓటు వేసింది? మీ అధికారం శాశ్వతం కాదు..అమరావతి శాశ్వతం’ అంటూ వైసీపీపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి గొప్ప రాజధాని నగరం వద్దా? అని ప్రశ్నించారు. పులివెందుల పంచాయితీని రాష్ట్ర మంతా జగన్ విస్తరిస్తున్నారని - ఆఖరికి పోలవరం ప్రాజెక్టుపైనా ఆటలు ఆడుతున్నారని మండిపడ్డారు. టీడీపీకి ఉన్న క్యాడర్ ఏ పార్టీకి లేదని అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లు తప్ప వైసీపీకి సొంత క్యాడర్ లేదని - ఆ పార్టీకి ఏదో అవకాశం కలిసొచ్చి అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు.  తనకు రక్షణగా పోలీసులను పంపకుండా నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

పోలవరం ప్రాజెక్టుతో ఆడుకుంటున్నారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రేపు పోలవరానికి ఏమైనా జరిగితే గోదావరి జిల్లాలు ఏమవుతాయి? అని ప్రశ్నించారు. వైసీపీ వందరోజుల పాలన ఏపీకి ఓ శాపంగా అభివర్ణించారు. వందరోజుల పాలనలో ఏ ఒక్కపనీ చేపట్టలేదని విమర్శించారు. ఏపీలో వున్నది తీవ్రవాద ప్రభుత్వమని పారిశ్రామికవేత్తలు అనేలా చేశారని చంద్రబాబు విమర్శించారు. తోట త్రిమూర్తులు పార్టీని వీడే విషయం తన దృష్టికి రాలేదని అన్నారు. స్వలాభాల కోసం టీడీపీని వీడుతూ - తనపై అపవాదులు వేయడం సరికాదని హితవు పలికారు. ఒకరిద్దరు నేతలు వెళ్తే టీడీపీకి వచ్చే నష్టమేమీ లేదని - టీడీపీ పటిష్టంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా జగన్ వంద రోజుల పాలనపై చంద్రబాబు తనదైన మార్కు విశ్లేషణతో పాటు జగన్ మార్కు పాలనపై నిప్పులు చెరిగారు.


Tags:    

Similar News