కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. గోవా పార్టీ ఖాళీ!

Update: 2022-09-14 08:30 GMT
గోవాలో కాంగ్రెస్కు షాక్ తగిలింది. గోవా అసెంబ్లీలో కాంగ్రెస్‌ 11 మంది సభ్యులు ఉండగా.. అందులో 8 మంది బీజేపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు గోవా సీఎం ప్రమోద్ సావంత్, అసెంబ్లీ స్పీకర్తో భేటీ అయ్యారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తమతో కలిసేందుకు వీరంతా ముందుకొచ్చారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సదానంద్ శేఠ్ వెల్లడించారు. సావంత్‌ను కలిసిన నాయకుల జాబితాలో గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మైకెల్‌ లోబో సహా 8 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.

గోవాలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 40 స్థానాలకు గానూ బీజేపీ 20 సీట్లు దక్కించుకొంది. మెజార్టీ మార్కుకు ఒక్క సీటు తగ్గడంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించింది.

ఇప్పుడు వారిలో ఎనిమిది మంది ఇప్పుడు బీజేపీలో చేరడం ఖాయమైంది. అంటే మూడింట రెండొంతుల మంది పార్టీని వీడితే.. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును కూడా తప్పించుకునే అవకాశం ఉంది.

రెండు నెలల క్రితం కూడా కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ సమావేశానికి గైర్హాజరైన సమయంలోనూ ఈ తరహా వార్తలే వచ్చాయి. గోవా అసెంబ్లీ సమావేశానికి ఒక రోజు ముందు కాంగ్రెస్‌ పార్టీ సమావేశం ఏర్పాటు చేయగా.. ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు.

త్వరలోనే వారంతా బీజేపీలో చేరతారన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. సీనియర్ నేత ముకుల్ వాస్నిక్‌ను రంగంలోకి దింపి నాటి సంక్షోభం సద్దుమణిగేలా చూశారు.

ఇక 2019లో కూడా 15 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఒకవైపు కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపేందుకు అగ్రనేత రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేపట్టిన తరుణంలో తాజా పరిణామాలు పార్టీకి గట్టిదెబ్బేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మొత్తానికి బీజేపీ దెబ్బ‌తో కాంగ్రెస్ విల‌విల‌లాడుతుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News