ఏం చేద్దాం.. అమెరికాలోని భారతీయ విద్యార్థుల్లో ఆందోళన
అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులను ప్రస్తుతం ఒక పెద్ద ఆందోళన వెంటాడుతోంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) దరఖాస్తుల ఆలస్యం.;
అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులను ప్రస్తుతం ఒక పెద్ద ఆందోళన వెంటాడుతోంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) దరఖాస్తుల ఆలస్యం. ఈ జాప్యం కారణంగా చాలా మంది విద్యార్థులు తమ చట్టబద్ధమైన నివాస హోదాను కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఇటీవల రెడ్డిట్‌లో ఒక భారతీయ విద్యార్థి పంచుకున్న అనుభవం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. గ్రాడ్యుయేషన్ పూర్తయి 96 రోజులు గడిచినా, తన OPT దరఖాస్తుపై ఎటువంటి స్పందనా లేదని, ఇది తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తోందని ఆ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు.
- OPT ఆలస్యం.. పెరుగుతున్న ఆందోళన
సాధారణంగా విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత 60 రోజుల గ్రేస్ పీరియడ్ పొందుతారు. ఈ వ్యవధిలోపు వారికి వర్క్ పర్మిట్ ఈఏడీ ( Employment Authorization Document) లభించకపోతే, అమెరికాలో వారి చట్టబద్ధమైన నివాసానికి ప్రమాదం ఏర్పడుతుంది. సాంకేతికంగా USCIS (US Citizenship and Immigration Services)కి I-765 ఫారమ్‌ను సమర్పించి, నిర్ణయం కోసం వేచి ఉన్నంతవరకు విద్యార్థులు అమెరికాలో ఉండవచ్చు. అయితే, ఉద్యోగం లేకుండా, ఆదాయం లేకుండా, భవిష్యత్తుపై స్పష్టత లేకుండా ఇన్ని రోజులు గడపడం ఆర్థికంగా, మానసికంగా ఎంతో కష్టం.
-ఇది ఒక్కరి సమస్య కాదు
రెడ్డిట్‌లోని అనేక వ్యాఖ్యలు ఈ సమస్య ఎంత విస్తృతంగా ఉందో తెలియజేస్తున్నాయి. డజన్ల కొద్దీ విద్యార్థులు ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. కొందరు విద్యార్థులు ఉద్యోగాలు వచ్చినా, EAD లేకపోవడం వల్ల వాటిని కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. మరికొందరైతే, ఇక లాభం లేదని భారతదేశానికి తిరిగి వెళ్లాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి అమెరికాలో విద్యనభ్యసించిన భారతీయ విద్యార్థులకు ఇది నిజంగా తీరని నష్టం.
- USCIS నుండి స్పందన కరువు
దురదృష్టవశాత్తు, USCIS కార్యాలయాలు ఈ దరఖాస్తులను వేగవంతం చేయడంలో జాప్యం చేస్తున్నాయి. సాధారణ దరఖాస్తు ప్రక్రియ నెమ్మదిగా సాగడమే కాకుండా, 'ఎక్స్‌పెడైట్ రిక్వెస్ట్' ( లను కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆమోదిస్తామని USCIS చెబుతోంది. అయితే అలాంటి 'అత్యవసరం' ఏమిటో రుజువు చేయడం విద్యార్థులకు పెద్ద సవాలుగా మారింది. ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగావకాశాలు కోల్పోవడం వంటివి 'అత్యవసరంగా' పరిగణించబడతాయా లేదా అనేదానిపై స్పష్టత లేదు.
- ప్రభుత్వ జోక్యం ఆవశ్యకం
వేలాది మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. ఈ సమస్యపై అమెరికా ప్రభుత్వం వెంటనే స్పందించి, OPT దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే, ఉన్నత విద్య కోసం లక్షల రూపాయలు వెచ్చించి, ఎన్నో కలలతో అమెరికాకు వచ్చిన భారతీయ విద్యార్థుల కష్టాలు, ఆశలు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ ఆలస్యం వల్ల వారు తమ చట్టబద్ధమైన హోదాను కోల్పోతే, అది వారి కెరీర్‌తో పాటు దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.