వలస విధానం : ఐదేళ్ల చిన్నారి నిర్బంధం.. అమెరికాకు ఇది సిగ్గు చేటు
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై అనుసరిస్తున్న కఠిన విధానాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.;
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై అనుసరిస్తున్న కఠిన విధానాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా మిన్నెసోటాలో ఐదేళ్ల చిన్నారిని ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం పెను సంచలనంగా మారింది.
మిన్నెసోటాలోని ఒక ప్రీస్కూల్ నుంచి తన తండ్రితో కలిసి ఇంటికి వెళ్తున్న లియామ్ కోనెజో రామోస్ అనే ఐదేళ్ల బాలుడిని, అతడి తండ్రి అడ్రియన్ అలెగ్జాండర్ కోనెజో అరియాస్‌ను ఇమిగ్రేషన్ అధికారులు (ఐసీఈ) అదుపులోకి తీసుకున్నారు. వారిని నేరుగా టెక్సాస్‌లోని ఒక నిర్బంధ కేంద్రానికి తరలించడం ఇప్పుడు విమర్శలకు దారితీసింది.
ఈ కుటుంబం 2024లో అమెరికాకు వలస వచ్చింది. స్కూల్ ముగించుకుని వస్తుండగా ఫెడరల్ అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కుటుంబానికి ఎలాంటి బహిష్కరణ ఉత్తర్వులు లేవని, అయినా ఇలా నిర్బంధించడం చట్టవిరుద్ధమని బాధితుల తరపు న్యాయవాది పేర్కొన్నారు.
ప్రభుత్వ వివరణ
ఈ ఘటనపై వస్తున్న విమర్శలను హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) తోసిపుచ్చింది. బాలుడి తండ్రి ఈక్వెడార్ జాతీయుడని అతను దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటున్నందునే అదుపులోకి తీసుకున్నామని ప్రతినిధి ట్రిసియా మెక్‌లిఫ్లిన్ తెలిపారు. పిల్లాడిని లక్ష్యంగా చేసుకోలేదని, తండ్రిని అరెస్ట్ చేసిన సమయంలో బాలుడి భద్రత కోసం ఒక అధికారిని అతడితో ఉంచామని వివరణ ఇచ్చారు.
రాజకీయ దుమారం..
ఈ ఉదంతం అమెరికా రాజకీయాల్లో వేడి పుట్టించింది. ఇమిగ్రేషన్ అధికారులు కేవలం చట్టవిరుద్ధంగా ఉన్న తండ్రిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారని.. చిన్నారిని కాదని ఆయన సమర్థించుకున్నారు. ఈ ఘటనపై మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఒక ఐదేళ్ల చిన్నారిని ఇలా నిర్బంధించడం అత్యంత దారుణం.. ఇది నన్ను తీవ్రంగా కలచివేసింది" అని ఆమె ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరిహద్దు భద్రత, అక్రమ వలసల విషయంలో శూన్య సహనం పాటిస్తోంది. అయితే చిన్న పిల్లలను కూడా ఇలాంటి ఆపరేషన్లలో ఇరికించడం మానవ హక్కుల ఉల్లంఘన అని పౌర సమాజం ఆవేదన వ్యక్తం చేస్తోంది.