అబ్రాడ్ లో వెంటాడిన మృత్యువు.. భారతీయ విద్యార్థిని మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతూ ఉజ్వల భవిష్యత్తును వెతుక్కుంటున్న భారతీయ విద్యార్థులను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.;

Update: 2026-01-14 05:02 GMT

విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతూ ఉజ్వల భవిష్యత్తును వెతుక్కుంటున్న భారతీయ విద్యార్థులను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా కజకిస్తాన్‌లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం భారత విద్యార్థి లోకంలో పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఒక భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు.

విహారయాత్రలో ఊహించని విషాదం

వివరాల్లోకి వెళ్తే.. కజకిస్తాన్‌లోని ప్రసిద్ధ సెమే మెడికల్ యూనివర్సిటీ లో వైద్య విద్యను అభ్యసిస్తున్న 11 మంది భారతీయ విద్యార్థుల బృందం విహారయాత్ర కోసం బయలుదేరింది. వీరంతా ఆల్టాయ్ ఆల్ప్స్ పర్వత ప్రాంతాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా ఓస్కెమెన్ పట్టణం సమీపంలో వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.

మృతులు.. బాధితుల వివరాలు

ఈ ఘోర ప్రమాదంలో మిలీ మోహన్ అనే భారతీయ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఉన్న మరో ఇద్దరు విద్యార్థినులు, ఆశిక షీజమిని, జసీనా బి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు.. అధికారులు వెంటనే స్పందించి బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందుతోంది.

స్పందించిన భారత దౌత్య కార్యాలయం

ప్రమాదం జరిగిన వెంటనే కజకిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షిస్తోంది. మృతురాలి భౌతికకాయాన్ని త్వరితగతిన స్వదేశానికి పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాయబార కార్యాలయం ప్రకటించింది. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా స్థానిక ఆసుపత్రి వర్గాలతో సమన్వయం చేసుకుంటున్నామని.. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని దౌత్య అధికారులు తెలిపారు.

పెరుగుతున్న ఆందోళన

ఇటీవలి కాలంలో విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే వరుసగా జరుగుతున్న ఇటువంటి ప్రమాదాలు.. దుర్ఘటనలు విదేశాల్లో ఉన్న విద్యార్థుల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థుల క్షేమం కోసం మరిన్ని భద్రతా చర్యలు.. పర్యవేక్షణ అవసరమని తల్లిదండ్రులు కోరుతున్నారు.

మిలీ మోహన్ మృతితో ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వైద్యురాలిగా తిరిగి వస్తుందనుకున్న కూతురు విగతజీవిగా మారుతుండటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Tags:    

Similar News