సౌదీలో రాజమండ్రి వాసుల మర్డర్ మిస్టరీ.. ప్రేమ వ్యవహారమే కారణమా? అసలేం జరిగింది?
సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో ఓ తెలుగు కుటుంబం దారుణ హత్య మిస్టరీగా మారింది.;
సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో ఓ తెలుగు కుటుంబం దారుణ హత్య మిస్టరీగా మారింది. తొలుత ఆన్ లైన్ గేమ్స్ కు బానిసగా మారిన కుమారుడే తల్లిదండ్రులను హతమార్చి తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే సౌదీలో ఆ కుటుంబానికి సన్నిహితులు, బంధువులు మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. హత్యకు గురైన దంపతుల కుమారుడు ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్నాడని, ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలకు సైతం హాజరవుతున్నాడని చెబుతున్నారు. తాను చదువుతున్న పాఠశాలలో ఓ యువతిని ప్రేమించాడని, యువతి బంధువులు ఈ విషయంలో గొడవ పడ్డారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హత్యలు జరిగాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రియాద్ లో తెలుగు కుటుంబానికి చెందిన యువకుడు తొలుత తల్లి, తండ్రిని హతమార్చి తర్వాత అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానిక మీడియా లో ప్రచారం జరిగింది. తెలుగు ప్రవాసీయులు ఎక్కువగా నివసించే హరా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే, సౌదీ మీడియా ప్రసారం చేసిన కథనాలను బంధువులు ఖండించడంతో అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. రాజమండ్రికి చెందిన దంపతులు కుమారుడుతో కలిసి రియాద్ లో ఉంటున్నారని బంధువులు చెబుతున్నారు. ఆ దంపతులకు అతడు ఒక్కడే కొడుకు. ఈ కుటుంబం అందరితో కలసి మెలసి జీవనం సాగిస్తుండేదని అంటున్నారు. రియాద్ లోని ఒక ఇన్సూరెన్స్ కంపెనీ లో తండ్రి, డిల్లీ పబ్లిక్ స్కూల్ పాఠశాలలో తల్లి పనిచేస్తున్నారు. కుమారుడు కూడా అదే స్కూల్ లో చదువుకుంటున్నట్లు చెబుతున్నారు.
మృతులు స్థానికంగా అందరితో కలసిమెలసి ఉండేవారని అంటున్నారు. అయితే జోర్డాన్ కు చెందిన ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఈ హత్యలకు కారణమై ఉండొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. ఆ యువతి కూడా అదే పాఠశాలలో చదువుతోందని చెబుతున్నారు. తొలుత ఇద్దరు ప్రేమించుకున్నారని, తర్వాత అమ్మాయి యువకుడిని దూరం పెట్టిందని ప్రచారం జరుగుతోంది. దీంతో యువకుడు తన వద్ద ఉన్న ఫొటోలను యువతి తల్లిదండ్రులకు పంపాడని, దీనిపై వారు నెల రోజుల క్రితం తగాదా పడినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే హత్యలు జరగడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు తొలుత భార్యభర్తలను హతమార్చారని చెబుతున్నారు. ఆ తర్వాత విద్యార్థిని చంపి, అతడే ఈ దురాగతానికి పాల్పడినట్లు ప్రచారం అయ్యేలా చేస్తున్నారని అంటున్నారు.
మృతదేహాలను చూడటానికి ఎవరినీ అనుమతించకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయని అంటున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకోవడం, తల్లిదండ్రులను కుమారుడు చంపాడని ప్రచారం చేయడంపై మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. గల్ఫ్ మీడియా ప్రచారం చేసినట్లు తల్లిదండ్రులను కుమారుడు హత్య చేస్తే ఆయన ధరించిన షర్ట్ పై కనీసం రక్తం మరకలు ఉండాలి కదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. గత క్రిస్మస్ కు ఇండియా కు వచ్చినట్లు చెబుతున్నారు.