అమెరికా డ్రీమ్ కంటే హైదరాబాద్ ఆనందం మిన్న… టెకీ మనసు గెలిచిన నిర్ణయం!

గత నాలుగు, ఐదు సంవత్సరాలుగా మెరుగైన జీవన స్థితి.. అధిక ఆదాయం కోసం భారతీయ విద్యార్థులు.. ఐటీ ఉద్యోగులు భారీ సంఖ్యలో అమెరికాకు వెళ్తున్నారు.;

Update: 2026-02-25 10:30 GMT

గత నాలుగు, ఐదు సంవత్సరాలుగా మెరుగైన జీవన స్థితి.. అధిక ఆదాయం కోసం భారతీయ విద్యార్థులు.. ఐటీ ఉద్యోగులు భారీ సంఖ్యలో అమెరికాకు వెళ్తున్నారు. అయితే ఇటీవల పరిస్థితులు మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అమలు చేస్తున్న కఠిన వలస విధానాలు.. మరోవైపు టెక్ కంపెనీల్లో నియామకాల మందగమనం ఉద్యోగులపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హెచ్1బి వీసా కలిగిన ఉద్యోగులకు భవిష్యత్‌పై అనిశ్చితి పెరిగింది.

ఈ నేపథ్యంలో 32 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ ఒకరు అమెరికా నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన అనుభవం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈయన రెడిట్‌లో చేసిన పోస్టు ద్వారా తన అనుభవాలను పంచుకున్నారు. అమెరికాలో మంచి జీవన ప్రమాణాలు ఉన్నప్పటికీ ఒంటరితనం తీవ్రంగా బాధించిందని ఆయన తెలిపారు. ఉద్యోగం కోల్పోవడంతో హెచ్1బి వీసా సమస్యలు ఎదుర్కొని ఐదు నెలల క్రితం హైదరాబాద్‌కు తిరిగి వచ్చానని చెప్పారు.

ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి ఉండటం వల్ల మానసికంగా చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. అమెరికాలో ఉన్నప్పుడు ఉన్న ఒత్తిడి, భయం ఇప్పుడు లేకపోవడం పెద్ద ఉపశమనం అని పేర్కొన్నారు.

అధిక ఆదాయం ఉన్నప్పటికీ కుటుంబం దూరంగా ఉండటం, ఒంటరితనం అనేక మందిని మానసికంగా దెబ్బతీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. హెచ్1బి వీసా భయం, కఠిన వలస విధానాలు కూడా ఈ పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయని చెప్పారు.

ఇలాంటి అనుభవాలు ఇతర భారతీయ టెకీలలో కూడా ఉండే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రభావంతో టెక్ రంగంలో ఉద్యోగావకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో అమెరికాలో ఉండటం కష్టంగా మారుతోంది.

ఈ పరిస్థితుల్లో మరింత మంది భారతీయులు తిరిగి స్వదేశానికి రావచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో అధిక సంపాదన ఉన్నా మనుషుల మధ్య అనుబంధం, కుటుంబంతో గడిపే సమయం ఇచ్చే సంతోషం మరెక్కడా దొరకదని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

Tags:    

Similar News