భోగాపురం ఎయిర్ పోర్టు ఓపెనింగ్.. ప్రధాని మోదీ, రైతుల కోసం ప్రభుత్వం స్పెషల్ ఎఫెక్ట్స్!

వచ్చేనెల 1న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగున్న ఈ కార్యక్రమంపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించింది.

Update: 2026-07-21 10:15 GMT

వచ్చేనెల 1న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగున్న ఈ కార్యక్రమంపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ప్రతి గడప ఈ వేడుకను ఘనంగా జరుపుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. భూములు ఇచ్చిన రైతులకు ఉచిత విమాన ప్రయాణం కల్పించడంతోపాటు ఎయిర్ పోర్టుకు అనుబంధంగా ఏవియేషన్ వర్సిటీ, జీఎంఆర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యుసిటీ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఉత్తరాంధ్రను గ్లోబల్ కనెక్టివిటీకి కేంద్రంగా మార్చేందుకు భోగాపురం విమానాశ్రయాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా విమానాశ్రయం కోసం భూములు కోల్పోయిన రైతుల ఆశీస్సులు దక్కించుకునేలా కీలక నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. భూములిచ్చిన రైతులు, యజమానులందరికీ ఒకమారు ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఆలోచనపై విస్తృత చర్చ జరుగుతోంది. 2014-19 మధ్య విమానాశ్రయం నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని ప్రభుత్వం భారీగా భూ సేకరణ చేసింది. అయితే ఈ విషయమై అప్పట్లో తీవ్ర పోరాటం జరిగింది. ఫలితంగా ప్రభుత్వంపై రైతుల్లో అసంతృప్తి నెలకొందనే ఆలోచనతో ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.

భూములు ఇచ్చిన రైతుల త్యాగం వృథాగా పోలేదని చాటిచెప్పడమే కాకుండా, భవిష్యత్తులో ఈ ప్రాంతం అభివృద్ధికి రైతులు దోహదపడ్డారనే విషయాన్ని తెలియజేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఈ విధంగా రైతుల్లో అసంతృప్తిని తొలగించడమే కాకుండా వారి త్యాగాలకు విలువ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయాన్ని కేవలం రాకపోకల కేంద్రంగానే కాకుండా, ఉత్తరాంధ్రను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి ఒక వేదికగా మలిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించేందుకు రైతులను ముందుకు తీసుకువస్తోందని భావిస్తున్నారు.

రెండు జిల్లాల కలెక్టర్లకు బాధ్యతలు

కాగా, విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతలను ప్రభుత్వం విజయనగరం, శ్రీకాకుళం కలెక్టర్లకు అప్పగించింది. అంతేకాకుండా ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులు అందరూ ప్రధాని సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ కార్యక్రమంపై పది రోజుల పాటు విస్తృత ప్రచారం చేయడంతోపాటు ఆగస్టు 1న ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం సూచించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు, ప్రత్యేక పార్కింగ్ స్లాట్లతో పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నారు. సభకు వచ్చే వారి కోసం అల్పాహారం, భోజనం, తాగునీటి సదుపాయాలు కల్పించేలా కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News