మా పవన్ అన్న.. తమ్ముడు లోకేశ్ ఎమోషనల్!
ఏపీలో ప్రభుత్వాన్ని నడుపుతున్న కూటమి పార్టీల నేతల మధ్య అనుబంధం రాజకీయాన్ని దాటి వ్యక్తిగత అనుబంధంగా మారుతుందా? అన్న చర్చ జరుగుతోంది.
ఏపీలో ప్రభుత్వాన్ని నడుపుతున్న కూటమి పార్టీల నేతల మధ్య అనుబంధం రాజకీయాన్ని దాటి వ్యక్తిగత అనుబంధంగా మారుతుందా? అన్న చర్చ జరుగుతోంది. రెండేళ్లుగా కూటమిగా కలిసి పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భవిష్యత్తులోనూ అదే అనుబంధాన్ని కొనసాగిస్తామని పదేపదే చెబుతున్నారు. కూటమి 15 ఏళ్లు ఉండాలని, తమ స్థాయిలో ఎలాంటి భేదాభిప్రాయాలకు తావులేకుండా పనిచేస్తున్నామని ఇద్దరు అగ్రనేతలు కేడర్ కు సంకేతాలు పంపుతున్నారు. ఇదే సమయంలో పవన్ తమకు చాలా ముఖ్యమని, ఆయనతో అనుబంధం కేవలం రాజకీయం మాత్రమే కాదని మంత్రి నారా లోకేశ్ చెబుతున్నారు. ఈ విషయంలో ఏమాత్రం అవకాశం దొరికినా పవన్ తన పెద్దన్న అంటూ లోకేశ్ చెబుతుండటం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో ఉన్న అనుబంధంపై మంత్రి లోకేశ్ మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మూడు పార్టీల నేతలను వేదికపైకి ఆహ్వానించి అందరి సమక్షంలో పేదలకు మంత్రి పట్టాలు అందజేశారు. ఈ క్రమంలో పవన్ తో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ లోకేశ్ ఎమోషనల్ అయ్యారు. కూటమి ప్రభుత్వంతోపాటు తనకు వ్యక్తిగతంగా అండదండగా నిలుస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోసం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చంద్రబాబును తప్పుడు కేసులో జైలుకు పంపిన సమయంలో పవన్ తనకు ఫోన్ చేసి అండగా నిలిచారని గుర్తు చేశారు. రాజకీయాలు వేరు, వ్యక్తిగత అనుబంధాలు వేరు అంటూ వ్యాఖ్యానించిన లోకేశ్ ఉప ముఖ్యమంత్రితో తన అనుబంధాన్ని రాజకీయాన్ని మించి వ్యక్తిగత అనుబంధంగా మారిందని స్పష్టం చేశారు.
ఉప ముఖ్యమంత్రి విషయంలో తన కృతజ్ఞతను చాటుకోవడానికి మంత్రి లోకేశ్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల తర్వాత కూడా గత ప్రభుత్వంలో ఎదురైన అవమానాలు, ఆ సమయంలో పవన్ బాసటగా నిలిచిన సందర్భాన్ని తెలియజేయడానికి లోకేశ్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విషయంలో కార్యకర్తలు కూడా ఎటువంటి మొహమాటాలు పెట్టుకోవద్దని పరోక్షంగా సూచనలు చేస్తున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కూటమిలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, అయితే అవన్నీ రాజకీయ పరమైన సమస్యలుగానే మంత్రి లోకేశ్ చూస్తున్నారు. పవన్ తో రాజకీయం కన్నా వ్యక్తిగత అనుబంధమే ఎక్కువగా పెనవేసుకుందని, ఈ కారణంగా ఆయనను వదులుకోలేమని యువనేత స్పష్టత ఇస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ పవన్ ప్రాధాన్యం తెలియజేసేలా మంత్రి లోకేశ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విధంగా పవన్ ఆదరాభిమానాలు పొందడానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వం తరఫున నిర్వహించిన కార్యక్రమాలు అయినా, తెలుగుదేశం పార్టీ అంతర్గత సమావేశాలు అయినా పవన్ ప్రస్తావన లేకుండా లోకేశ్ ప్రసంగాలు ఉండటం లేదని చెబుతున్నారు. యువనేత ఎక్కడికి వెళ్లినా అన్న సమానమైన పవనన్న.. నా పెద్దన్న అంటూ సంభోదిస్తూ ఉప ముఖ్యమంత్రి అండదండలు నిరంతరం కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలియజేస్తున్నారని, ఈ విధంగా రాజకీయంగా కూడా పరిణతితో అడుగులు వేస్తున్నారని అంటున్నారు.