ఎన్‌ఆర్‌ఐ మరణ కేసులో ఊహించని మలుపు.. కన్న తల్లిదండ్రులను తాకిన పిడుగు లాంటి వార్త!

మంగళూరులోని సోమేశ్వరకు చెందిన పునీత్ పూజారి గత ఏడాదిన్నర కాలంగా ఓమన్‌లో ఒక ప్రైవేట్ లిఫ్ట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.;

Update: 2026-03-03 22:30 GMT

యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి ఎంతకైనా దారితీస్తున్న ఘటనలు రోజూ మనం చూస్తూనే వున్నాము. అలాంటి సంఘటనే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మంగళూరుకు చెందిన ఓ యువకుడు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి, చివరకు అక్కడే విగతజీవిగా మారిన ఘటన అందరినీ కలచివేస్తోంది. ఓమన్‌లో లిఫ్ట్ కంపెనీలో పనిచేస్తున్న 32 ఏళ్ల పునీత్ పూజారి ఆత్మహత్య చేసుకోవడం తీరని విషాదాన్ని మిగిల్చింది. అయితే, ఈ బలవన్మరణం వెనుక ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని వస్తున్న వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు చూద్దాం.

ఉపాధి కోసం వెళ్లి.. ప్రాణాలు తీసుకున్న యువకుడు:

మంగళూరులోని సోమేశ్వరకు చెందిన పునీత్ పూజారి గత ఏడాదిన్నర కాలంగా ఓమన్‌లో ఒక ప్రైవేట్ లిఫ్ట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సుమారు నెలన్నర రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపి వెళ్ళాడు. ఇక అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న టైం లో, అతడు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త కుటుంబ సభ్యులకు పిడుగులా తగిలింది. కన్నకొడుకు తమను ఆర్థికంగా ఆదుకుంటాడని ఆశపడ్డ తల్లిదండ్రులకు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆ ఊరి ప్రజలంతా ఈ విషాద వార్త విని షాక్‌కు గురయ్యారు.

ప్రేమ విఫలమే కారణమా? సోషల్ మీడియా సాక్ష్యాలు:

పునీత్ ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టగా కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పునీత్ గత నాలుగేళ్లుగా ఉర్వ ప్రాంతానికి చెందిన ఒక యువతితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకున్నారు. ఇక అయితే, గత కొన్ని రోజులుగా ఆ యువతి పునీత్ ఫోన్ కాల్స్ గానీ, మెసేజ్‌లు గానీ రిసీవ్ చేసుకోవడం లేదని సమాచారం. ఈ మార్పును పునీత్ తట్టుకోలేకపోయాడు. తాను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దూరం అవుతోందన్న ఆవేదన అతడిని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేసింది.

మానసిక సంఘర్షణ.. విషాదాంతమైన జీవితం:

ప్రేమించిన అమ్మాయి నుంచి స్పందన లేకపోవడంతో పునీత్ మానసిక స్థితి పూర్తిగా దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక సుదూర ప్రాంతంలో ఒంటరిగా ఉంటూ, తన మనసులోని బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక అతడు కుంగిపోయాడు. ఇక చివరకు ఆ మానసిక సంఘర్షణే అతడిని బలవన్మరణానికి పురికొల్పింది. అయితే, దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాతే అసలు ఏం జరిగిందనేది స్పష్టమవుతుంది. ఈ ఘటన మరోసారి యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి మరియు రిలేషన్‌షిప్ సమస్యలపై ఆందోళన కలిగిస్తోంది.

Tags:    

Similar News