ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లకు 'బ్రేక్'.. భారత బ్యాంకుల్లో తగ్గిన విదేశీ భారతీయుల పెట్టుబడులు!

విదేశాల్లో ఉన్న భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) భారత బ్యాంకులపై చూపుతున్న నమ్మకం తగ్గుతోందా? 2025లో ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లలో గణనీయమైన పతనం నమోదవడం ఇదే అనుమానాలకు తావిస్తోంది.;

Update: 2026-01-22 11:30 GMT

విదేశాల్లో ఉన్న భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) భారత బ్యాంకులపై చూపుతున్న నమ్మకం తగ్గుతోందా? 2025లో ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లలో గణనీయమైన పతనం నమోదవడం ఇదే అనుమానాలకు తావిస్తోంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఈ ఏడాది భారత బ్యాంకుల్లోకి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ నిధులు భారీగా తగ్గాయి. ముఖ్యంగా విదేశీ కరెన్సీ డిపాజిట్లలో ఇన్‌ఫ్లోలు పడిపోవడం ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

భారత బ్యాంకింగ్ రంగానికి వెన్నుముకగా నిలిచే ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లలో 2025 ఆర్థిక సంవత్సరంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. గతంతో పోలిస్తే విదేశీ భారతీయులు మన బ్యాంకుల్లో జమ చేసే నిధుల ప్రవాహం గణనీయంగా తగ్గడం ఇప్పుడు ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

భారీగా పడిపోయిన ఇన్‌ఫ్లోలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 2025 ఏప్రిల్ నుండి నవంబర్ మధ్య కాలంలో ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్ల రాక 26.6 శాతం మేర క్షీణించింది. 2024 (అదే కాలంలో) 12.55 బిలియన్ డాలర్లు. 2025 (ప్రస్తుతం) 9.2 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది.

ఎఫ్‌సీఎన్‌ఆర్ డిపాజిట్లపై ఆసక్తి కరువు

ఈ తగ్గుదలకు ప్రధాన కారణం ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (FCNR) డిపాజిట్లలో కనిపిస్తున్న మందగమనం. సాధారణంగా కరెన్సీ హెచ్చుతగ్గుల వల్ల వచ్చే నష్టాల నుంచి రక్షణ ఉండటంతో ఎన్‌ఆర్‌ఐలు వీటిపై మొగ్గు చూపుతారు. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో మారుతున్న వడ్డీ రేట్లు, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి కారణంగా ఎన్‌ఆర్‌ఐలు తమ పెట్టుబడులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

రూపాయి ఖాతాల్లో 'స్వల్ప' ఊరట

విదేశీ కరెన్సీ డిపాజిట్లు తగ్గినప్పటికీ రూపాయి ఆధారిత ఖాతాలు కొంత ఆశాజనకంగా ఉన్నాయి. ఇవి స్వల్ప వృద్ధిని నమోదు చేశాయి. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై విదేశీ భారతీయులకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. భారతదేశంలో వచ్చే ఆదాయాన్ని (అద్దెలు, డివిడెండ్లు) దాచుకునే ఈ ఖాతాల్లోనూ స్వల్ప పెరుగుదల కనిపించింది.

బ్యాంకుల ముందున్న సవాలు

కొత్తగా వచ్చే పెట్టుబడులు తగ్గినప్పటికీ బ్యాంకుల్లో ఉన్న పాత నిధులు స్థిరంగా ఉండటంతో మొత్తం డిపాజిట్లు 168 బిలియన్ డాలర్లకు చేరాయి. అయినప్పటికీ గ్లోబల్ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎన్‌ఆర్‌ఐలను ఆకర్షించేందుకు భారత బ్యాంకులు తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News