ఇక సెలవు.. కావూరి స్వీయ ప్రకటన, వీడిన సందిగ్ధం

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మరణంపై ఆయన కుటుంబం నుంచి ప్రకటన విడుదలైంది.;

Update: 2026-03-11 07:48 GMT

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మరణంపై ఆయన కుటుంబం నుంచి ప్రకటన విడుదలైంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాజీ మంత్రి కావూరి మరణించారు. అయితే ఆయన మరణ సమాచారం తెలియజేసిన కుటుంబం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందిన వివరాలు ఏవీ వెల్లడించలేదు. ‘ఇక సెలవు’ అంటూ కావూరి స్వయంగా ప్రకటన చేసినట్లు ఆయన పేరుతో పత్రికలకు ప్రకటనలిచ్చారు. దీంతో కావూరి మరణించినట్లు ఆయన కుటుంబం తరఫున అధికారికంగా ప్రకటించనట్లైంది. వాస్తవానికి రెండు రోజుల క్రితమే కావూరి మరణించినట్లు మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆయన కుటుంబం, వైద్య బృందం నుంచి అధికారిక ధృవీకరణ లేకపోవడంతో కొంత గందరగోళం ఏర్పడింది.

కావూరి పరిస్థితి విషమంగా ఉందంటూ ముందుగా మరణ సమాచారం తెలియజేసిన మీడియా సంస్థలు తమ ప్రకటనలను సవరించుకున్నాయి. అయితే ఒక రోజు గడిచేసరికి కావూరి మరణంపై ఆయన కుటుంబం పత్రికాముఖంగా ప్రకటన ఇచ్చింది. అయితే ఇది శ్రద్ధాంజలి ప్రకటనలా కాకుండా.. ఇక సెలవు తీసుకుంటున్నట్లు కావూరి స్వయంగా ప్రకటన చేసినట్లు ఉంది. దీంతో కావూరి మరణించారని చెప్పడానికి కూడా ఆయన కుటుంబం అంగీకరించలేనంత దుఃఖాన్ని అనుభవిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇన్నాళ్లు ప్రజా జీవితంలో అలసిపోయిన కావూరి ఇక నుంచి సెలవు తీసుకుంటున్నట్లు ప్రకటించి శాశ్వత నిద్రలోకి జారిపోవడం ఆయన అభిమానులను, అనుచరులను విచారానికి గురిచేసింది.

మరోవైపు కావూరి మరణంపై కుటుంబం నుంచి అధికారికంగా ప్రకటన విడుదల కాకపోవడంతో రెండు రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. దీంతో ఆయనతో కలిసి పనిచేసిన వారు, ఆయన వెన్నంటి నడిచిన వారు మాజీ ఎంపీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక కావూరి అంతిమ సంస్కారాలను హైదరాబాద్ లోనే నిర్వహించాలని కుటంబ సభ్యులు భావిస్తున్నారు. కావూరికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. విశాఖ ఎంపీ శ్రీభరత్ తల్లి శ్రీమణి కావూరి రెండో కుమార్తె. ప్రస్తుతం కావూరి వయసు 82 ఏళ్లు.

దాదాపు ఎనిమిది దశాబ్దాల సంపూర్ణ జీవితం చూసిన కావూరి, ఈ భౌతిక జీవనానికి స్వస్తి పలికే సమయం ఆసన్నమైందని నమ్ముతున్నానంటూ ఆయన స్వీయ ప్రకటన చేస్తున్నట్లు పత్రికాముఖంగా వెల్లడించిన కుటుంబం కావూరికి ఘనమైన నివాళి అర్పించింది. కావూరి జీవిత విశేషాలు, కుటుంబ వివరాలు, ఆయన నేపథ్యం మొత్తం ఆ ప్రకటనలో వివరిస్తూ ‘ఇక సెలవు’ తీసుకుంటున్నట్లు కావూరి ప్రకటించిన వైనం చావును కూడా స్వాతగించకతప్పని సత్యాన్ని గుర్తు చేస్తోందని అంటున్నారు.

Tags:    

Similar News