జగన్ కామెంట్స్ మీద భిన్నాభిప్రాయాలు

''సీదిరి అప్ప‌ల‌రాజు క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చాడు. ప‌దో త‌ర‌గ‌తిలో స్టేట్ ఫ‌స్ట్ వ‌చ్చాడు. అంత బాగా చ‌దువుకుని డాక్ట‌ర్ అయ్యాడు. అందుకే చంద్ర‌బాబుకు సీదిరి అంటే కోపం.

Update: 2026-07-30 14:30 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర కు వచ్చారు. శ్రీకాకుళంలో అంపోలు జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని ఆయన ములాఖత్ ద్వారా పలకరించాలని అనుకున్నారు. అయితే ఆయన రోడ్డు మార్గంలో రావడంతో బాగా ఆలస్యం జరిగింది. దాంతో ములాఖత్ కి సమయం మించిపోవడంతో అధికారులు దానిని రద్దు చేసారు జగన్ సీదిరి కుటుంబ సభ్యులతో మాట్లాడి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. అక్కడి వరకూ బాగానే ఉన్నా ఈ సందర్భంగా ఆయన సీదిరిని ఆయన కుమారుడిని సపోర్టు చేస్తూ చేసిన వ్యాఖ్యల మీదనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు.

చిన్న పిల్లోడు అంటూ :

సీదిరి కుమారుడు బైక్ మీద వెళ్తూ యాక్సిడెంట్ చేయడంతో ఒకరి మరణించారు. దాంతో అతని మీద పోలీసులు కేసు ఫైల్ చేసి అరెస్టు చేశారు. ఆ తరువాత తమ కుమారుడిని ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారు అని సీదిరి మీద కూడా కేసు పెట్టి జైల్లో ఉంచారు. అయితే దీని మీద జగన్ మాట్లాడుతూ చిన్న పిల్లోడు అని యాక్సిడెంట్ చేసిన సీదిరి కుమారుడి మీద సానుభూతి వ్యక్తం చేయడం చర్చనీయాంశం అవుతోంది. చిన్న పిల్లోడు అయినా అవతల ఒక వ్యక్తిని చంపేశారు కదా అంటున్నారు నెటిజన్లు. అంతే కాదు హత్య చేసిన వారిని పరామర్శించడమేంటని కూడా మండిపడుతున్నారు.

లాజిక్ కి అందకుండా :

మరో వైపు యాక్సిడెంట్ ఎవరూ కోరి చేయరు కదా అని జగన్ సీదిరి కుటుంబాన్ని సమర్థించే ప్రయత్నం చేశారు. నిజమే కోరి చేయరు, కానీ యాక్సిడెంట్ అంటేనే అది. కానీ ఆ తర్వాత అయినా ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి తమ కుమారుడిని చట్ట ప్రకారం తానే అప్పగించి ఉంటే కధ వేరుగా ఉండేది కదా అని అంటున్నారు. అవతల కూడా పేద కుటుంబం బలహీన వర్గాల కుటుంబమే కదా అని కూడా పోలిక తెస్తున్నారు. జగన్ సానుభూతి మద్దతు ఒక వైపేనా అన్న ప్రశ్నలు కూడా వేస్తున్నారు.

అనవసరంగానేనా :

తన పార్టీని కాపాడుకోవడం, తన నాయకులకు అండగా ఉండడం ఏ అధినాయకుడికి అయినా తప్పనిసరి. అది అనివార్యం కూడా. కానీ ఇలాంటి కేసుల విషయంలో కూడా మరీ ఆశ్రిత పక్షపాతంగా వ్యవహరిస్తే తటస్థులు పౌర సమాజం ఏ విధంగా వైసీపీ గురించి ఆలోచిస్తుంది అన్నది కూడా చూసుకోవాలి అని అంటున్నారు. ఈ విషయంలో వైసీపీ కానీ జగన్ కానీ అతిగా స్పందిస్తున్నారా అన్న మాట కూడా వస్తోంది. యాక్సిడెంట్ జరిగినపుడు చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. తర తమ భేదాలు ఉండవు అని అంటున్నారు. ఈ రోజున యాక్సిడెంట్లు ఎలా జరుగుతున్నాయన్నది డేటా తీస్తే అతి వేగం నిర్లక్ష్యం కారణంగానే అని అంటున్నారు.

జనాలు చూస్తున్న కోణం :

అయితే వైసీపీ మాత్రం దీనిని కుట్ర అంటోంది అని కూటమి నేతలు కూడా మండిపడుతున్నారు. ఇందులో కుట్ర ఏముంది అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమయల మీద అధినాయకత్వం పర్యటనలు చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్పు లేదని దాని వల్ల పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని కానీ సొంత పార్టీ నేతలు ఏమి చేసినా మేముంటామని మద్దతు ఇచ్చేలా వ్యవహరించడం వల్ల పార్టీ జనాలకు బాగానే ఉన్నా పౌర సమాజం నుంచి మాత్రం స్పందన వేరేగా ఉంటుందని సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఇష్యూలో జనాలు చూస్తున్న కోణం వేరుగా ఉంది, వైసీపీ వారు తీరు మరోలా ఉంది అని అంటున్నారు అక్కడ ఒక నిండు ప్రాణం పోయింది అన్నది జనాల నుంచి వస్తున్న రియాక్షన్ గా కనిపిస్తోంది.

Tags:    

Similar News