సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో ఆంధ్ర భోజనం.. ప్రపంచ వేదికపై తెలుగు రుచికి కొత్త గుర్తింపు

తెలుగు వంటకాల రుచి ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ వేదికపై చర్చకు వచ్చింది.

Update: 2026-09-22 08:01 GMT

తెలుగు వంటకాల రుచి ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ వేదికపై చర్చకు వచ్చింది. సింగపూర్‌ నుంచి మెల్‌బోర్న్‌కు వెళ్లే సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో ‘ఆంధ్ర మీల్’ను ఆహార ఎంపికగా ఆర్డర్ చేసిన ఓ తెలుగు మహిళ తన అనుభవాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నారు. పప్పు, పచ్చడితో కూడిన ఆంధ్ర భోజనం విమానంలో అందుబాటులో ఉండటం చిన్న విషయంలా కనిపించినా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఇది ప్రత్యేకమైన గర్వకారణంగా మారింది.

వాస్తవానికి ఆంధ్ర భోజనం ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఢిల్లీ ఆంధ్ర భవన్ నుంచి బెంగళూరులోని నాగార్జున వంటి రెస్టారెంట్ల వరకు ఆంధ్ర వంటకాలను ఆస్వాదించేందుకు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. పప్పు, పచ్చడి, సాంబార్, కూరలు, వేపుళ్లు, పెరుగు, అన్నంతో కూడిన సంప్రదాయ ఆంధ్ర భోజనం తనదైన రుచితో ప్రత్యేక గుర్తింపు పొందింది.

ప్రపంచవ్యాప్తంగా చైనీస్, మెక్సికన్, జపనీస్, ఇటాలియన్ వంటకాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అదే విధంగా ఒకరోజు న్యూయార్క్, లండన్, సింగపూర్, దుబాయ్ లేదా మెల్‌బోర్న్‌లో ఎవరైనా “తెలుగు మీల్” లేదా “ఆంధ్ర మీల్” కావాలని అడిగితే.. అందులో ఎలాంటి వంటకాలు ఉంటాయో ప్రపంచానికి స్పష్టంగా తెలిసే స్థాయికి తెలుగు వంటకాలు ఎదగాలనే ఆకాంక్ష వ్యక్తమవుతోంది.

తెలుగు సంస్కృతికి ఇందుకు కావాల్సిన బలమైన పునాది ఇప్పటికే ఉంది. తెలుగు భాష, ఆంధ్ర-తెలంగాణ వంటకాలు, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, చేనేత వస్త్రాలు, సంగీతం, నృత్యం, తెలుగు సినిమా, సాహిత్యం, జానపద కళలు ఇలా ప్రపంచానికి పరిచయం చేయగల అనేక అంశాలు ఉన్నాయి.

అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగు ప్రవాస సమాజం ఈ సంస్కృతికి వారధిగా నిలిచే అవకాశం ఉంది. విదేశాల్లో తెలుగు సాంస్కృతిక కేంద్రాలు, భాషా అభ్యాస కార్యక్రమాలు, వంటల తరగతులు, హస్తకళల వర్క్‌షాప్‌లు, తెలుగు ఆహార ఉత్సవాలు నిర్వహించడం ద్వారా ఈ వారసత్వాన్ని మరింత విస్తృతంగా పరిచయం చేయవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ సంస్థలు, ప్రవాస తెలుగు సంఘాలు, వ్యాపార సంస్థలు కలిసి పనిచేస్తే తెలుగు ఆహారం, కళలు, హస్తకళలు, భాషకు అంతర్జాతీయ మార్కెట్‌ను అభివృద్ధి చేయవచ్చు.

ఇది కేవలం సంస్కృతిని కాపాడుకోవడం మాత్రమే కాదు. ఆహార వ్యాపారాలు, పర్యాటకం, హస్తకళలు, చేనేత, భాషా విద్య, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు, ఉపాధి కూడా సృష్టించవచ్చు.

సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో అందుబాటులోకి వచ్చిన ఒక ‘ఆంధ్ర మీల్’.. తెలుగు రుచులు ప్రపంచ స్థాయికి చేరుకునే సామర్థ్యానికి చిన్న ఉదాహరణగా నిలుస్తోంది. తెలుగు సంస్కృతిని కేవలం భద్రపరచడం కాకుండా.. ప్రపంచం నేర్చుకునేలా, తినేలా, అనుభవించేలా, ఆస్వాదించేలా చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

Tags:    

Similar News