బొత్స రిటైర్మెంట్ పై యూటర్న్.. ఆ భయమే కారణమా?

వైసీపీ సీనియర్ నేత, మండలిలో విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ రిటైర్మెంట్ వాయిదా నిర్ణయం విస్తృత చర్చకు దారితీస్తోంది.

Update: 2026-09-22 11:24 GMT

వైసీపీ సీనియర్ నేత, మండలిలో విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ రిటైర్మెంట్ వాయిదా నిర్ణయం విస్తృత చర్చకు దారితీస్తోంది. సుదీర్ఘ కాలంగా రాష్ట్ర రాజకీయాలలో కొనసాగుతున్న ఆయన వచ్చే ఎన్నికల్లో విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. ఇదే సమయంలో అనారోగ్య సమస్యలతో సతమతం అవుతుండటం, ఒకానొక దశలో విపక్ష పదవిని వదులుకోవాలని కుటుంబ సభ్యులు ఆయనపై ఒత్తిడి తెచ్చినట్లుగా పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే 2029 ఎన్నికల్లో తాను మళ్లీ పోటీచేస్తానని, తన సొంత నియోజకవర్గం చీపురుపల్లి నుంచి బరిలో ఉంటానని బొత్స రెండు రోజుల క్రితం ప్రకటించడంతో రిటైర్మెంట్ ప్రచారానికి తెరపడింది. నిజానికి బొత్స స్థానంలో ఆయన వారసులు బరిలోకి దిగుతారని చాలాకాలంగా నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. బొత్స కూతురు అనూష, కుమారుడు సందీప్ కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తమ రాజకీయ ఆరంగేట్రంపై సంకేతాలు ఇచ్చారు. అయితే అనూహ్యంగా తానే రంగంలో ఉంటానని బొత్స చేసిన ప్రకటన రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

2029 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి మళ్లీ పోటీ చేస్తానని బొత్స చేసిన ప్రకటన వెనుక పక్కా రాజకీయ వ్యూహం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కేడర్ ను కాపాడుకునేందుకే ఆయన ఈ ప్రకటన చేశారని విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి బొత్స 2024 ఎన్నికల ముందే ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలని ఆలోచన చేశారని చెబుతున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభకు వెళ్లాలని భావించారని అంటున్నారు. అయితే ఇది జరగకపోగా, 2024 ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఒత్తిడితో బొత్స పోటీ చేయాల్సివచ్చిందని అంటున్నారు. ఇక ఆ ఎన్నికల్లో బొత్సతోపాటు పార్టీ ఓడిపోయినా, సీనియర్ గా ఆయన సేవలు అవసరం అని భావించి విశాఖ స్థానిక ఎన్నికల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిందని చెబుతున్నారు.

ఇక ఎమ్మెల్సీగా, మండలిలో విపక్ష నేతగా కొనసాగుతున్న బొత్స వయసు రీత్యా ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని 2029 ఎన్నికల్లో తన వారసులను పోటీకి నిలపాలని భావించారని చెబుతున్నారు. చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూతురు అనూష, విజయనగరం ఎంపీగా కుమారుడు సందీప్ ను రంగంలో దింపాలని ప్లాన్ చేశారని అంటున్నారు. అయితే ఆ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లకు పైగా సమయం ఉన్నందున ముందుగా ఎన్నికల రాజకీయాలపై అవగాహన కోసం కుమార్తెను విజయనగరం జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించి చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలో ఎక్కడో ఒక చోట నుంచి జడ్పీటీసీగా పోటీచేయించాలని భావించారని చెబుతున్నారు.

అయితే ఈ వ్యూహం బెడిసికొట్టడంతో సొంత కుటుంబంలోనే బొత్సపై తిరుగుబాటు వచ్చిందని చెబుతున్నారు. ఇదే సమయంలో బొత్స రిటైర్మెంటు తీసుకుంటే తమ పరిస్థితి ఏంటి? అని కార్యకర్తలు, క్షేత్రస్థాయి నాయకులు తర్జనభర్జనకు గురవుతున్నారని చెబుతున్నారు. తమ నాయకుడు అందుబాటులో లేకపోవడం, ఆయన తరఫున ఇన్నాళ్లు పనిచేసిన జడ్పీ చైర్మన్ చిన్నశ్రీను టీడీపీలో చేరడంతో తమకు భరోసా ఇచ్చిన నేత ఉండరని కార్యకర్తలు దిగులు చెందుతున్నారని చెబుతున్నారు. దీంతో పలువురు చిన్నశ్రీనుతో టచ్ లోకి వెళ్లినట్లు బొత్సకు సమాచారం అందిందని అంటున్నారు. ఇదే జరిగితే పార్టీతోపాటు తనకు వ్యక్తిగతంగా నష్టమని భావించిన బొత్స పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. అందుకే 2029 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలనే ఆలోచనను విరమించుకున్నారని అంటున్నారు. మరో ఐదేళ్లు తాను రాజకీయంగా క్రియాశీలంగా ఉంటానని కార్యకర్తలకు నమ్మకం కలిగించడం ద్వారా చిన్నశ్రీను వెంట ఏ ఒక్కరూ పార్టీ మారే పరిస్థితి లేకుండా అడ్డుకోవచ్చని బొత్స ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. దీంతోనే రిటైర్మెంట్ ప్రకటనపై యూటర్న్ తీసుకున్నారని విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News