జనసేనాని చేతికి మేయర్ స్థానాల లిస్టు.. పవన్ నిర్ణయంపై ఉత్కంఠ!

స్థానిక ఎన్నికల్లో భాగంగా పట్టణ, నగర పాలక సంస్థలలో పోటీపై జనసేన నేతలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు.

Update: 2026-09-22 11:15 GMT

స్థానిక ఎన్నికల్లో భాగంగా పట్టణ, నగర పాలక సంస్థలలో పోటీపై జనసేన నేతలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పాగా వేయడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత విస్తరించవచ్చన్న భావనతో ఆ పార్టీ నేతలు వీలైనన్ని ఎక్కువ స్థానాలు తీసుకోవాలని అధిష్టానానికి విన్నవిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటివరకు అధినేత పవన్ అందుబాటులో లేకపోవడంతో తమ మనోగతాన్ని బయటపెట్టని నేతలు తాజాగా మనసు విప్పి మాట్లాడుతున్నారని అంటున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో కేరళలో విశ్రాంతి తీసుకున్న పవన్ రెండు రోజుల క్రితమే రాష్ట్రానికి వచ్చారు. ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఇక పవన్ ను నేరుగా కలుస్తున్న పలువురు జనసేన నేతలు తమ ఆలోచనలను పంచుకుంటున్నారని అంటున్నారు.

రాష్ట్రంలోని ప్రధానమైన మున్సిపల్ కార్పొరేషన్లలో జనసేన పోటీ చేయాలని ఆ పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారని, ఇదే విషయాన్ని పవన్ దృష్టికి తీసుకువెళ్లారని అంటున్నారు. మొత్తం 17 కార్పొరేషన్లు ఉండగా, కనీసం ఆరేడు చోట్ల జనసేన పోటీ చేయాల్సిందేనని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారని చెబుతున్నారు. ఇందులో విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ, ఏలూరు, ఒంగోలు, తిరుపతితోపాటు రాయలసీమలోని మరో కార్పొరేషన్ అడగాలని జనసేన నేతలు సూచిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంలో పవన్ ఆలోచన బయటపెట్టకపోయినా కీలక మేయర్ స్థానాల విషయంలో ఆయన కూడా ముఖ్యనేతలతో సమాలోచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇక కార్యకర్తల మనోగతాన్ని అర్థం చేసుకున్న పవన్, ఈ విషయమై పిఠాపురం సభలో పరోక్షంగా ప్రస్తావించినట్లు చెబుతున్నారు. తనకు కృతజ్ఞత ఎక్కువ అని, అదే సమయంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకునే దయాగుణం కూడా ఉందని పవన్ చెప్పారు. దీంతో తనపై ఆశలు పెట్టుకున్న ప్రతిఒక్కరికి న్యాయం చేస్తానని పవన్ పరోక్షంగా భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారని అంటున్నారు. అయితే పవన్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినప్పటికి పొత్తుల్లో భాగంగా జనసేన తీసుకోవాల్సిన మేయర్ స్థానాలపై ఆ పార్టీ నేతల్లో భారీ ఆశలు ఉన్నాయని అంటున్నారు.

మరోవైపు జనసేన కోరుతున్న స్థానాల విషయంలో కూటమిలోని టీడీపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారని అంటున్నారు. ప్రధానంగా విజయవాడ, మచిలీపట్నం స్థానాలు కోరుతుండటంతో టీడీపీ నేతల్లో గుబులు ఎక్కువ అవుతోందని చెబుతున్నారు. మచిలీపట్నం విషయంలో ఆ పార్టీకి పెద్దగా అభ్యంతరాలు లేకపోయినప్పటికీ విజయవాడ సీటుపై కర్చీఫ్ వేసిన వారికి మాత్రం జనసేన నేతల ఆలోచనలు చెమటలు పట్టిస్తున్నాయని చెబుతున్నారు. మరోవైపు ఒంగోలు కార్పొరేషన్ పై కూడా టీడీపీ పెద్ద ఆశలు పెట్టుకుందని చెబుతున్నారు. కానీ ఈ సీటును జనసేన కోరుతుందన్న ప్రచారంతో మేయర్ ఆశావహులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారని అంటున్నారు.

వంద శాతం స్ట్రైక్ రేట్

ఇక పొత్తుల్లో భాగంగా కూటమి పార్టీల చర్చల తర్వాత పోటీపై క్లారిటీ వస్తుందని జనసేన నేతలు చెబుతున్నారు. ఏదిఏమైనా మూడు పార్టీలు కలిసి పోటీ చేయడంపై స్పష్టమైన అవగాహన ఉన్నందున ఎన్నికల్లో వందశాతం సక్సెస్ కావాలనే లక్ష్యాన్ని జనసేన పెట్టుకున్నట్టు చెబుతున్నారు. అధినేత పవన్ సైతం తనను కలిసిన వారికి ఇదే విషయమై దిశానిర్దేశం చేస్తున్నారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఏవిధంగా వంద శాతం స్ట్రైక్ రేటుతో విజయం సాధించామో అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు రావాలని పవన్ సూచిస్తున్నారని చెబుతున్నారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా గెలుపు అవకాశాలు ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల జాబితాను తయారు చేయాలని పవన్ ఆదేశించినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది జనసేన నేతల్లో హడావుడి ఎక్కువవుతోందని అంటున్నారు.

Tags:    

Similar News