కూటమి బలంగా ఉండాలి.. కానీ షరతులు ఇవే.. : డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు
కూటమి భవిష్యత్తు రాజకీయాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కూటమి భవిష్యత్తు రాజకీయాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలలో కలిసే పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి పవన్ ఎండ్ కార్డ్ వేశారు. సొంత నియోజకవర్గం పిఠాపురంలో పవన్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ఆయన పట్టణంలోని ఆర్ఆర్బీహెచ్ఆర్ గ్రౌండులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం బలంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా అందరం కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు.
కూటమిగా కలిసి ప్రయాణిస్తామని పవన్ పునరుద్ఘాటించారు. అయితే కూటమిలోని మూడు పార్టీల నేతలకు కీలక సూచనలు చేశారు. ‘‘ఎవరికి ఎవరు తగ్గకుండా, జనసేన గౌరవానికి భంగం కలగకుండా అడుగులు వేస్తున్నాం’’ అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు. స్థానిక ఎన్నికల్లో తన బలానికి తగినట్లు సీట్లు ఇవ్వాలని జనసేన కోరుకుంటున్న విషయం తెలిసందే. ఈ విషయమై జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ప్రకటన చేశారు. అయితే ఇప్పటివరకు లోకల్ పోల్స్ పై ఎటువంటి ప్రకటన చేయని పవన్ తొలిసారిగా స్పందించారు.
జనసేన గౌరవానికి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో తనకు కృతజ్ఞత ఎక్కువ అని, కష్టాల్లో ఉన్న వ్యక్తులకు అండగా ఉండటం తన గుణమని పవన్ వివరించారు. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకునే నడుచుకుంటానని వ్యాఖ్యానించారు. ముందు ప్రజల అవసరాలు తీర్చుకుందామని, తర్వాత వారి ఆకాంక్షలు, ఆశలు నెరవేరుద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నేతల పనితీరుపై పవన్ స్వల్ప అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధికారం వచ్చిన తర్వాత అంతా చల్లబడ్డారని చురకలు అంటించారు.
ఇక పవన్ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి. జనసేన గౌరవానికి భంగం కలగనీయనని చెప్పిన పవన్, తనకు కృతజ్ఙత ఎక్కువని, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తానని ఎందుకు చెప్పారనేది అంతుచిక్కడం లేదని అంటున్నారు. తన వెంట నడుస్తున్న కార్యకర్తల కష్టాలు తీరుస్తానని, వారి ఆశలు నెరవేరుస్తానని నమ్మకం కలిగించడానికే ఆయన ఈ వ్యాఖ్యలు చేసివుండొచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక ఎన్నికలపై జనసేనలో చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. వారి మనసు తనకు తెలుసునని, కార్యకర్తల గౌరవానికి భంగం కలగకుండా నిర్ణయాలు ఉంటాయని సంకేతాలు ఇవ్వడానికి పవన్ ప్రయత్నించినట్లుగా భావిస్తున్నారు.