ఇతను టఫ్ గాయ్.. ట్రంప్ పొగిడినా పట్టించుకోని మోడీ.. అసలేం జరిగింది?
| మనీలాలో జరిగిన క్వాడ్ సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఫొటో సెషన్ సమయంలో మోదీని ట్రంప్ ‘టఫ్ వ్యక్తి’ అంటూ ప్రశంసించారు. అనంతరం మీడియా ప్రశ్నలకు ట్రంప్ సమాధానాలు ఇస్తుండగా, తదుపరి కార్యక్రమానికి వెళ్లేందుకు మోదీ నిర్వాహకులను ఆరా తీశారు. ట్రంప్ ప్రశంసలకు మోదీ పెద్దగా స్పందించకపోవడం, సమావేశాన్ని త్వరగా ముగించాలన్నట్లుగా వ్యవహరించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడుంటే అక్కడ మీడియా హడావుడి.. తనదైన శైలి పంచ్ డైలాగులు ఉండాల్సిందే. మైకు కనిపిస్తే చాలు.. ప్రశ్నల వర్షానికి తనదైన స్టైల్లో సమాధానాలు చెబుతూ సమయాన్ని మర్చిపోతుంటారు. కానీ మనీలాలో జరిగిన క్వాడ్ సదస్సు వేదికపై మాత్రం సీన్ రివర్స్ అయింది. ట్రంప్ ఒకపక్క ప్రశంసల వర్షం కురిపిస్తుంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ‘ఇక చాలు.. తదుపరి మీటింగ్కు వెళ్దాం’ అన్నట్లుగా వ్యవహరించడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
మనీలా క్వాడ్ సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా జపాన్, ఆస్ట్రేలియా దేశాల అధినేతలు ఒకే వేదికపై చేరారు. అంతర్జాతీయ సదస్సుల్లో సాధారణంగా జరిగే ఫొటో సెషన్‌కు నేతలంతా సిద్ధమయ్యారు. కెమెరాల ఫ్లాష్‌ల మధ్య ట్రంప్ తనదైన హాస్య చతురతను బయటకు తీశారు. పక్కనే ఉన్న మోదీని ఉద్దేశించి.. మోదీ చాలా కఠినమైన టఫ్ వ్యక్తి. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ ప్రశంసలు మొదలుపెట్టారు. అంతటితో ఆగకుండా జపాన్ ప్రధాని సనాయే తకాయిచి ఇంకా కఠినంగా ఉండవచ్చు. ఇక అల్బనీస్, నేను మాత్రం పర్వాలేదు అంటూ చమత్కరించారు. ట్రంప్ వేసిన ఈ పంచ్‌కు వేదికపై ఉన్న నేతలందరి ముఖాల్లో నవ్వులు విరిశాయి.
ట్రంప్ తన ప్రసంగ ధోరణిని కొనసాగిస్తూ అక్కడున్న విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. మీడియాతో ట్రంప్ ముచ్చట్లు ఇప్పట్లో ముగిసేలా లేవని గ్రహించిన ప్రధాని మోదీ అక్కడి నిర్వాహకులను ఉద్దేశించి.. ఫొటో సెషన్ పూర్తయిందా? తదుపరి కార్యక్రమానికి వెళ్లవచ్చా? అన్నట్లుగా ఆరా తీశారు.
అయితే ఇటీవల కాలంలో భారత్ పై, భారతీయులపై అమెరికాలో పెరుగుతున్న వ్యతిరేకత.. ట్రంప్ ఇండియాపై కఠినంగా.. చైనాకు దగ్గరగా వ్యవహరిస్తున్న తీరు నచ్చకే మోడీ ఇలా ట్రంప్ పొగిడినా ఖతలు చేయలేదా? అన్న చర్చ సాగుతోంది. ట్రంప్ ఇండియాను దూరం పెట్టడంతోనే మోదీ కూడా ట్రంప్ పొగడ్తలకు పెద్దగా స్పందించనట్టుగా కనిపించింది. ఒకవైపు అగ్రరాజ్య అధ్యక్షుడు స్వయంగా పొగుడుతూ మీడియాతో సంభాషణను సాగదీస్తుంటే.. మరోవైపు మోదీ మాత్రం తన గడియారం వైపు చూసుకుంటూ తదుపరి సమావేశానికి సమయమవుతోందని సంకేతాలు ఇవ్వడానికి ఇదే కారణం అయ్యిండొచ్చు.
క్వాడ్ వంటి కీలక సదస్సుల్లో ప్రతి నిమిషం విలువైనదే. ద్వైపాక్షిక భేటీలు, వ్యూహాత్మక చర్చలతో షెడ్యూల్ నిండిపోయి ఉంటుంది. అందుకే ఫొటోలకు పోజులివ్వడం, మీడియాతో చిట్ చాట్ చేయడం కంటే అసలు పనిపైనే దృష్టి పెట్టాలని మోదీ భావించినట్లు కనిపిస్తోంది. మనీలా వేదికపై ట్రంప్ తన మాటలతో నవ్వులు పూయిస్తే మోదీ తన చేతలతో 'టైమ్ ఈజ్ మనీ' అనే సందేశాన్ని సున్నితంగా గుర్తు చేశారు. పెద్ద పెద్ద దౌత్య సమావేశాల్లోనూ నేతల భిన్నమైన వ్యక్తిత్వాలు ఇలాంటి సరదా సన్నివేశాలకు వేదికవుతుంటాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది.