నంబర్ 850....బీజేపీ భారీ వ్యూహం !
| లోక్‌సభలో ప్రస్తుతమున్న 543 ఎంపీ స్థానాలను 850కి పెంచే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇందులో మూడో వంతు స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా సీట్ల పెంపు చేపట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు కథనం పేర్కొంది. ఈ ప్రతిపాదన అమలైతే ఏపీలో ఎంపీ స్థానాలు 37కి, అసెంబ్లీ స్థానాలు 263కి పెరగవచ్చని, తెలంగాణలో ఎంపీ స్థానాలు 26కి, అసెంబ్లీ స్థానాలు 179కి చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ నంబర్ 850 ఏమిటి అన్న ప్రశ్న రావచ్చు. అయితే రానున్న రోజులలో ఇదే అందరూ తలచుకునే సంఖ్యగా మారబోతోంది. ఎలా అంటే భారత దేశ పాలనను చేసే అత్యున్నత చట్ట సభ అయిన లోక్ సభలో ఎంపీల సంఖ్యా బలంగా ఇది ఉండబోతోంది. ప్రస్తుతం ఉనన్ 543 నంబర్ కాస్తా సమీప భవిష్యత్తులో 850 గా మారనుంది అని అంటున్నారు. అంటే ఏకంగా 307 మంది కొత్త ఎంపీలు లోక్ సభకు వస్తారు అన్న మాట. ఇక వీరిలో మూడవ వంతు మహిళా ఎంపీలు ఉంటారు. 33 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం మేరకు వారికి ఆ చాన్స్ ఉంటుంది. అలా చూసుకుంటే 284 మంది మహిళలు కొత్త లోక్ సభలో కనిపిస్తారు అన్న మాట.
యాభై శాతం పెంపు :
బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం లోక్ సభలో ఈ శీతాకాల సమావేశాలలో డీ లిమిటేషన్ బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని చూస్తోంది. అయితే ఈ బిల్లు ఆమోదానికి రాజ్యాంగ సవరణ అవసరం. మొత్తం 543 మంది సభ్యులలో మూడింట రెండు వంతుల మంది బిల్లుకు మద్దతుగా నిలవాలి. ఆ మ్యాజిక్ నంబర్ 361గా ఉంది. మరి అంత మంది ఎంపీల బలం బీజేపీకి లేదు కదా అన్నదే ప్రశ్న. దానికి జవాబుగా బీజేపీ ప్రతిపక్షాలను అందరినీ కలుపుకుని పోయే విధంగా కసరత్తు చేస్తోంది. 1971 జనాభా లెక్కల ప్రకారం చూస్తే దక్షిణాదికి 129 ఎంపీలు పార్లమెంట్ లో ఉన్నారు. ఆ నంబర్ కి తక్కువ కాకుండా ఆ దామాషా కొనసాగేలా బీజేపీ పెద్దలు చర్యలు తీసుకుంటున్నారు. దాని కోసం ఉన్న సీట్లకు మరో యాభై శాతం కలిపి లోక్ సభలో పెంచనున్నారు. ఈ లెక్కన మొత్తం లోక్ సభలో ప్రస్తుతం దక్షిణ భారత దేశంలోని అయిదు రాష్ట్రాలకు ఉన్న 22 శాతం షేర్ తగ్గకుండా చూసేలా మధ్యే మార్గం అని అంటున్నారు.
అన్నీ కుదిరితే ఆమోదం :
ఈ విధంగా విపక్షాలకు ఇబ్బంది లేకుండా లోక్ సభలో సౌత్ స్టేట్స్ ప్రయారిటీ తగ్గకుండా చూసేలా బీజేపీ పెద్దలు కచ్చితమైన హామీ ఇస్తూ ఈ మేరకు పెంపుని చేపట్టనున్నారు అని అంటున్నారు. ఈ విధంగా చేస్తే ఎక్కువ లోక్ సభ సీట్లు పెరిగినా సౌత్ కి ఇబ్బంది రాదని అంటున్నారు. అలాగే పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్త ఎంపీలు వస్తారు, డీ లిమిటేషన్ లో కొత్త సీట్లు కూడా ఏర్పాటు అవుతాయని అంటున్నారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం వల్ల వారికి కూడా లోక్ సభలో ప్రాతినిధ్యం బాగా పెరుగుతుంది అని అంటున్నారు. ప్రస్తుతం దీని మీదనే బీజేపీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 17న బిల్లు వీగిపోవడానికి కారణం దక్షిణాదికి సరైన ప్రాతినిధ్యం లోక్ సభలో ఉండదన్న సందేహాలతోనే. దానిని తీర్చినట్లు అయితే డీఎంకే సహా అనేక పార్టీలు ఈ బిల్లుని సమర్థించేందుకు ముందుకు వస్తాయని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.
ఏపీలో పెరుగుతాయి :
ఈ కొత్త లెక్క ప్రకారం చూస్తే ప్రస్తుతం ఏపీలో ఉన్న పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు మరో యాభై శాతం పెరుగుతాయని అంటున్నారు. ఎంపీ సీట్లు ఏకంగా 37 దాకా పెరుగుతాయని చెబుతున్నారు. అలాగే అసెంబ్లీ సీట్లు 263 అవుతాయని అంటున్నారు. తెలంగాణా విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న ఎంపీ సీట్లు 17 కాస్తా 26 అవుతాయి. అలాగే 119 అసెంబ్లీ సీట్లు కాస్తా 179 అవుతాయని అంటున్నారు. దీంతో కొత్త వారికి ఎన్నో రాజకీయ అవకాశాలు వస్తాయని అందులో మహిళలకు కూడా పెద్ద పీట వేయడం జరుగుతుందని అంటున్నారు.