విపక్షాల నిరసన మధ్యే.. పనికానిచ్చేసిన మోడీ!
లోక్‌సభలో పబ్లిక్ పరీక్షలు అక్రమ పద్ధతుల నివారణ సవరణ బిల్లు- 2026 ఆమోదం పొందింది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తన పనితాను చేసుకుని పోతోంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సహా.. ఇతర ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టినా.. హోం శాఖ మంత్రి అమిత్ షా క్షమాపణలకు పట్టుబట్టి నిరసన వ్యక్తం చేసినా.. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నిరసనల హోరులోనే ప్రభుత్వం పలు కీలక బిల్లులను సభలో ప్రవేశ పెట్టి ఆమోదించుకోవడం గమనార్హం. చిత్రం ఏంటంటే.. ఆయా బిల్లుల ఆమోదం సమయంలో విపక్షాలు ఉభయ సభలను బాయ్‌కాట్ చేశాయి. కొందరు సభ్యులు వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. అయితే.. ఇవి రాజ్యాంగపరమైన బిల్లులు కాకపోవడంతో ఆమోదం పొందడం గమనార్హం.
పరీక్షల బిల్లు..
లోక్‌సభలో పబ్లిక్ పరీక్షలు అక్రమ పద్ధతుల నివారణ సవరణ బిల్లు- 2026 ఆమోదం పొందింది. పబ్లిక్ పరీక్షలలో ప్రశ్నపత్రాల లీకేజీ, మోసాలు , ఇతర అక్రమ పద్ధతులను నివారించేందుకు చట్టపరమైన విధానాన్ని మరింత బలోపేతం చేసేలా ఈ బిల్లును ఇటీవల రూపొందించారు. ఇప్పటికే ఉన్న పబ్లిక్ పరీక్షలు, అక్రమ పద్ధతుల నివారణ చట్టం-2024ను సవరిస్తూ.. దీనిని తీసుకువచ్చారు. ఇది చట్టంగా మారితే.. దోషులకు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు కూడా జరిమానా విధించే అవకాశం లభిస్తుంది. ప్రతిపక్షాల నినాదాల మధ్యే స్పీకర్ ఓం బిర్లా ఈ బిల్లు ఆమోదం పొందిందని ప్రకటించారు.
జనన మరణాల బిల్లు
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్‌సభలో జనన మరణాల నమోదు సవరణ బిల్లు-2026ను ప్రవేశపెట్టారు. దీనిని కూడా 'జనన మరణాల నమోదు చట్టం-1969'ను సవరిస్తూ ఈ బిల్లును రూపొందించారు. జననం లేదా మరణం సంభవించిన ఒక సంవత్సరం తర్వాత...అలాగే రెండేళ్ల లోపు రిజిస్ట్రార్‌కు నివేదించిన సందర్భాల్లో ఆ ఘటన వాస్తవికతను ధృవీకరించిన అనంతరం... జిల్లా మేజిస్ట్రేట్, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ లేదా జిల్లా మేజిస్ట్రేట్ ద్వారా అధికారం పొందిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆమోదంతో మాత్రమే ...జనన లేదా మరణాలను నమోదు చేయవచ్చని ఈ బిల్లు పేర్కొంటోంది. అయితే...జననం లేదా మరణం సంభవించిన రెండేళ్ల తర్వాత రిజిస్ట్రార్‌కు నివేదిస్తే...'ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్' ఆదేశంపై మాత్రమే ... నమోదు చేయాలని పేర్కొంది.
వందేమాతరం బిల్లు..
జాతీయ గౌరవానికి అవమానాల నివారణ సవరణ బిల్లు-2026ను రాజ్యసభ బుధవారం ఆమోదించింది. ఈ బిల్లు...జాతీయ గౌరవానికి అవమానాల నివారణ చట్టం-1971 ని సవరిస్తూ...జాతీయ గీతం 'జన గణ మన'కు ఉన్న... చట్టబద్ధమైన రక్షణను 'వందేమాతరం' గేయానికి కూడా కల్పిస్తుంది. ఈ చట్ట పరిధిలోకి జాతీయ పతాకం, రాజ్యాంగం, జాతీయ గీతంతో పాటు వందేమాతరం గేయాన్ని కూడా చేర్చారు. వందేమాతరాన్ని పూర్తిగా అంటే.. 6 చరణాలను పాడకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా ఆ గీతాన్ని పాడుతున్న సభలో ఆటంకం కలిగించడం వంటివాటిని నేరపూరిత చర్యగా పరిగణిస్తారు.
ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించేందుకు అవకాశముంది. ఈ చట్టం కింద రెండవ లేదా తదుపరి సారి నేరం రుజువైతే... తప్పనిసరిగా కనీసం ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తారు. రాజ్యసభలో ఈ చట్టాన్ని మూజువాణి ఓటు ద్వారా ఆమెదించారు. అయితే.. ఈ సమయంలో ప్రతిపక్షసభ్యులు నినాదాలు, నిరసనలతో హోరెత్తించారు. అనంతరం.. వాకౌట్ చేశారు. ఆ సమయంలోనే ఈ బిల్లుపై మూజువాణి ఓటు(సభలో అప్పటికి ఉన్న సభ్యులు చేతులు పైకెత్తడం ద్వారా జరిగే ఓటు) నిర్వహించారు.