అంపోలు రణరంగం: ఎస్పీ సీరియస్
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని అంపోలు ప్రాంతం రణరంగంగా మారింది. వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఇక్కడి జైల్లోనే ఉంచారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని అంపోలు ప్రాంతం రణరంగంగా మారింది. వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఇక్కడి జైల్లోనే ఉంచారు. దీంతో ఆయనను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ తరలివచ్చారు. దీంతో భారీ ఎత్తున యువత అంపోలు జంక్షన్‌వద్దకు చేరుకుంది.
అయితే.. ఎలాంటి బల ప్రదర్శనలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ముఖ్యంగా ఎస్పీ మహేశ్వర రెడ్డి బుధవారం, గురువారం కూడా వరుసగా మీడియా ముందుకు వచ్చారు. ప్రదర్శనలకు, ర్యాలీలకు, నిరసనలకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. అయినప్పటికీ.. వైసీపీ నాయకులు కార్యకర్తలను సమీకరించారు. ముఖ్యంగా యువతను తీసుకువచ్చారు. ఇక, జగన్‌ను చూడగానే యువత రెచ్చిపోయారు. ఈ పరిణామాలతో పరిస్థితి ఎక్కడ గాడి తప్పుతుందోనన్న ఆందోళన వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో పోలీసులు.. వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను, స్థానిక నాయకులను కూడా అడ్డుకున్నారు. అయితే.. యువత పోలీసులపై తిరగబడే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు.. రాళ్లు.. పేపర్ బాల్స్‌ను పోలీసులపై విసిరారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జికి దిగారు. ఈ ఘటనలతో అంపోలు జంక్షన్ వద్ద కిలో మీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక, ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. ఈ ఘటనను నిరసిస్తూ.. పలువురు వైసీపీ నేతలు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఎవరినీ వదలం!
అనుమతి లేకుండా యాత్రలు నిర్వహించిన వారిని ఏ ఒక్కరినీ వదిలి పెట్టేది లేదని ఎస్సీ మహేశ్వర్ రెడ్డి చెప్పారు. పోలీసుల అనుమతి తీసుకోకుండా రోడ్డుపై విచ్చలవిడిగా వ్యవహరించిన వారిపై కేసులు పెడతామన్నారు. ముఖ్యంగా పోలీసులపై దాడులకు ప్రయత్నించిన వారిని గుర్తిస్తామని చెప్పారు. ప్రస్తుతం అంపోలులో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. గాయపడిన పోలీసులకు వైద్య సేవలు అందిస్తామన్నారు. మరోవైపు.. జగన్.. ఇవేవీ తెలియనట్టుగా ముందుకు సాగారు.