అమెరికాలో ఓపీటీ మోసం కలకలం.. 10 వేల మంది విదేశీ విద్యార్థులపై నిఘా
కానీ ఈ మధ్య మనోళ్ల లీలలు చూసి అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల (ఐసీఈ) ఫ్యూజులు ఎగిరిపోయాయి.
చదువుకోవడానికి అమెరికా వెళ్లే మన దేశీ కుర్రాళ్లకు చదువు ఒకెత్తయితే ఆ తర్వాత వచ్చే ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ) మరో ఎత్తు.. అమెరికాలో అడుగుపెట్టిన దాదాపు ప్రతి విద్యార్థి కలల రాజసౌధం ఈ ఓపీటీ. ఆ మాటకొస్తే అక్కడ గ్రీన్ కార్డ్, హెచ్-1బీ లాంటి పెద్ద పెద్ద పదాలు వినపడటానికి ముందే వీరికి ఆశలు చూపేది ఇదే. కానీ ఈ మధ్య మనోళ్ల లీలలు చూసి అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల (ఐసీఈ) ఫ్యూజులు ఎగిరిపోయాయి.
తాజాగా బయటపడిన వివరాల ప్రకారం.. దాదాపు 10,000 మంది విదేశీ విద్యార్థులు తమ కెరీర్‌ను అమెరికా అధికారుల నిఘా నీడ కింద పెట్టి 'ఘనమైన' సాధన చేస్తున్నారు. అమెరికా అధికారులు రంగంలోకి దిగి.. విద్యార్థులు పనిచేస్తున్నారని చెప్పిన కంపెనీల చిరునామాలను తనిఖీ చేస్తే.. అక్కడ కంపెనీలు లేవు.. ఆఫీసులు లేవు.. ఉన్నవల్లా ఖాళీ భవనాలు.. మూసివేసిన షట్టర్లు, లేదా ఒక చిన్న ఇంట్లో వందలాది మంది 'మాస్టర్స్' విద్యార్థులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారనే రికార్డులు..
అంతేకాదు అధికారులను మతిపోగొట్టిన మరో అంశం 'ఫాంటమ్ ఎంప్లాయీస్' ముగ్గురు మాత్రమే ఉండే ఒక చిన్న కంపెనీలో ఏకంగా 500 మంది విదేశీ విద్యార్థులు ఉద్యోగాలు చేస్తున్నారట. అంటే పేపర్ మీద ఉద్యోగం, జీతం, పేరోల్ అన్నీ భేష్... కానీ అసలు ఆఫీసుకి వెళ్లే నాథుడే లేడు. కొన్ని కంపెనీల హెచ్‌ఆర్, పేరోల్ ఆపరేషన్స్ చూస్తే అమెరికాలో కాదు.. అసలు వేరే ఖండంలో ఉండి నడుపుతున్నారు. కంపెనీ ఓనర్‌ను పిలిచి "మీ ఆఫీస్‌లో ఏం చేస్తారు?" అని అడిగితే ఆయన ముఖంలో ఐన్‌స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కంటే పెద్ద భావాలు కనిపిస్తున్నాయి.
వర్జీనియా, టెక్సాస్, న్యూయార్క్, ఫ్లోరిడా లాంటి రాష్ట్రాల్లో ఈ 'మాయా కంపెనీల' నెట్‌వర్క్ బాగా విస్తరించింది. అయితే గుర్తించిన 10,000 మంది విద్యార్థులందరూ కావాలని మోసం చేశారని అధికారులు చెప్పలేదు కానీ అనుమానాస్పద యజమానుల వద్ద చేరినందుకు అందరిపై విచారణ మొదలైంది.
విద్యార్థులూ... కాస్త జాగ్రత్త
ఇన్నాళ్లూ "ఫేక్ ఎక్స్‌పీరియన్స్, డమ్మీ పేరోల్స్ నడిచేస్తాయిలే" అనుకున్న కాలం చెల్లిపోయింది. అధికారులు ఇప్పుడు తీవ్రస్థాయిలో క్రిమినల్, అడ్మినిస్ట్రేటివ్ చర్యలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఐటీ కన్సల్టింగ్, స్టాఫింగ్ కంపెనీల పేరుతో కాలం వెళ్లదీస్తున్న అంతర్జాతీయ విద్యార్థులు ఇకనైనా మేల్కోవాలి. మీరు చేస్తున్న ఉద్యోగం నిజమైనదా? ఆ కంపెనీకి అమెరికాలో అసలు ఇటుక గోడలైనా ఉన్నాయా? ఎస్.ఈవీఐఎస్ లో ఉన్న వివరాలు సరిగ్గా ఉన్నాయా? అని చెక్ చేసుకోవడం ఉత్తమం. లేకపోతే డాలర్ల కన్నా ముందు క్రిమినల్ కేసులు, విమానం టికెట్లు చేతికి రావడం ఖాయం.