ఏ ఒక్క ఇంటినీ వ‌దల‌ద్దు.. స్థానికంలో కూట‌మిదే గెలుపు: చంద్ర‌బాబు

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీలు ఘ‌న విజ‌యం ద‌క్కించుకునేలా చూడాల‌ని పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల‌కు చంద్ర‌బాబు సూచించారు.

Update: 2026-07-30 13:30 GMT

వ‌చ్చే రెండు మాసాల్లో రాష్ట్రంలో జ‌ర‌గ‌నున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీలు ఘ‌న విజ‌యం ద‌క్కించుకునేలా చూడాల‌ని పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల‌కు చంద్ర‌బాబు సూచించారు. ఈవిష‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. ప్ర‌స్తుతం `ఇంటింటికీ కూట‌మి ప్ర‌భుత్వం` పేరిట నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మంపై ఆయ‌న స‌మీక్షించారు. రాష్ట్ర స‌చివాల‌యానికి కొంద‌రు నేత‌ల‌ను పిలిపించుకున్న ఆయ‌న‌.. ఈ కార్య‌క్ర‌మం ఎలా సాగుతోంద‌ని ప్ర‌శ్నించారు. సోమ‌వారం నుంచి 45 రోజుల పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం, ప్ర‌తి మండ‌లం, ప్ర‌తి గ్రామంలోనూ ఇంటింటికీ వెళ్లాల‌ని సూచించారు.

ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను అంద‌రికీ వివ‌రించాల‌న్నారు. దీనిలో ఎవ‌రూ మిన‌హాయింపు కోర‌కూడ‌ద‌ని.. ఏదో ఒక కార‌ణం చెప్పి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించ‌రాద‌ని కూడా చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. అంతేకాదు.. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుసుకుని.. వారి స‌మ‌స్య‌లు కూడా తెలుసుకుంటే.. ప్ర‌జ‌ల‌కు భ‌రోసా వ‌స్తుంద‌న్నారు. ప్ర‌జ‌లు చెప్పే విష‌యాల‌ను ఓర్పుతో వినాల‌ని సూచించారు. ఎవ‌రినీ దూరం పెట్ట‌వ‌ద్ద‌న్నారు. విసుగు విరామం లేకుండా ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుసుకుని.. స‌మ‌యం కేటాయించి మ‌రీ వారి స‌మ‌స్య‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు. అదే ప్ర‌భుత్వానికి అత్యంత కీల‌క‌మైన ఫీడ్ బ్యాక్ అవుతుంద‌ని తెలిపారు.

కూట‌మి నాయ‌కుల‌ను క‌లుపుకొని ముందుకు సాగాల్సిందేన‌ని ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు చెప్పారు. అంతేకాదు.. ప్ర‌తి ఒక్క పార్టీ నాయ‌కుడు కూడా వివాదాల‌కు దూరంగా ఉండాల‌న్నారు. ''మ‌న పార్టీలో చాలా మంది నాయ‌కులు ఉన్నారు. బీజేపీ, జ‌న‌సేన‌లోనూ ఉన్నారు. అంద‌రూ క‌లిసి కార్య‌క్ర‌మాలు చేసుకోండి. అవ‌స‌రమైతే.. పిక్‌నిక్ వంటివి ఏర్పాటు చేసుకోండి. వారాంతాల్లో పార్టీలు చేసుకోండి. అంతేకానీ.. గొడ్డ‌లి పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి వేదిక‌లు పంచుకుంటామంటే స‌హించేది లేదు. మ‌న‌కు విస్తృత‌మైన నెట్ వ‌ర్క్ ఉంది. నాయ‌కులు ఉన్నారు. ఎక్క‌డికి వెళ్లినా.. అక్క‌డి సంస్కృతి సంప్ర‌దాయాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయండి. వారితో మ‌మేకంకండి. అంతేత‌ప్ప‌.. గొడ్డ‌లి పార్టీ నాయ‌కుల‌తో స్నేహం చేస్తామంటే ఊరుకునేది లేదు'' అని ఇటీవ‌ల జ‌రిగిన బొండా ఉమా విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు.

ప్ర‌తి స్థానిక పోరు కీల‌క‌మే..

స్థానిక ఎన్నిక‌ల్లో వార్డు నుంచి కౌన్సిల్ వ‌ర‌కు అన్నీ కీల‌క‌మేన‌ని సీఎం చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. ఈ విష‌యంలో పార్టీ నాయ‌కులు అశ్ర‌ద్ధ చూప‌డానికి వీల్లేద‌న్నారు. అంద‌రూ క‌లిసి క‌ట్టుగా ముందుకు సాగాల‌ని దిశానిర్దేశం చేశారు. ప్ర‌తి ఇంటిపై జెండా ఎగ‌రాల్సిన అవ‌స‌రం లేద‌న్న ఆయ‌న‌.. ప్ర‌తి ఒక్క‌రి గుండెలోనూ కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న సంక్షేమం, చేస్తున్న అభివృద్ధి, తీసుకువ‌స్తున్న పెట్టుబ‌డులు వంటివి ఉండేలా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ప్ర‌తి వార్డు కీల‌కమేన‌ని చెప్పారు. ఒక్క స్థానంలో ఓడిపోయినా.. దానికి స్థానిక నేత‌ల‌తోపాటు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే కూడా బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.

Tags:    

Similar News