బీసీ రిజర్వేషన్లు...తీర్పు మీద ఉత్కంఠ

ఇదిలా ఉంటే ఈ పిటిషన్ ని విచారించిన సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం ఇరువైపులా సుదీర్ఘ వాదనలు విన్నది.

Update: 2026-09-17 02:45 GMT

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఐతే బీసీలకు స్థానిక ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ 1065, 105 ఉత్తర్వులను విడుదల చేసింది. అయితే రాజ్యాంగం ప్రకారం చూస్తే 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదని పిల్ దాఖలు అయింది. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు మొత్తం 50 శాతం లోపే రిజర్వేషన్లు ఉండాలని పేర్కొన్నారు.

రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక :

ఇదిలా ఉంటే ఈ పిటిషన్ ని విచారించిన సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం ఇరువైపులా సుదీర్ఘ వాదనలు విన్నది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కీలక ప్రశ్నలను వేసింది. ఏ ప్రాతిపదికన బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారో చెప్పాలని పేర్కొంది. అసలు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి అనుసరించిన విధానం ఏమిటి ఇక బీసీలకు సంబంధించిన గణాంకాలు ఏమిటి అన్నవి కూడా తమకు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికని హైకోర్టు ముందు ప్రస్తావించింది. దాంతో రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం అలాగే ఆ కమిషన్ ఏం అధ్యయనం చేసిందనే పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసింది.

గతంలో తీర్పులు ఏమిటి :

ఇదిలా ఉంటే రిజర్వేషన్లు యాభై శాతం మించరాదు అంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం ఈ రాజ్యాంగ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు ఉల్లంఘిస్తున్నాయా లేదా అనే కోణంలో న్యాయపరమైన విచారణ జరిపింది. అంతే కాదు కూటమి ప్రభుత్వం గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కూడా కోరింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే నివేదికలు గణాంకాలను పరిశీలించిన తర్వాత హైకోర్టు తన తుది తీర్పును వెల్లడించనుంది. ఈ తీర్పు ఆధారంగానే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల భవిష్యత్తు ఆధారపడి ఉండటంతో రాజకీయ వర్గాల్లోనూ ఇప్పుడు తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తోంది.

రిజర్వులో తీర్పు :

ఇక హైకోర్టు ఈ నివేదికలను పరిశీలించిన మీదటనే తీర్పు వెలువరించనుండడంతో అంతవరకూ తీర్పుని రిజర్వ్ లో ఉంచారు. దాంతో ఇపుడు స్థానిక సంస్థల ఎన్నికల విషయం ఏమి జరుగుతుంది అన్నది చర్చకు తావిస్తోంది. బీసీ రిజర్వేషన్లు తేలితేనే తప్ప ఎన్నికలకు వెళ్ళలేని నేపథ్యం ఉంది. దాంతో రాజకీయ పార్టీలతో పాటు ఆశావహులు అంతా ఇపుడు హైకోర్టు తీర్పు ఏ విధంగా వస్తుంది అన్న దాని మీదనే ఫోకస్ పెడుతున్నారు. అదే సమయంలో అక్టోబర్ నెలాఖరు నాటికి మొత్తం స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు హై కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుంది అన్నది ఎదురుచూడక తప్పేట్లు లేదని అంటున్నారు.

Tags:    

Similar News