పెళ్లైన 17 రోజులకే అమెరికాలో హైదరాబాద్ యువ ఇంజినీర్ మృతి.. మిస్టరీగా మారిన జాబర్ హుస్సేన్ మరణం
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. పోస్టుమార్టం నివేదిక కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
అమెరికాలో మరో తెలుగు కుటుంబాన్ని తీవ్ర విషాదం వెంటాడింది. పెళ్లైన కేవలం 17 రోజులకే హైదరాబాద్‌కు చెందిన ఓ యువ ఇంజినీర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపుతోంది. మసాచుసెట్స్ రాష్ట్రంలోని లోవెల్ నగరంలో నివాసముంటూ సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న మొహమ్మద్ జాబర్ హుస్సేన్ (28) తన నివాస గదిలో చనిపోయి కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. పోస్టుమార్టం నివేదిక కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
నిద్రలోనే మృతి చెందినట్లు సమాచారం
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. జాబర్ హుస్సేన్ చివరిసారిగా సెప్టెంబర్ 14న హైదరాబాద్‌లోని తన కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడాడు. దాదాపు ఎనిమిది గంటల తర్వాత అతని రూమ్‌మేట్ ఫోన్ చేసి... జాబర్ నిద్రలోనే మృతి చెందినట్లు సమాచారం ఇచ్చినట్లు కుటుంబం తెలిపింది. అయితే అతనికి వెంటనే వైద్యసాయం అందిందా లేదా అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు.
ఆగస్టు 28న టెక్సాస్‌లో వివాహం
జాబర్ హుస్సేన్‌కు ఆగస్టు 28న టెక్సాస్‌లో వివాహం జరిగింది. వివాహం అనంతరం అతను తిరిగి మసాచుసెట్స్‌కు వెళ్లి తన ఉద్యోగంలో చేరాడు. అతని భార్య కూడా అతనితో కలిసి వెళ్లిందా లేదా అన్న విషయంపై స్పష్టమైన సమాచారం లేదు. పెళ్లైన 17 రోజులకే ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.
భారత్ ప్రభుత్వాన్ని ఆశ్రయించిన కుటుంబం
జాబర్ కుటుంబం ఆర్థికంగా బలహీన వర్గానికి చెందినదని.. అమెరికా నుంచి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకురావడానికి అయ్యే ఖర్చులు, న్యాయపరమైన ప్రక్రియలను పూర్తి చేయడం తమ వల్ల కాదని తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ జోక్యం చేసుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
ఈ విషయాన్ని మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) అధికార ప్రతినిధి అంజెద్ ఉల్లా ఖాన్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పంచుకున్నారు. జాబర్ తండ్రి మొహమ్మద్ జాకిర్ హుస్సేన్ రాసిన లేఖను షేర్ చేస్తూ అమెరికాలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సమన్వయం చేసి మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
2021లో ఉన్నత విద్య కోసం అమెరికాకు
జాబర్ హుస్సేన్ 2021లో అమెరికాకు వెళ్లి కనెక్టికట్‌లోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ హేవెన్ లో సివిల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు. 2023లో చదువు పూర్తయ్యాక ఇంటర్న్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. అనంతరం గ్రీన్ ఇంటర్నేషనల్ అఫిలిటీస్ కంపెనీలో లో పనిచేశాడు. ఈ ఏడాది జూన్‌లో మసాచుసెట్స్‌లోని లాంఛ్ నర్ సంస్థలో సివిల్ ఇంజినీర్‌గా చేరినట్లు అతని లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో ఉంది.
పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూపులు
జాబర్ హుస్సేన్ మరణానికి గల అసలు కారణం ఏమిటన్నది ప్రస్తుతం మిస్టరీగానే ఉంది. స్థానిక అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. పోస్టుమార్టం, వైద్య నివేదికలు వచ్చిన తర్వాతే మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మరోవైపు జాబర్ మృతదేహాన్ని త్వరగా హైదరాబాద్‌కు తీసుకురావాలని కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.