ఆర్థిక మందగమనం.. విదేశాలకు వెళ్లడం మానేస్తున్న జనాలు

తెలుగు రాష్ట్రాలకు విమానయాన కేంద్రంగా.. నిరంతరం దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులతో సందడిగా ఉండే హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కసారిగా మందగించింది.

Update: 2026-09-17 07:30 GMT

తెలుగు రాష్ట్రాలకు విమానయాన కేంద్రంగా.. నిరంతరం దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులతో సందడిగా ఉండే హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కసారిగా మందగించింది. అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలతో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు బలమైన కనెక్టివిటీ కలిగిన ఈ ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పుడు ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా తగ్గడం విమానయాన రంగంలో పెద్ద చర్చకు దారితీసింది. ఆకాశంలో విమాన సర్వీసులు తగ్గడమే కాకుండా టెర్మినల్‌లో అడుగుపెట్టే ప్రయాణికుల సంఖ్య కూడా ఆందోళనకరంగా పడిపోయింది.

తాజా గణాంకాలను పరిశీలిస్తే.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టు నెలలో ఎయిర్‌పోర్ట్ ట్రాఫిక్‌లో స్పష్టమైన తగ్గుదల నమోదైంది. గతేడాది ఆగస్టులో సుమారు ఇరవై నాలుగు లక్షల పైచిలుకు మంది ఈ విమానాశ్రయం ద్వారా ప్రయాణించగా.. ఈ ఏడాది అది ఇరవై ఒక్క లక్షల యాభై వేలకు పైగా మాత్రమే నమోదైంది. అంటే దాదాపు రెండు లక్షల ఎనభై వేలకు పైగా ప్రయాణికులు తగ్గారు. దేశీయంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పదమూడు శాతానికి పైగా తగ్గితే అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ ఏకంగా ఇరవై ఆరు శాతం వరకు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీనికి తోడు ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకల సంఖ్య కూడా పద్నాలుగు శాతానికి పైగా తగ్గిపోయింది.

ఈ రద్దీ తగ్గుదల వెనుక అనేక ఆర్థిక, సామాజిక అంశాలు బలంగా పనిచేస్తున్నాయి. విమాన ఇంధన ధరలు భారీగా పెరగడంతో విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులు ఎక్కువై టికెట్ ధరలను పెంచాల్సి వచ్చింది. ఈ అధిక భారంతో సాధారణ ప్రయాణికులు తమ పర్యటనలను వాయిదా వేసుకోవడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం జరుగుతోంది. మరోవైపు మధ్యప్రాచ్యం వంటి కీలక అంతర్జాతీయ ప్రాంతాల్లో నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల వల్ల విమాన సంస్థలు తమ షెడ్యూళ్లను, రూట్లను మార్చుకోవాల్సి వచ్చింది. గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులు, అమెరికా వెళ్లే విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల ప్రయాణాల్లో వచ్చిన మార్పులు కూడా ఇంటర్నేషనల్ ట్రాఫిక్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి.

ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల సంఖ్య తగ్గడం అనేది కేవలం టికెట్ల అమ్మకాలకు మాత్రమే పరిమితం కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. ఎయిర్‌పోర్ట్ ఆవరణలోని రెస్టారెంట్లు, రిటైల్ షాపులు, క్యాబ్ సర్వీసులు, హోటళ్లు , కార్గో విభాగాలు తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే దేశంలోని కొన్ని ఇతర ప్రధాన ఎయిర్‌పోర్ట్‌లలో ట్రాఫిక్ స్థిరంగానే ఉండటంతో ఇది పూర్తిగా స్థానిక మార్పుల వల్ల జరిగిందా లేక అంతర్జాతీయ డిమాండ్‌లో వచ్చిన వ్యత్యాసమా అనేది రాబోయే పండుగల సీజన్ గణాంకాలను బట్టి స్పష్టమవుతుంది.

Tags:    

Similar News