నాపైనే ఫిర్యాదులు చేస్తారా? తాటతీసేస్తా.. టీడీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే మాస్ వార్నింగ్
రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గంలో తొలిసారిగా గెలిచిన ఎమ్మెల్యే శిరీషాదేవి సొంత పార్టీ కార్యకర్తలపై శివాలెత్తారు.
సాధారణ అంగన్వాడీ కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రంపచోడవరం శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవి సొంత కేడర్ పై విరుచుకుపడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘ఒక్కొక్కడికి తాటతీస్తా..., కూర్చోరా కూర్చో... పది మంది మనుషులను కూడా తేలేరు పదవులు కావాలా మీకు, వైసీపీ వాళ్లకి పనులు చేస్తున్నానని పార్టీ ఆఫీసులో ఫిర్యాదులు చేసే దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది మీ సంగతి తేలుస్తా, తాటతీస్తా’’ అంటూ కార్యకర్తలకు ఎడాపెడా వాయించేస్తూ ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నేతల సమక్షంలోనే కార్యకర్తలపై ఎమ్మెల్యే శిరీషదేవి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో అక్కడ ఉన్న వారంతా షాక్ తిన్నారు.
రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గంలో తొలిసారిగా గెలిచిన ఎమ్మెల్యే శిరీషాదేవి సొంత పార్టీ కార్యకర్తలపై శివాలెత్తారు. ఎవరో కార్యకర్త తనను కలిసిన సచివాలయ ఉద్యోగి ఫొటో తీసుకుని వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యేగా తాను అందరిని కలవాల్సివుంటుందని, అందరితో మాట్లాడాల్సివుంటుందని చెప్పారు. కానీ కొందరు పార్టీ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమయంలో నిగ్రహం కోల్పోయిన ఎమ్మెల్యే శిరీషాదేవి ఒక కార్యకర్త మధ్యలో కల్పించుకుని ఏదో చెప్పబోతుంటే ‘‘కూర్చోరా కూర్చో’’ అంటూ ఘాటుగా స్పందించారు.
ఇక పార్టీ కార్యక్రమాలకు సరిగా రారని, కనీసం పది మంది కార్యకర్తలను తీసుకురాలేని వారు కూడా శిలాఫలకాలపై పేర్ల కోసం పదవులు ఆశిస్తున్నారని కొందరు కార్యకర్తలపై ఎమ్మెల్యే చిర్రుబుర్రులాడారు. పార్టీ పరిశీలకులు, సీనియర్ నేతల సమక్షంలో ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో కార్యకర్తలు షాక్ కు గురయ్యారు. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం చరిత్రలో ఎప్పుడూ టీడీపీ తరఫున ఎవరూ గెలవలేదు. కానీ, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే శిరీషాదేవి రికార్డు బ్రేక్ చేసి గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఎన్నికవడానికి ఐదు నెలల వరకు ఆమె అంగన్ వాడీ కార్యకర్తగా పనిచేసేవారు.
శిరీషాదేవి భర్త టీడీపీలో తిరుగుతున్నారనే కారణంగా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చిన శిరీషాదేవి కార్యకర్తల మనోగతాన్ని అర్థం చేసుకోకుండా బహిరంగ సమావేశంలోనే ‘తాటతీసేస్తా’ అంటూ విరుచుపడటంపై పార్టీ కేడర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని అంటున్నారు. తాము ఎంతో కష్టపడి పనిచేసిన విషయాన్ని మరచిపోయిన ఎమ్మెల్యే శిరీషాదేవి ఇప్పుడు తిరిగి తమపైనే అభాండాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే హోదాలో ఉన్న శిరీషాదేవి కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపై ఆమె నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ అధిష్టానం రాష్ట్రపార్టీని ఆదేశించినట్లు చెబుతున్నారు.