పవన్ అన్నా.. ఒరే లోకేశ్..! ఇద్దరి మధ్య గాఢమైన బంధం!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ మధ్య అనుబంధం ఎంత గాఢగం ఉందనే విషయం చెబుతూ యువనేత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ మధ్య అనుబంధం ఎంత గాఢగం ఉందనే విషయం చెబుతూ యువనేత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ తనకు దేవుడు ఇచ్చిన అన్నగా లోకేశ్ పలుమార్లు చెప్పారు. క్షేత్రస్థాయి పర్యటనల్లో పవన్ పేరు ప్రస్తావించాల్సిన సందర్బంలో తన అన్నయ్య అంటూ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న లోకేశ్.. తాజాగా మరో ఆసక్తికర విషయం బయటపెట్టారు. లోకేశ్ చెప్పిన దాని ప్రకారం ఇద్దరు ముఖ్య నేతల మధ్య అనుబంధం వ్యక్తిగతంగా కూడా బలపడిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా నెల్లూరు పర్యటనకు వెళ్లిన మంత్రి లోకేశ్ ఆ జిల్లాలోని కోవూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. కూటమిలో చిన్నచిన్న భేదాభిప్రాయాలు ఉంటాయని, క్షేత్రస్థాయి పరిస్థితుల్లో అవి అత్యంత సహజమని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తమ స్థాయిలో నాయకత్వంలో ఎక్కడా విభేదాలు లేవని, ఆ అవకాశం కూడా రానివ్వమని తేల్చిచెప్పారు. కూటమిలో క్రాస్ ఫైర్, మిస్ ఫైర్, విడాకులు వంటివి ఉండవని స్పష్టం చేశారు. కోటి మంది టీడీపీ కుటుంబం జనసేన, బీజేపీ చేరికతో మరింత పెద్దదైందని అన్నారు. ఇదే సమయంలో ఇటీవల ఇండియా టుడే కాన్ క్లేవ్ లో పాల్గొనేందుకు తాను కోయంబత్తూరు వెళ్లగా, అక్కడ జరిగిన ఆసక్తికర సంఘటనను లోకేశ్ కార్యకర్తలకు తెలిపారు.
ఇండియా టుడే ఇంటర్య్వూలో 2029లో కూటమిగా కలిసి పోటీచేస్తారా? అని తనకు ప్రశ్న ఎదురైందని, అయితే తాను నిస్సందేహంగా కలిసివుంటామని చెప్పానని వివరించారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత పవన్ తనకు ఫోన్ చేసి మనం మూడుసార్లు కలిసి పోటీచేస్తామంటే, నువ్వు ఒకసారి అని చెబుతున్నావేంటి? అంటూ ప్రశ్నించారని అన్నారు. అదేసమయంలో రాష్ట్రంలో పరిపాలన, రాజకీయంగా తనకు ఏదైన డౌటు వస్తే వెంటనే పవన్ అన్నకు ఫోను చేస్తానని, ఆయన కూడా తనకు ఫోన్ చేసి ‘‘అరేయ్ లోకేశ్’’ అంటూ మాట్లాడతారని అన్నారు. అయితే ప్రభుత్వంలో అత్యంత కీలక స్థానంలో ఉన్న లోకేశ్ ను పవన్ ‘అరేయ్, ఒరేయ్’ అంటూ పిలుస్తారా? అంటూ రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నిస్తూ మంత్రి లోకేశ్ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు.
అయితే పవన్, లోకేశ్ మధ్య ఎటువంటి అమరికలు లేవని, ఇద్దరి మధ్య మంచి అనుబంధం, అవగాహన ఉందని చెప్పే ప్రయత్నంలో మంత్రి లోకేశ్ అలా మాట్లాడి ఉండవచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఈ సమావేశం ద్వారా టీడీపీ-జనసేన మధ్య విభేదాలు వచ్చేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని కేడర్ కు మంత్రి లోకేశ్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారని అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో తమ కేడర్ ను తొక్కేస్తున్నారంటూ ఇటీవల జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు కూటమిలో కలకలం రేపాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలను గౌరవించాల్సిందేనని, వారికి సరైన గుర్తింపు ఇవ్వాలని టీడీపీ నేతలకు చెప్పేందుకు మంత్రి లోకేశ్ కోవూరు సభలో ఇలా మాట్లాడి ఉంటారని అంటున్నారు.