డీ లిమిటేషన్ కు కేటీఆర్ ఒప్పుకున్నట్లేనా ?

ఈ నేపథ్యంలో ‘తాము వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని, బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోబోమని, తెలంగాణ ఏర్పడిన తరువాత తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని’ కేటీఆర్ స్పష్టం చేశారు.

Update: 2026-09-17 06:40 GMT

‘లోక్ సభలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం 24 శాతం ప్రాతినిధ్యం ఉంది. మొత్తం లోక్ సభ స్థానాల సంఖ్యను దామాషా లెక్కల ప్రకారం పెంచితే నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతు ఇవ్వడంలో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సమస్యా లేదు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హర్యానాలోని సోనీపట్ లో ఉన్న ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీలో నిర్వహించిన ‘పాలనలో నవకల్పన - ఒక స్టార్టప్ రాష్ట్రం కథ’ అంశం మీద కేటీఆర్ సుధీర్ఘంగా ప్రసంగించారు. అనంతరం అక్కడి విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

ఈ సంధర్భంగా విద్యార్థులు 2028 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ‘తాము వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని, బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోబోమని, తెలంగాణ ఏర్పడిన తరువాత తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని’ కేటీఆర్ స్పష్టం చేశారు.

ఏఐ మరియు సాంకేతిక పరివర్తనల మీద వచ్చిన ప్రశ్నల విషయంలో స్పందిస్తూ ‘ప్రతి పెద్ద సాంకేతిక మార్పు సమయంలోనూ ఆందోళనలు, సందేహాలు సహజం అని, ప్రస్తుతం ఏఐ విషయంలోనూ అదే జరుగుతుందని, కాలనుగుణంగా వస్తున్న సాంకేతిక మార్పులను స్వీకరించి ముందుకు సాగాలని’ కేటీఆర్ అన్నారు.

తెలంగాణ ఏర్పడిన కొత్తలో కొత్త రాష్ట్రం నిలదొక్కుకోగలదా ? వనరులు, సంస్థలు, పాలనా సామర్ధ్యం ఉన్నాయా ? అన్న ప్రశ్నలకు అభివృద్ధి, పరిపాలనా విధానాల ద్వారా సమాధానం ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణను కేవలం కొత్త రాష్ట్రంగా కాకుండా, ప్రజలకు విలువ సృష్టించే స్టార్టప్ స్టేట్‌గా తీర్చిదిద్దామని అన్నారు.

నీరు, కరంటు, వ్యవసాయం ద్వారా ప్రజలకు భరోసా అందించామని, స్టార్టప్ లు, నైపుణ్యాలు, ఆవిష్కరణల ద్వారా కొత్త అవకాశాలు కల్పించామని, ఇండ్లకు తాగునీరు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు మూలంగా 2014-15లో 44.4 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న బియ్యం ఉత్పత్తి 2023-24 నాటికి 168.8 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందని, జాతీయ సగటుకన్నా తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగిందని కేటీఆర్ అన్నారు.

కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నుండి టీ హబ్ వరకు ప్రజలకు భరోసా, యువతకు అవకాశాలు లక్ష్యంగా పనిచేశామని, సందేహాల రాష్ట్రం నుండి తెలంగాణ దేశానికి ఒక మోడల్ గా నిలిచిందని, దేశ అభివృద్ధికి సమాధానంగా నిలుస్తుందని కేటీఆర్ వెల్లడించారు.

Tags:    

Similar News