నీకు ప్యాలెస్ ఉండొచ్చు .. కేసీఆర్ కు పొలం ఉండొద్దా ?!

నిన్నటి దాకా కేటీఆర్ ఫామ్ హౌస్ వెయ్యి ఎకరాలు అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు 67 ఎకరాలని చెబుతున్నాడని, అది ఇప్పటికే ఎన్నికల అఫిడవిట్లో ఉందని, కొత్తగా రేవంత్ రెడ్డి చెప్పేది ఏముందని కేటీఆర్ అన్నారు

Update: 2026-09-17 07:02 GMT

‘కేసీఆర్ పుట్టినప్పుడు ఆయన ఇల్లు రెండు ఎకరాలు. ఆయన తండ్రికి వందల ఎకరాల భూమి ఉండేది. చింతమడకలోని ఇల్లును పాఠశాలకు దానం చేశారు. ఆయనది రైతు కుటుంబం కాబట్టి వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో ఇప్పటికీ వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. గోడల మీద పెయింట్ వేసుకునే రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ లో ప్యాలేస్ ఉండొచ్చు. కానీ కేసీఆర్ కు వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఉండొద్దా. కొండారెడ్డి పల్లికి వెళ్లి అడిగితే రేవంత్ బతుకేంటో బయటపడుతుంది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు.

బుధవారం శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఫాంహౌస్ 700 ఎకరాలలో ఉందని, అందులో మూడు వందలకు పైగా ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, దానిని దళితులకు పంచుతామని చెబుతూ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. నెల రోజుల లోపున ఈ విచారణ పూర్తి చేయాలని ఆధికారులను, మంత్రిని ఆదేశిస్తూ ఇందులో విఫలం అయితే వారి మీద చర్యలు తీసుకుంటానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో గురువారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

తాను అమెరికాలో ఆరున్నర సంవత్సరాలు ఉద్యోగం చేసి సంపాదించుకున్నాను. రేవంత్ రెడ్డి ఏం చేసి సంపాదించాడని కేటీఆర్ ప్రశ్నించాడు. కూకట్ పల్లిలో ఉండే కొండల్ రావు అనే వ్యక్తి ఆస్తులు కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆస్తులలో కలిపేశాడని, కేసీఆర్ అక్కాచెల్లెల్లు,అన్నాతమ్ముళ్ల సంతానం 300 వరకు ఉంటారని, వాళ్ల ఆస్తులు కూడా మా ఖాతాలో వేయమని కేటీఆర్ అన్నారు.

రేవంత్ రెడ్డి అన్నదమ్ముల ఆస్తులు ఆయన ఖాతాలో వేయొచ్చా ? సంతోష్ రావుకి, మాకు చుట్టరికం ఉంటే వారి ఆస్తులు కూడా మా ఖాతాలో వేస్తారా ? అని కేటీఆర్ ప్రశ్నించారు. సిరిసిల్లలో 8 వేల ఎకరాలు మా వాళ్లు కబ్జా చేశారని రేవంత్ రెడ్డి అన్నాడని, ఆ వివరాలను ఆధారాలతో సహా బయటపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

నిన్నటి దాకా కేటీఆర్ ఫామ్ హౌస్ వెయ్యి ఎకరాలు అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు 67 ఎకరాలని చెబుతున్నాడని, అది ఇప్పటికే ఎన్నికల అఫిడవిట్లో ఉందని, కొత్తగా రేవంత్ రెడ్డి చెప్పేది ఏముందని కేటీఆర్ అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రగతి భవన్లో 150 గదులు ఉన్నాయని, బంగారు బాత్రూంలు ఉన్నాయని మాట్లాడారని, అవి ఎంత నిజమో, ప్రస్తుతం చేస్తున్న వ్యాఖ్యలు కూడా అంతే నిజం అని అన్నారు.

దళితుల మీద రేవంత్ రెడ్డి ఎక్కడా లేని ప్రేమ కురిపిస్తున్నాడని, ఆయన ప్రేమ చూసి ఎక్కడ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను సీఎం చేస్తాడో అని అనుకున్నానని కేటీఆర్ ఎద్దేవా చేశారు. నిజంగా రేవంత్ రెడ్డికి దళితుల మీద ప్రేమ ఉంటే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయాలని, దళితబందు రూ.12 లక్షలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని అన్నారు.

మొత్తానికి 22ఎ నిషేధిత భూముల అంశం అటు తిరిగి, ఇటు తిరిగి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మీదకు మళ్లింది. మరి ప్రభుత్వ విచారణలో అక్కడ ఉన్న ప్రభుత్వ భూములు ఉన్నదీ లేనిదీ తేలుతుందా ? ఆ భూములు బయటపడితే వెంటనే దళితులకు పంచుతారా ? అన్న విషయం వేచిచూడాలి.

Tags:    

Similar News