స్థానిక ఎన్నికల ప్రచారం...జగన్ నిర్ణయం ఇదే ?
ఏపీలో స్థానిక ఎన్నికల వేడి రాజుకుంది. ఎక్కడా తగ్గకూడదని వైసీపీ అలాగే మొత్తానికి మొత్తం క్లీన్ స్వీప్ చేయాలని అధికార కూటమి పోటా పోటీగా రంగంలోకి దిగుతున్న నేపథ్యం ఉంది.
ఏపీలో స్థానిక ఎన్నికల వేడి రాజుకుంది. ఎక్కడా తగ్గకూడదని వైసీపీ అలాగే మొత్తానికి మొత్తం క్లీన్ స్వీప్ చేయాలని అధికార కూటమి పోటా పోటీగా రంగంలోకి దిగుతున్న నేపథ్యం ఉంది. ఏకగ్రీవాల విషయంలో అయితే వైసీపీ అసలు వద్దే వద్దు అంటోంది. ప్రతీ చోటా వైసీపీ నుంచి పోటీకి అభ్యర్ధిని దించాల్సిందే అని అధినేత జగన్ ఆదేశాలు జారీ చేశారు. అంతే కాదు ప్రతీ అసెంబ్లీ స్థాయిలో సమావేశాలు నిర్వహించి గ్రౌండ్ లెవెల్ లో అంతా యాక్టివ్ కావాలని సూచించారు. దాని ప్రకారమే పెద్ద ఎత్తున సమావేశాలు ఏపీలో వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇక రీజనల్ కో ఆర్డినేటర్లు ఆయా సమావేశాలకు హాజరవుతున్నారు.
కూటమిలో సన్నాహాలు :
మరో వైపు కూటమి పార్టీలు కూడా ఎన్నికల కోసం సన్నాహాలు చేసుకుంటున్నాయి. సీట్ల సర్దుబాటు విషయం ఇంకా తెలియకపోయినప్పటికీ నియోజకవర్గం జిల్లా స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేసి మరీ మూడు పార్టీలు ఐక్యతను చాటుతున్నాయి. వైసీపీకి అసలు చాన్స్ ఇవ్వకూడదని కూడా తీర్మానించాయి. వైసీపీకి ఒక్క సీటు వస్తే ఒట్టు అన్నట్లుగా కలసికట్టుగా కూటమి పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో స్థానిక ఎన్నికల వేడి అయితే వేసవిని తలపించేలా ఉంది అని అంటున్నారు.
అమీ తుమీ అంటూ :
వైసీపీ అధినాయకత్వం అయితే ఈ ఎన్నికల్లో అమీ తుమీ తేల్చుకోవాల్సిందే అంటోంది. రెండేళ్లకే కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెద్ద ఎత్తున ఏర్పడిందని దానికి సొమ్ము చేసుకోవాలని కూడా జగన్ పార్టీ శ్రేణులకు పిలుపు ఇస్తున్నారు. ఈ ఎన్నికలు కీలకం అని ఒకటికి పది సార్లు చెబుతున్నారు. గ్రౌండ్ లెవెల్ లో క్యాడర్ కి నియోజకవర్గం ఇంచార్జిలు ఇపుడు సహకారంగా నిలిస్తే రేపటి ఎన్నికల్లో వారు ఎమ్మెల్యే అభ్యర్ధులకు తిరిగి సహకరిస్తారు అని చెబుతున్నారు. దాంతో వైసీపీలో కూడా కొత్త ఉత్సాహం ఏర్పడింది. మరి ఇంతలా స్థానిక ఎన్నికల విషయంలో వైసీపీ అధినేత పార్టీ శ్రేణులకు సూచనలు ఇస్తూ రంగంలోకి దింపుతున్న వేళ ఆయన ఎన్నికల వ్యూహాలు ఎలా ఉంటాయి అన్న దాని మీదనే ఇపుడు చర్చ సాగుతోంది.
ప్రచారానికి దిగుతారా :
స్థానిక సంస్థల ఎన్నికలు అంటే పంచాయతీ వార్డు మెంబర్ నుంచి మెయర్ దాకా జరగనున్నాయి. దాంతో సార్వత్రిక ఎన్నికల్లో వేసినట్లుగానే ఓటర్లు మొత్తం మరోసారి ఓటు వేస్తారు. దాంతో నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే కనుక కచ్చితంగా బయట పడుతుంది అని అంటున్నారు. మరి ఈ బంగారు అవకాశాన్ని వైసీపీ ఏ విధంగా వాడుకుంటుంది అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. నిజానికి జగన్ ఎన్నికల ప్రచారం చేస్తే బాగుంటుంది అన్నది పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న అభిప్రాయంగా ఉంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతగా అప్పట్లో ఉన్న చంద్రబాబు ప్రచారం చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. మరి జగన్ ఏమి చేయబోతున్నారు అన్నదే చర్చగా ఉంది.
మీడియాకే పరిమితమా :
అయితే వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం బట్టి చూస్తే జగన్ స్థానిక ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉంటారని అంటున్నారు. స్థానిక ఎన్నికలు అంటే ఎటూ అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయని అంటున్నారు. అదే సమయంలో అంగబలం అర్ధ బలానికి తోడు అధికార బలం కూడా ఉందని అంటున్నారు. వైసీపీ క్యాడర్ యాక్టివ్ కావడానికి పోటీకి దిగుతోందని అంటున్నారు. ఒక వేళ అన్నీ అనుకూలించి గెలుపు అవకాశాలు ఉన్న చోట గెలిచినా అది గొప్ప విజయమే అవుతుందని అంటున్నారు. అయితే జగన్ నేరుగా జనంలోకి వచ్చి ప్రచారం చేస్తే ఒక వేళ అనుకోని విధంగా ఫలితాలు రాకపోతే అది జగన్ ఇమేజ్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు. అందుకే జగన్ మీడియా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వాన్ని ఎండగడతారు అని సీనియర్ నేతలే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహిస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఈ ఊహాగానాలే నిజమా లేక జగన్ నిజంగా దూరంగా ఉంటారా అన్నది.