బంగ్లాదేశ్ వెళ్తే షేక్ హసీనాకు ఉరిశిక్షేనా ?
ఇక భారత ప్రభుత్వం అయితే షేక్ హసీనాకు పూర్తి భద్రత కల్పిస్తూ న్యూఢిల్లీలోని ల్యుటెన్స్ బంగ్లా జోన్‌లోని ఒక సురక్షిత గృహంలో వసతి కల్పించింది.
షేక్ హసీనా. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని. సుదీర్ఘ కాలం దేశాన్ని ఏలిన మహిళా నాయకురాలు. అంతే కాదు బంగ్లాదేశ్ ని సాధించిన జాతిపిత ముజఫర్ రెహమాన్ కుమార్తె. ఆమె రాజయోగం అంతా గత వైభవం కాగా ముదిమి వయసులో పెద్ద కష్టం వచ్చింది. కట్టుబట్టలతో ఆమె బంగ్లాదేశ్ ని వీడి భారత్ కి వచ్చి తలదాచుకోవాల్సి వచ్చింది. అలా ఆమె 2024 ఆగస్టు నుంచి భారత్ లో ప్రవాస జీవితమే గడుపుతున్నారు. అప్పట్లో బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన తీవ్ర నిరసనలు తిరుగుబాటు కారణంగా ఆమె తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారతదేశానికి రావాల్సి వచ్చింది.
మరణ శిక్ష విధింపు :
ఇక భారత ప్రభుత్వం అయితే షేక్ హసీనాకు పూర్తి భద్రత కల్పిస్తూ న్యూఢిల్లీలోని ల్యుటెన్స్ బంగ్లా జోన్‌లోని ఒక సురక్షిత గృహంలో వసతి కల్పించింది. అయితే ఆమె బంగ్లాదేశ్ నుంచి వచ్చేసిన తరువాత అక్కడి బంగ్లాదేశ్ ప్రత్యేక కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. అయినప్పటికీ తాను సొంత దేశం వెళ్లి తీరుతాను అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షేక్ హసీనా స్పష్టం చేశారు. తన మీద పెట్టిన కేసులు అన్నీ తప్పుడు తడకలు అని వాటిని అక్కడే తేల్చుకుంటాను న్యాయ పోరాటం చేస్తాను అని కూడా ఆమె అంటున్నారు. ఆమె ఈ ఏడాది అంటే డిసెంబర్ నాటికి తిరిగి తన స్వదేశానికి చేరుకుని ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కృషి చేస్తానని ఇటీవల ప్రకటించారు.
అవామీ లీగ్ నేతలకు ఉరి శిక్ష :
ఇదిలా ఉంటే షేక్ హసీనా ఎపుడైతే బంగ్లాదేశ్ కి తిరిగి వస్తాను అని ప్రకటించారో నాటి నుంచి అక్కడి పాలకులు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. ఆమెకు పాస్ పోర్టు లేదు ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆమె వస్తే అపుడు చూద్దామని కూడా అంటున్న వారు ఉన్నారు. ఈ నేపధ్యంలో తాజాగా ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ కి చెందిన పలువురు నేతలకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ తాజాగా ఉరిశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 2024 విద్యార్థి ఉద్యమంలో అణచివేతలకు అలాగే మానవత్వానికి వ్యతిరేకంగా అనేక నేరాలకు పాల్పడ్డారు అంటూ అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ ఖాదర్‌తో సహా ఏడుగురు సీనియర్ నాయకులకు మరణ శిక్ష ఖరారు చేస్తూ జస్టిస్ నజ్రుల్ ఇస్లామ్ చౌదరి నేతృత్వంలోని ట్రైబ్యునల్ తాజాగా ఈ తీర్పుని ఇచ్చింది. వెలువరించింది.
ఉరి కంబం ఎక్కేది ది వీరే :
ఇక అక్కడి అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ తీర్పుతో ఉరి కంబం ఎక్కబోయే అవామీ లీగ్ నేతలు ఆవామీ లీగ్ జనరల్ సెక్రటరీ మాజీ మంత్రి అయిన ఒబైదుల్ ఖాదర్, జాయింట్ జనరల్ సెక్రటరీ బహావుద్దీన్ నసీమ్, ఆ దేశ మాజీ సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి మహ్మద్ అలీ అరాఫత్, జుబో లీగ్ నేతలు షేఖ్ ఫజల్ షమ్స్ పరాష్, మైనుల్ హుస్సేన్ ఖాన్ నిఖిల్, ఛాత్ర లీగ్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్, ఛాత్ర లీగ్ జనరల్ సెక్రటరీ షేక్ వలీ ఆసిఫ్ ఉన్నారు. కొద్ది నెలలలోనే సొంత దేశం వస్తాను అని న్యాయ పోరాటం చేస్తాను అని షేక్ హసీనా చెప్పిన తరువాత ఈ విధంగా ఆమె సొంత పార్టీ నేతలకు ఉరి శిక్షను ఖరారు చేయడం ఇపుడు సంచలనం రేపుతోంది.
షేక్ హసీనా వచ్చినా :
అవామీ లీగ్ కి ఆయువు పట్టుగా ఉన్న కీలక నేతలకే ఉరికంబం ఎక్కిస్తున్న క్రమంలో రేపటి రోజున షేక్ హసీనా వచ్చినా కూడా ఇవే కేసులలో ఇదే రకమైన ఆరోపణలతో ఆమెకు ఇప్పటికే విధించిన ఉరి శిక్షను అమలు చేయమని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ తీర్పు చెప్పినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరి సొంత దేశం వెళ్ళాలని షేక్ హసీనా పట్టుదలగా ఉన్నారు. ఆమె రాక ముందే అక్కడ ఈ విధంగా పరిస్థితి ఉంది. నిజంగా ఆమె బంగ్లాదేశ్ వెళ్తే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అని అంతా అంటున్నారు.