రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం: భారత్‌పై 100 శాతం టారిఫ్ అస్త్రం?

రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై తమ ఒత్తిడిని అమెరికా మరోస్థాయికి తీసుకెళ్లింది.

Update: 2026-09-17 05:15 GMT

"అటు రష్యా నుంచి డిస్కౌంట్ చమురు కొంటే.. ఇటు అమెరికా నుంచి 100 శాతం టారిఫ్ గిఫ్ట్ ఇస్తానంటోంది అగ్రరాజ్యం.. 'మా వైపు నిలబడకపోతే మీ జేబులు గుల్ల చేస్తాం' అని వాషింగ్టన్ పెద్దలు విసిరిన ఈ వార్నింగ్ చూస్తుంటే 'డోలు బాదేటోడు ఒకడైతే.. వెనుక తాళం వేసేటోడు ఇంకొకడు' అన్నట్టుంది పరిస్థితి. జగడం ఉక్రెయిన్-రష్యాల మధ్యనైతే బిల్లు మాత్రం భారత ఎగుమతిదారుల నెత్తిపై రాసేందుకు వైట్‌హౌస్ స్కెచ్ వేస్తోంది. ఇక ట్రంప్ గారు ఈ టారిఫ్‌ల తుపాకీకి పెన్నుతో సంతకం పెట్టి ట్రిగ్గర్ నొక్కుతారో.. లేక అలవాటు ప్రకారం ఇంకేదైనా ట్విస్ట్ ఇస్తారో అని న్యూఢిల్లీ వర్గాలు కాస్త నవ్వుకుంటూనే గుండెలు పట్టుకుని చూస్తున్నాయి..

రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై తమ ఒత్తిడిని అమెరికా మరోస్థాయికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో భారత్, చైనాలను ప్రత్యక్షంగా ఉద్దేశిస్తూ అమెరికా సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాపై ఆంక్షల బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపిన అనంతరం ఆయన స్పందిస్తూ భారత్ , చైనాలు రష్యా నుంచి కాకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల నుంచి చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా రష్యా పట్ల బుజ్జగింపు ధోరణి ఎంతమాత్రం సరైన వ్యూహం కాదని.. భాగస్వామ్య దేశాలు తమ వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

రష్యా, ఇరాన్‌లపై ఆర్థిక ఆంక్షలను అత్యంత కఠినతరం చేసేందుకు రూపొందించిన "లిండ్సే ఓ. గ్రాహమ్ సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్" కు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదముద్ర వేసింది. ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 262 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 159 ఓట్లు నమోదయ్యాయి. అంతకుముందే అమెరికా సెనేట్‌లో కూడా ఈ బిల్లుకు 86-11 ఓట్ల భారీ మెజారిటీతో ఆమోదం లభించింది. రెండు సభల ఆమోదం పొందిన ఈ బిల్లు ప్రస్తుతం తుది సంతకం, అమలు కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్దకు చేరుకుంది.

ఈ బిల్లులోని అత్యంత కీలకమైన నిబంధన ప్రకారం.. రష్యా నుంచి అధిక మొత్తంలో ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాలపై 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించే విశేష అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కట్టబెట్టారు. రష్యా నుంచి రాయితీ ధరలకు భారీగా చమురు కొనుగోలు చేస్తున్న ప్రధాన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉన్నందున.. ఈ నిబంధన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ ఈ ఆంక్షలు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే అమెరికాకు జరిగే భారత ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే 100 శాతం టారిఫ్ అనేది భారత్‌పై తక్షణమే లేదా ఆటోమేటిక్‌గా అమలు కాబోదు. ఈ బిల్లు అధ్యక్షుడికి ఆ అధికారాన్ని మాత్రమే ఇస్తుంది. కాబట్టి బిల్లు చట్టంగా మారిన తర్వాత ఏ దేశంపై ఏ స్థాయిలో ఎప్పుడు ఈ టారిఫ్‌లను ప్రయోగించాలనేది పూర్తిగా వైట్‌హౌస్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

తన దౌత్య ప్రాధాన్యతలు, జాతీయ ప్రయోజనాలు, ఇంధన భద్రత ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ కొంతకాలంగా రష్యా నుంచి ముడి చమురును క్రమబద్ధంగా దిగుమతి చేసుకుంటోంది. అయితే రష్యాకు దక్కే ఈ చమురు ఆదాయం మాస్కో ఆర్థిక రంగానికి ఊతమిస్తూ ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగించేందుకు మూలధనంగా మారుతోందని వాషింగ్టన్ తీవ్రంగా ఆరోపిస్తోంది. అందువల్లే మాస్కో ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు రష్యా ఇంధనంపై ఆధారపడే దేశాలపై అమెరికా ఈ విధమైన ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగిస్తోంది.

ప్రస్తుతానికి భారత్‌పై టారిఫ్‌లు ఏవీ విధించబడలేదని తెలుస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ ఈ బిల్లుపై సంతకం చేయడం, ఆ తర్వాత తనకున్న విశేష అధికారాలను ఏ విధంగా వినియోగిస్తారనే దాన్ని బట్టి రాబోయే పరిణామాలు మారనున్నాయి. ఒకవైపు దేశీయ అవసరాల కోసం రష్యాతో ఇంధన వాణిజ్యం కొనసాగించడం.. మరోవైపు అమెరికాతో కీలకమైన దౌత్య, వాణిజ్య బంధాలను కాపాడుకోవడం న్యూఢిల్లీకి పెద్ద సవాలుగా మారింది. అమెరికా వైట్‌హౌస్ తీసుకునే తదుపరి నిర్ణయాలు.. దానికి భారత్ ఇచ్చే దౌత్యపరమైన స్పందన ఎలా ఉంటాయనేది ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య వర్గాలలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Tags:    

Similar News