నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?
| వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తరచూ పార్టీ నాయకులతో ఒక మాట అంటూ ఉంటారు. తమ పార్టీ పోరాటాల నుంచి పుట్టింది అని.
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తరచూ పార్టీ నాయకులతో ఒక మాట అంటూ ఉంటారు. తమ పార్టీ పోరాటాల నుంచి పుట్టింది అని. అలాగే తమకు ప్రతిపక్ష పాత్ర కొత్త కాదని, ఈ రెండూ నిజాలే. వైసీపీ ఏర్పాటుకు ముందూ తరువాత అనేక రాజకీయ పోరాటాలు జగన్ చేశారు. ఆయన 2011లో వైసీపీని ప్రారంభిస్తే 2019లో అధికారం అందుకున్నారు. అంటే ఎనిమిదేళ్ళ పాటు సుదీర్ఘమైన ప్రజా పోరాటాలు చేశారు అన్న మాట. అలాగే వైసీపీ ఇప్పటివరకూ సాగించిన తన 15 ఏళ్ళ ప్రస్తానంలో అయిదేళ్ళు తప్ప మిగిలిన పదేళ్ళ కాలం అంతా ప్రతిపక్షంలోనే ఉంది. మరో రెండున్నరేళ్ళు కూడా విపక్షంలోనే ఉండబోతోంది. ఇక వైసీపీ ఆశలు పెట్టుకున్నట్లుగా 2029 లో అధికారంలోకి వస్తే విపక్ష వనవాసానికి స్వస్తి పలికినట్లు అవుతుంది.
మధ్యలోనే అంతరం :
ఇక మొత్తం 15 ఏళ్ళ వైసీపీకి అధినేతగా జగన్ తొలి ఎనిమిదేళ్ళూ చాలా ఎక్కువగానే కష్టపడ్డారు. ఆయన జనంతోనే మమేకం అవుతూ వచ్చారు. ప్రతీ అంశం మీద పోరాటాలు చేశారు. 2014 నుంచి 2019 మధ్యలో అయితే పోలవరం కోసం పాదయాత్ర, అలాగే రాయలసీమ నీటి ప్రాజెక్టుల కోసం జల దీక్ష ఇంకా అనేక రకాలైన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్లారు. అటు అసెంబ్లీలో కూడా విపక్ష నేతగా ప్రజల గొంతుకగా గట్టిగానే మాట్లాడుతూ వచ్చారు. 2017 నుంచి చూస్తే ఏకంగా జనంలోకే వచ్చేశారు. ఆయన 2019 జనవరి 9 దాకా పాదయాత్ర చేస్తూ మొత్తం ఏపీ అంతా కలియతిరిగారు. అలాంటిది 2019లో అధికారంలోకి రాగానే జగన్ రాజ ప్రాసాదాల మధ్యలో ఉండిపోయారు అని విమర్శలు వచ్చాయి. ఆయన ముఖ్యమంత్రిగా పెద్దగా పర్యటనలు చేయలేదని కూడా కామెంట్స్ ఉన్నాయి. విపక్షాలు అప్పట్లో అయితే పరదాలు కట్టుకుని జనం మధ్యకు వెళ్లేవారు అని హాట్ కామెంట్స్ చేస్తూ వచ్చాయి. ఇక 2024లో ఓటమి తరువాత కూడా జగన్ పెద్దగా ప్రజా క్షేత్రంలోకి వెళ్ళింది లేదని కూడా విమర్శలు ఉన్నాయి.
ఒక్కసారిగా నేలపైకి :
అలాంటిది జగన్ ఒక్కసారిగా నేల పైకి వచ్చారు. ఆయన అనూహ్యంగా పులివెందులలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆఫీసు ముందు బైఠాయించి నిరసనలు తెలిపారు. ఒక విధంగా జగన్ లో వచ్చిన ఈ మార్పుని చూసి ప్రత్యర్ధులు ఆశ్చర్యపోతూంటే సొంత పార్టీ వారికి హుషార్ పెరిగింది. మళ్ళీ పాత జగన్ ని చూస్తున్నామని కూడా వారు సంబరపడ్డారు. ఇక పులివెందులకు జగన్ వచ్చి ఓటేస్తారు అని అంతా అనుకున్నారు. ఆయన నిరసనలు అన్నవి పార్టీ నేతలకు కూడా తెలియదు. సడెన్ గా తీసుకున్న నిర్ణయం అది. క్యాడర్ కి అండగా ఉండేందుకు అప్పటికప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం వైసీపీలో కొండంత ధైర్యం ఇచ్చింది అని అంటున్నారు. అదే సమయంలో జగన్ నేలకి దిగిరావడం పార్టీకి శుభ పరిణామం అని కూడా అంటున్నారు.
ఇదే దూకుడుతో :
సార్వత్రిక ఎన్నికలకు గట్టిగా రెండున్నరేళ్ళు మాత్రమే సమయం ఉంది. మరో రెండు నెలల్లో క్యాలెండర్ మారి 2027 వస్తుంది. ఆ ఏడాది గడిస్తే చాలు 2028 అంతా ఎన్నికల ఏడాది గానే మారిపోతుంది. దాంతో ఇప్పటి నుంచే వైసీపీలో ఆ దూకుడు రావాలి అని అంటున్నారు. దాంతో అధినాయకత్వం ఆ దిశగా ఆలోచన చేస్తోంది అని అంటున్నారు. అందుకే జగన్ నేల మీదకు వచ్చి నిరసనలకు దిగారని చెబుతున్నారు. జగన్ పరదాల మాటు నుంచి నేల మీదకు రావడం వైసీపీకి పాజిటివ్ గా కనిపిస్తూంటే ప్రత్యర్ధులు అయితే కాలం ఎపుడూ ఒకేలా ఉండదని అందుకే దిగి వచ్చారని అంటున్నారు. ఏది ఏమైనా ఈ మార్పు మంచిదే అని ఈ జోరుతో ప్రజా సమస్యల మీద బలమైన ప్రతిపక్షంగా పోరాడితే రాష్ట్రానికి కూడా మేలు అని అంటున్నారు తటస్థులు. మరి వైసీపీ ఏ విధంగా ముందుకు సాగుతుందో చూడాల్సి ఉంది.