జపాన్ లో సెంచరీ...డెడ్ ఈజీ టాస్క్ !

భారత దేశంలో సగటు జీవిత కాలం చూస్తే సుమారు 71 నుండి 72 సంవత్సరాలుగా ఉంది.

Update: 2026-09-17 03:45 GMT

భారత దేశంలో సగటు జీవిత కాలం చూస్తే సుమారు 71 నుండి 72 సంవత్సరాలుగా ఉంది. అదే జపాన్ లో చూస్తే సగటు జీవిత కాలం ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారంగా మహిళల సగటు జీవితకాలం 87.33 సంవత్సరాలు ఉంది. అలాగే పురుషుల సగటు జీవితకాలం 81.35 సంవత్సరాలు ఉంది. మొత్తం దేశ సగటు ఆయుర్దాయం సుమారు 85 సంవత్సరాలుగా ఉంది. జపాన్ లో ఎనభై తొంబై ఏళ్ళు అత్యధికులు జీవిస్తారు. అంతే కాదు వందేళ్ళు అక్కడ సులువుగా చేరుకుంటారు. లేటెస్ట్ గా చూస్తే జపాన్ లో వందేళ్ల జీవితాన్ని పూర్తి చేసిన వారు ఏకంగా లక్ష మందికి పైగా ఉన్నారు. అని తేలింది. ఇది ప్రపంచ రికార్డుగా ఉంది. జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆ దేశంలో 100 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య ఒక లక్షా 7 వేల 677 కి చేరుకుంది. 1963లో ఈ రికార్డులను సేకరించడం ప్రారంభించినప్పటి నుండి వందేళ్లు దాటిన వారి సంఖ్య ఒక లక్ష మార్కును దాటడం ఇదే మొదటి సారి అని చెబుతున్నారు.

మహిళకే ఎక్కువగా :

అయితే లక్ష మందిలో కూడా మహిళలే వందేళ్ళు పైబడిన వారిలో అధికంగా ఉన్నారు. వందేళ్లు పైబడిన వారిలో దాదాపు 88 శాతం అంటే 94 వేల 298 మంది మహిళలే ఉండటం విశేషం. పురుషుల సంఖ్య కేవలం 13,379 గా ఉంది అని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ శతాధిక వృద్ధుల సంఖ్య లెక్కించడం అన్నది గత 56 సంవత్సరాలుగా సాగుతోంది. ఇక . గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 7 వేల 914 మంది అధికంగా పెరిగారని నివేదికలు చెబుతున్నాయి. మరి ఇంత ఆరోగ్యంగా వందేళ్లు పై దాటి జీవిస్తున్నారు అంటే దానికి ప్రధాన కారణాలుగా చాలా ఉన్నాయి. జపాన్ ప్రజలు తీసుకునే సాంప్రదాయ ఆహార అలవాట్లు ఇందులో కీలకంగా ఉన్నాయి. వారంతా చేపలు కూరగాయలు అన్నం ఎక్కువగా తింటారు. అలాగే జీవనశైలి కూడా చురుకుగా ఉంటుంది. జపాన్ లో అత్యాధునిక వైద్య సదుపాయాలు వారు ఎక్కువ కాలం జీవించడానికి మరో ముఖ్య కారణంగా జనాభా నిపుణులు పేర్కొంటున్నారు.

తీవ్రమైన జనాభా సంక్షోభం :

జపాన్ లో వందేళ్ళు దాటిన వారు లక్ష దాటారని ఒక వైపు ఆనందం ఉంటే మరో వైపు అక్కడ కొత్తగా జననాలు తగ్గిపోతున్నాయి. అంటే జపాన్ వృద్ధుల దేశంగా మారబోతోంది అన్న మాట. ఇలా ఒక వైపు ఆయుష్షు పెరుగుతున్నప్పటికీ మరోవైపు జననాల రేటు భారీగా తగ్గిపోతుండటం వల్ల జపాన్ తీవ్రమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది అని అంటున్నారు. మరో వైపు అంత పెద్ద ఎత్తున వృద్ధులు ఉండడంతో వారి సంరక్షణ కోసం దేశం భారీగా ఆర్థిక వ్యయాన్ని భరించాల్సి వస్తోంది అని అంటున్నారు. పుట్టుకలు తగ్గిపోతే రేపటి రోజున జపాన్ పరిస్థితి ఏమిటి అన్నదే ఇపుడు అక్కడ తీవ్రంగా అంతర్మధనం చెందేలా చర్చ సాగుతోంది అంటున్నారు.

భారత్ పరిస్థితి చూస్తే :

ఇక భారతదేశంలో సగటు జీవిత కాలం ప్రస్తుతం సుమారు 71 నుండి 72 సంవత్సరాలుగా ఉంది అని నివేదికలు చెబుతున్నాయి. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఇది కేవలం 32 ఏళ్లు మాత్రమే ఉండగా మెరుగైన వైద్య సదుపాయాలు పౌష్టికాహారం ప్రజారోగ్య రక్షణ చర్యల వల్ల దశాబ్దాలుగా ఈ ఆయుష్షు నిరంతరం పెరుగుతూ వస్తోంది అంటున్నారు. అయితే భారతదేశంలో పురుషుల కంటే మహిళల సగటు జీవిత కాలం ఎక్కువగా ఉంటోంది. మహిళల జీవిత కాలం సుమారు 73.6 నుండి 74.4 సంవత్సరాలుగా ఉంటే పురుషుల జీవిత కాలం సుమారు 70.5 సంవత్సరాలుగా ఉంటోంది. ఇక నగరాలు, పట్టణాల్లో నివసించే వారి ఆయుర్దాయం గ్రామీణ ప్రాంతాల ప్రజల కంటే సగటున మూడు సంవత్సరాలు ఎక్కువగా ఉంటోంది. మెరుగైన ఆసుపత్రులు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండటమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

కేరళ అగ్ర స్థానం :

ఇదిలా ఉంటే ఈ జీవిత కాలం కూడా రాష్ట్రాల వారీగా తేడాలుగా ఉంటోంది. అన్ని రాష్ట్రాల్లో ఆయుర్దాయం ఒకేలా లేదని నివేదికలు చెబుతున్నాయి. కేరళ రాష్ట్రం దేశంలోనే అత్యధిక సగటు జీవిత కాలంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక అల్ప ఆయుర్దాయంగా చూస్తే మధ్యప్రదేశ్ అస్సాం వంటి రాష్ట్రాలు జాతీయ సగటు కంటే వెనుకబడి ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. భారతీయుల మొత్తం ఆయుర్దాయం 72 ఏళ్లకు చేరినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ఒక వ్యక్తి పూర్తి ఆరోగ్యంతో అంటే ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు వైకల్యాలు లేకుండా జీవించే ఆరోగ్యకరమైన జీవిత కాలం సగటున 58 సంవత్సరాలు మాత్రమే ఉండడం గమనార్హం. అంటే సగటున చివరి 14 సంవత్సరాలు భారతీయులు వివిధ రకాల అనారోగ్య సమస్యలతోనే గడుపుతున్నారని తెలుస్తోంది. మరి భారతీయులు వందేళ్ళ ఆయుర్దాయానికి ఎపుడు చేరుకుంటారు అంటే ఆలోచించాల్సిందే.

Tags:    

Similar News