మోదీ కృషిని గుర్తించిన రష్యా అధ్యక్షుడు పుతిన్..
భారత్–రష్యా మధ్య ఉన్న “ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని” మరింత బలోపేతం చేయడంలో మోదీ చేసిన వ్యక్తిగత కృషిని తక్కువగా అంచనా వేయలేమని పుతిన్ పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్–రష్యా మధ్య ఉన్న ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మోదీ వ్యక్తిగతంగా చేసిన కృషిని పుతిన్ ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికపై మోదీకి ఉన్న ప్రాధాన్యాన్ని కూడా ప్రస్తావిస్తూ ఆయన అభినందనలు తెలిపారు.
రష్యా రాయబార కార్యాలయం పంచుకున్న పుతిన్ సందేశంలో.. మోదీకి తన దేశ ప్రజల్లో ఎంతో గౌరవం ఉందని.. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయనకు గణనీయమైన ప్రభావం.. ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. భారత్–రష్యా మధ్య ఉన్న “ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని” మరింత బలోపేతం చేయడంలో మోదీ చేసిన వ్యక్తిగత కృషిని తక్కువగా అంచనా వేయలేమని పుతిన్ పేర్కొన్నారు.
మోదీ రాజకీయ పరిజ్ఞానం.. ముందుచూపు అద్భుతం
ఇటీవల ఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీతో జరిగిన సమావేశాన్ని కూడా పుతిన్ తన సందేశంలో ప్రస్తావించారు. భారత్ పర్యటన సందర్భంగా తనకు, రష్యా ప్రతినిధి బృందానికి మోదీ అందించిన ఆతిథ్యానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మోదీతో జరిగిన చర్చలు ఎంతో సారవంతంగా, స్పష్టంగా, నిర్మాణాత్మకంగా సాగాయని పుతిన్ పేర్కొన్నారు. అంతేకాదు.. మోదీతో మాట్లాడటం తనకు ఎప్పుడూ సంతోషాన్నిస్తుందని.. ఇటీవల జరిగిన చర్చలు మరోసారి ఆయన అసాధారణ రాజకీయ పరిజ్ఞానం, ముందుచూపును స్పష్టంగా చూపించాయని పుతిన్ వ్యాఖ్యానించారు. భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై భవిష్యత్తులోనూ నిర్మాణాత్మక సహకారాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
బ్రిక్స్ సదస్సులో కీలక భేటీ
సెప్టెంబర్ 12–13 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు మోదీ ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా పుతిన్ ఢిల్లీకి వచ్చారు. సదస్సు సందర్భంగా మోదీ–పుతిన్ ద్వైపాక్షిక భేటీ కూడా జరిగింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఇంధనం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, రక్షణ తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంచే అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.
ప్రస్తుతం అంతర్జాతీయంగా వాణిజ్యం, ఇంధనం, భౌగోళిక రాజకీయ పరిణామాలపై ఒత్తిళ్లు కొనసాగుతున్న సమయంలో మోదీ పుట్టినరోజున పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత్–రష్యా సంబంధాల్లో ఉన్న ఉన్నత స్థాయి రాజకీయ అనుబంధాన్ని మరోసారి వెల్లడించాయి. రాబోయే రోజుల్లోనూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాల్లో సహకారం కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడి సందేశం స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా పుతిన్‌తో పాటు పలువురు దేశాధినేతలు, భారత రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలిపారు.