అమెరికా ఎఫ్‌బీఐను వాడేస్తున్నారా? ఏపీ పోలీసులపై జగన్ ఫైర్!

ఏపీలో సోషల్ మీడియా పోస్టుల సెన్సార్‌షిప్‌పై వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Update: 2026-09-17 12:37 GMT

ఏపీలో సోషల్ మీడియా పోస్టుల సెన్సార్‌షిప్‌పై వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయడానికి ఏపీ పోలీసులు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) పేరు చెబుతున్నారని ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ఎక్స్ లేఖను జగన్ ట్వీట్ చేశారు. ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఏపీ పోలీసులు నకిలీ గుర్తింపుతో ఎఫ్‌బీఐ పేరు వాడుకోవడాన్ని ఆక్షేపించారు జగన్ రెడ్డి. రాజకీయ కక్ష సాధింపుల కోసం ప్రభుత్వమే ఇటువంటి తప్పులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.

సోషల్ మీడియా పోస్టులను అడ్డుకునేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు వైసీపీని తీవ్ర ఇబ్బంది కలిగిస్తుండగా, ఎక్స్ నుంచి వచ్చిన లేక ఆ పార్టీకి అస్త్రంగా మారిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ పోలీసుల నుంచి వచ్చిన లేఖలో ఎఫ్‌బీఐ అని ప్రస్తావించడాన్ని ఎక్స్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీంతో ఏపీ పోలీసులకు ఎఫ్‌బీఐకి సంబంధం ఏంటంటూ విపక్షం ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలుపెట్టిందని పరిశీలకులు చెబుతున్నారు. తమ ఖాతాలను అడ్డుకోడానికి పోలీసులు ఎఫ్‌బీఐ పేరు వాడుకుంటూ తప్పు చేస్తున్నారని విపక్షం ఎదురుదాడి చేయడాన్ని రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నంగా చెబుతున్నారు. తమ అకౌంట్లను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం తప్పు చేస్తోందని చెప్పడానికి వైసీపీ ఎక్స్ లేఖను వాడుకుంటోందని అంటున్నారు.

ఏం జరిగిందంటే?

ఎక్స్ లో వైసీపీ సోషల్ మీడియా ఖాతాలను నిలువరించాలని గుంటూరు పోలీసులు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఎక్స్ పోలీసుల లేఖ ప్రకారం వైసీపీ ఖాతాలను బ్లాక్ చేస్తున్నట్లు ఒక లేఖలో తెలియజేసింది. ఎఫ్బీఐ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఆయా ఖాతాలను తొలగిస్తున్నట్లు ఎక్స్ తొలుత ఒక లేఖరాసిందని చెబుతున్నారు. మా వినియోగదారుల గొంతును రక్షించడమే కాకుండా వారిని గౌరవించడం ఎక్స్ బాధ్యతగా నమ్ముతుందని, ఈ విషయంలో ఏదైనా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ లేదా ప్రభుత్వ సంస్థ నుంచి అభ్యర్థన వస్తే వినియోగదారులకు తెలియజేయడం తమ విధానం అంటూ ఎక్స్ లేఖ రాసిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తమ ఖాతాలను నిలిపివేయాలని ఎఫ్బీఐ నుంచి లేఖ రావడం ఏంటి అనే అనుమానంతో వైసీపీ మరో లేఖ రాయగా, ఎక్స్ ఆ లేఖకు సమాధానంగా మరో లేఖ రాసింది. దీనిలో ఎఫ్బీఐ పేరుతో ఏపీ పోలీసులే లేఖ రాశారని, పోలీసులు రాసిన లేఖకు అమెరికా ఎఫ్బీఐతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఎఫ్బీఐ పేరు ఎందుకు వాడుకున్నారో తెలియదని వెల్లడించింది.

పట్టుబిగించిన విపక్షం

ఇక ఈ వ్యవహారంలో ఏపీ పోలీసులు ఎఫ్బీఐ పేరు వాడుకోవడాన్ని ఆయుధంగా మలుచుకున్న విపక్షం పట్టుబిగించే ప్రయత్నాలు మొదలుపెట్టిందని అంటున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో పోలీసుల పనితీరును ప్రశ్నిస్తూ మాజీ సీఎం జగన్ రెడ్డి ఎక్స్ లో సుదీర్ఘ ట్వీట్ చేశారు. ‘ఎక్స్‌’లో పోస్టులను తొలగించాలని కోరుతూ రాష్ట్ర పోలీసులు తమకు తాము అమెరికాకు చెందిన ‘ఎఫ్‌బీఐ’గా పేర్కొనడం అత్యంత దారుణమని వ్యాఖ్యానించారు. ఇది మన రాష్ట్రంతో పాటు దేశ ప్రతిష్ఠను కూడా దిగజార్చే హేయమైన చర్యగా ఆయన అభిర్ణించారు. ఇక గుంటూరు పోలీసులు పంపిన లేఖలో ఎఫ్‌బీఐ అని ఎందుకు రాశారో తెలియాల్సివుందని అంటున్నారు.

Tags:    

Similar News