ట్రెండీ టాక్: ఈ పెళ్లిళ్ల తంతు ఏంద‌యో.. వైర‌ల్ కోసం వెరైటీనా!

ఈ మొత్తం మార్పులకు మూలం కేవలం ట్రెండ్ మాత్రమే కాదు.. నేటి డిజిటల్ యుగంలో `పెళ్లి అంటే సోషల్ మీడియా కంటెంట్` అనే స్థాయికి ఇది చేరింది.

Update: 2026-09-17 02:44 GMT

భారతీయ వివాహ వేడుకలు అంటేనే ఒకప్పుడు బంధుమిత్రుల కోలాహలం, సాంప్రదాయ పూజలు, పెద్దల ఆశీర్వాదాలతో కళకళలాడేవి. కానీ నేడు ఆ దృశ్యాలు మారుతున్నాయి. కేవలం `వింతగా జరిగిన పెళ్లిళ్లు` అని చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి. మోడ్ర‌న్ స్టైల్ భారతీయ పెళ్లిళ్లలో సంప్రదాయంతో పాటు వినోదం.. వ్యక్తిగతీకరణ.. మీమ్ కల్చర్ .. సోషల్ మీడియా వైరాలిటీ ఎలా కలిసిపోతున్నాయనేది ఇప్పుడు గమనించదగ్గ ముఖ్యమైన ట్రెండ్.

వోగ్ ఇండియా, ఎన్‌డీటీవీ, ఇండియాటైమ్స్ వంటి ప్రముఖ ప్రచురణ సంస్థ‌లు కూడా ఈ మార్పులను పెద్ద ఎత్తున కవర్ చేస్తున్నాయి. ఒకవైపు వివాహ వేదికపై కొత్తదనం కోసం పాకులాడుతుంటే.. మరోవైపు డిజిటల్ ప్రపంచంలో ఎంగేజ్ చేయ‌డమే లక్ష్యంగా మారుతోంది. అసలు పెళ్లిలో వధూవరుల కంటే వైరల్ మూమెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా? అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

ఈ ట్రెండ్స్‌లో భాగంగా ఇటీవల పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న వాటిలో `డ్యాన్సింగ్ గొరిల్లా బరాత్` ఒకటి. పూర్తి స్థాయి గొరిల్లా కాస్ట్యూమ్స్ వేసుకున్న పెర్ఫార్మర్లు బరాత్- సంగీత్- కాక్‌టెయిల్ పార్టీల్లో విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. గెస్ట్‌లతో కలిసి డ్యాన్స్ చేయడం.. సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇవ్వడం. చివరకు వయసు మీరిన పెద్దలు సైతం ఇందులో ఉత్సాహంగా పాల్గొనడం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. అలాగే ఒక వీడియోలో మహిళా సర్వర్లు హోవర్‌బోర్డులపై అతిథులకు ఫుడ్, డ్రింక్స్ సర్వ్ చేయడం కనిపించింది. ఇది అమేజింగ్- ఫ్యూచరిస్టిక్‌గా ఉందని కొంద‌రు అంటే... పెళ్లిళ్లలో ఇటువంటి గిమ్మిక్‌లు అవసరమా అని మరికొందరు పెదవి విరిచారు. ఇక సాంప్రదాయ పసుపు రంగు హల్దీకి బదులుగా పర్పుల్ లేదా లావెండర్ థీమ్‌తో `పర్పుల్ హల్దీ` నిర్వహించడం.. గొరిల్లా నుంచి లాబుబు. హలో కిట్టి.. పాండా వంటి పాప్-కల్చర్ మాస్కాట్‌లను వాడటం వంటివి వివాహాలను పూర్తిగా వినోదాత్మకంగా మారుస్తున్నాయి. పెళ్లిలో ఇప్పుడు సాధారణ డీజే కంటే ఈ మాస్కాట్‌లే క్రౌడ్-పుల్లర్లుగా మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు.

కేవలం వేదికలే కాకుండా వివాహ వేదికల ఎంపికలోనూ భారీ మార్పులు వస్తున్నాయి. సాంప్రదాయ బ్యాంకెట్ హాల్స్ లేదా రిసార్ట్స్‌కు బదులుగా కర్ణాటకలో ఒక స్టోన్ క్వారీని కాక్‌టెయిల్ పార్టీ వేదికగా మార్చినట్లు వోగ్ ఇండియా రిపోర్ట్ చేసింది. రాకీ బ్యాక్‌డ్రాప్, తాత్కాలిక డెక్‌లు, లైటింగ్, ఫైర్‌వర్క్స్, కాస్మిక్ ప్రొజెక్షన్స్‌తో డెస్టినేషన్ వెడ్డింగ్ కాస్తా `ఎక్స్‌పీరియన్స్ వెడ్డింగ్` వైపు అడుగులు వేస్తోంది. అయితే ఈ వైరల్ ఆర్భాటాల మధ్య మరో కోణం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక గుర్గావ్ కపుల్ డిజైనర్ అవుట్‌ఫిట్లు- ఈవెంట్ ప్లానర్ల ఖర్చును తగ్గించుకుని దాదాపు 10 లక్షల రూపాయలను ఆదా చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వెండర్లను ముందుగా బుక్ చేసుకోవడం.. స్థానిక ప్రతిభను ఉపయోగించుకోవడం ద్వారా స్మార్ట్ బడ్జెట్ వెడ్డింగ్స్ వైపు కూడా కొందరు మొగ్గు చూపుతున్నారు. అంటే ఒకవైపు వైరల్ ఆర్భాటాలు.. మరోవైపు బడ్జెట్-ఫ్రెండ్లీ పెళ్లిళ్లు అనే రెండు భిన్న దిశలలో నేటి సమాజం పయనిస్తోంది.

ఈ మొత్తం మార్పులకు మూలం కేవలం ట్రెండ్ మాత్రమే కాదు.. నేటి డిజిటల్ యుగంలో `పెళ్లి అంటే సోషల్ మీడియా కంటెంట్` అనే స్థాయికి ఇది చేరింది. పెళ్లి, ఫొటోగ్రాఫర్, రీల్, వైరల్ మూమెంట్, సోషల్ మీడియా అనే ఒక చక్కటి చక్రం ఇక్కడ నడుస్తోంది. సర్‌ప్రైజ్ ఎంట్రీలు.. వినూత్న డ్యాన్స్ పెర్ఫార్మన్స్.. థీమ్ హల్దీలు.. డ్రమటిక్ బ్రైడల్ ఎంట్రీలతో కపుల్స్ ఇంటెన్షనల్‌గా షేరబుల్ మూమెంట్స్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా టామ్ హోలాండ్ - జెండాయాలను సౌత్ ఇండియన్ వెడ్డింగ్ కపుల్‌గా చూపించిన ఫ్యాన్‌-మేడ్ ఏఐ వీడియోలు వైరల్ కావడం ద్వారా.. భవిష్యత్తులో ఏఐ వెడ్డింగ్ ఇన్విటేషన్లు.. ఏఐ ప్రీ-వెడ్డింగ్ షూట్‌లు వంటి డిజిటల్ ట్రెండ్స్ కూడా పెరుగుతున్నాయి. ఏఐ కంటెంట్‌ను రియ‌ల్ వెడ్డింగ్‌గా చూపించకపోయినా.. ఈ డిజిటల్ హవా పెళ్లిళ్లపై గట్టి ప్రభావమే చూపుతోంది.

ఈ వినూత్న మార్పుల వెనుక ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయి. మొదటిది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కల్చర్.. రెండోది జెన్ Z కోరుకునే పర్సనలైజేషన్... మూడోది అతిథులకు కేవలం భోజనం మాత్రమే కాకుండా ఒక అద్భుతమైన అనుభూతిని అందించాలనే `ఎక్స్‌పీరియన్స్ ఎకానమీ`... నాల్గవది ఇతరుల పెళ్లిళ్లలో చూసిన కొత్తదనంతో పోటీ పడాలనే సోషల్ ప్రెషర్. మరి వీటన్నింటిని చూశాక అసలు ప్రశ్న ఏమిటంటే..భారతీయ పెళ్లిళ్లు సంప్రదాయాల నుంచి దూరమవుతున్నాయా? లేక అదే సంప్రదాయాలకు కొత్త తరం తమ స్టైల్‌ను జోడిస్తోందా? ఇక్కడ ఏ ఒక్క వైపు మాత్రమే చూడలేం. ప్రాచీన ఆచారాలు... ఆధునిక వ్యక్తిగతీకరణ రెండూ ఒకదానితో ఒకటి కలిసిపోయి నేటితరం కొత్త తరహా వివాహ వేడుకలకు రూపకల్పన చేస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఈరోజుల్లో పెళ్లి తంతును ఎలా చూడాలంటే.. ప్ర‌తి టీవీ రియాలిటీ షోలోను టీఆర్పీ కోసం అప్ప‌టికప్పుడు డ్యాన్సులు.. ఫ్యాష‌న్ షోలతో వైబ్రేష‌న్ క్రియేట్ చేసిన‌ట్టు.. పెళ్లిళ్ల‌లోను అలాంటివి చూస్తున్నామ‌ని భావించ‌వ‌చ్చు.

Tags:    

Similar News