కేంద్రానికి సోషల్ మీడియా టెన్షన్.. కాక్రోచ్ పార్టీ తరహాలో మరో రెండు ఉద్యమాలు.. లక్షల్లో ఫాలోవర్లు
మొత్తానికి తాజాగా పుట్టుకొచ్చిన సోషల్ మీడియా పేజీలు కేంద్ర ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతున్నాయని అంటున్నారు.
నీట్ పరీక్షల వైఫల్యంపై ఉద్యమించి కేంద్ర విద్యామంత్రి రాజీనామాకు కారణమైన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇప్పుడు మరికొన్ని ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తోంది. వ్యంగ్య పేజీగా మొదలై దేశంలోని జెన్ జీ యువత గొంతుకగా పనిచేసిన సీజేపీ మాదిరిగానే ఇంటర్నెట్ లో పుట్టుకొస్తున్న కొత్త సంస్థలకు కూడా మంచి ఆదరణ కనిపిస్తోందని అంటున్నారు. సీజేపీ సక్సెస్ తో తాజాగా ఈ20 జనతా పార్టీ, రిజర్వేషన్ హటావో మూమెంట్ పేరుతో మరో రెండు పేజీలు ఎక్స్, ఇన్ స్ట్రాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ రెండు ప్రారంభించిన వెంటనే లక్షల మంది యువత ఫాలోవర్లుగా మారడం సంచలనంగా మారింది.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై అసంతృప్తితో ఉన్న యువత వినూత్న తరహాలో తమ నిరసన తెలియజేసేందుకు ఆన్ లైన్ బాట ఎంచుకుంటున్నట్లు తాజా పరిణామాలతో అర్థమవుతోందని అంటున్నారు. గతంలో మాదిరిగా ఆందోళనలు, నిరసనలు అంటే రోడ్డెక్కడం కాదని, తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా మీమ్స్, రీల్స్ ద్వారా కూడా తెలియజేసి ఒత్తిడి చేయొచ్చని యువత భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ప్రభుత్వవిధానాలను వ్యతిరేకిస్తున్న వారు ఎక్కువగా ఇంటర్నెట్ ఉద్యమాలకు ఆకర్షితులవుతున్నారని చెబుతున్నారు.
సీజేపీ ఆందోళనలను సక్సెస్ అయిన తర్వాత పుట్టుకొచ్చిన ఈ20 జనతా పార్టీ, రిజర్వేషన్ హటావో ఆందోళన్ ప్రస్తుతం ట్రెండింగులో ఉన్నాయి. లక్షల మంది యువత ఈ రెండు పేజీలను ఫాలో అవుతున్నారు. దీంతో ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే రిజర్వేషన్ హటావో ఆందోళన పేజీకి దాదాపు 6 మిలియన్ల ఫాలోవర్లు చేరారని చెబుతున్నారు. అదేవిధంగా ఈ 20 జనతా పార్టీకి సైతం దాదాపు మూడు లక్షల మంది ఫాలోవర్లుగా మారిపోయారని అంటున్నారు. పెట్రోల్ లో ఇథనాల్ మిశ్రమాన్ని కలిపడాన్ని వ్యతిరేకిస్తున్న ఈ20 జనతా పార్టీ ఫాలోవర్లు ఆగస్టు 4న ఢిల్లీలో ప్రత్యక్ష ఆందోళనకు పిలుపునివ్వడం విశేషంగా చెబుతున్నారు.
ప్రస్తుతం ఇంటర్నెట్ లో సీజేపీకి ఆదరణ ఉన్నట్లే ఈ20 జనతాపార్టీ, రిజర్వేషన్ హటావో ఆందోళన్ కు మద్దతు పెరుగుతోందని ప్రచారం జరుగుతోంది. విద్యాసంస్థలు, ఉద్యోగాలలో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న వారు రిజర్వేషన్ హటావో ఆందోళన్ కు మద్దతు చెబుతున్నారు. ఇక పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ ను వ్యతిరేకిస్తున్న టాక్సీ డ్రైవర్లు ఈ20 జనతా పార్టీని ఫాలో అవుతున్నారు. ఇథనాల్ కలపడం వల్ల వాహనాలు పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈ20 జనతా పార్టీ మద్దతుదారులు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజీనామాకు డిమాండ్ చేస్తుండటం విశేషం.
మొత్తానికి తాజాగా పుట్టుకొచ్చిన సోషల్ మీడియా పేజీలు కేంద్ర ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో జెన్ జీ యువత నిర్వహించిన ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా మంత్రితో రాజీనామా చేయించాల్సి వచ్చిందని అంటున్నారు. ఆ సమయంలోనే ఈ తరహా ఉద్యమాలు పెరిగిపోయే ప్రమాదం ఉందని కేంద్రం ఊహించగా, అందుకు పెద్దగా సమయం పట్టకపోవడమే విశేషంగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఈ20 జనతా పార్టీకి తమకు ఎటువంటి సంబంధం లేదని ఢిల్లీకి చెందిన రవాణా సంస్థలు ప్రకటించాయి. ఈ20 పెట్రోల్ విధానాన్ని నిరసిస్తూ ఆగస్టు 4న నిర్వహిస్తున్న ధర్నాకు ఈ20 జనతాపార్టీకి సంబంధం లేదని రవాణా సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. కానీ, ఈ20 జనతా పార్టీ పేజీల్లో మాత్రం ధర్నాకు మద్దతుగా పోస్టులు వెల్లువలా వస్తున్నాయని అంటున్నారు.