పాలు కల్తీ తెలుసుకోవడం ఎలా? రాజమండ్రి ఇష్యుతో ఫుడ్ సేఫ్టీ పై స్పెషల్ డ్రైవ్

దీనిపై రాష్ట్ర ఆహార భద్రత శాఖ ( ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్) ద్వారా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు వెల్లడించింది.;

Update: 2026-03-11 09:40 GMT

రాజమహేంద్రవరం కల్తీ పాలు ఘటన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. పాలు, పాల పదార్థాల్లో కల్తీని ఇంట్లోనే సులువుగా గుర్తించే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది. అమృతంలా భావించే పాలు పలువురి ప్రాణాలు తీయడాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఇకపై అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతిరోజూ ఇంట్లోనే పాల కల్తీని గుర్తించే అవగాహన కల్పించాలని నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర ఆహార భద్రత శాఖ ( ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్) ద్వారా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు వెల్లడించింది.

ఇంట్లో చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా కల్తీ పాలు, వాటి ఉత్పత్తులకు దూరంగా ఉండవచ్చు అని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు. రాజమహేంద్రవరం ఘటన తర్వాత పాల వినియోగంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోయాయి. అదేవిధంగా పాలతో తయారు చేసిన పదార్థాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కల్తీ పాలను ఎలా గుర్తించాలి అన్నదానిపై ఫుడ్ సేఫ్టీ డైరెక్టరేట్ కొన్ని సూచనలు చేసింది.

పాలలో కల్తీ గుర్తించడం చాలా ఈజీ

మనం రోజూ వాడే పాలలో నీళ్లు కలిశాయా? లేక ఇంకేమైనా రసాయనాలు కలిశాయా? అన్నది తెలుసుకోవడం చాలా సులువు. ఒక ప్లేటును ఏటవాలుగా ఉంచి దానిపై పాల చుక్కను వదలినప్పుడు స్వచ్ఛమైన పాలు అయితే తెల్లటిధారగా కిందకు దిగుతుంది. అదే నీరు కలిపిన పాలు అయితే తెల్లటి ధార లేకుండా త్వరగా కిందకి దిగిపోతుంది.

యూరియా లేదా డిటర్జెంటు కలిసిందో లేదో తెలుసుకోవాలంటే..!

ఓ గ్లాసులో 10 ఎంఎల్ పాలు, 10 ఎంఎల్ నీటిని కలిపి, బాగా కదలించాలి. అప్పుడు పై భాగంలో మందమైన నురుగు ఏర్పడుతుంది. అదే స్వచ్ఛమైన పాలు అయినట్లయితే నురుగ రాదు. నురుగ వస్తే మాత్రం కల్తీ జరిగినట్లు గుర్తించాలి.

రంగు మారితే..!

మొక్కజొన్న లేదా ఇతర పిండి పదార్థాలను చిక్కదనం కోసం పాలలో కలిపారా? లేదా తెలుసుకోవాలంటే ఓ గ్లాసులో పాలు తీసుకుని అయోడిన్ ద్రావణాన్ని రెండు, మూడు చుక్కలు కలిపినట్లయితే సదరు పాలు నీలం రంగులోనికి మారుతుంది. ఇదే జరిగితే కల్తీ జరిగినట్లు భావించాలి. రంగు మారకుండా ఉంటే వాటిని స్వచ్ఛమైన పాలుగా పరిగణించాలి.

అదేవిధంగా బంగాళాదుంప లేదా చిలకడ దుంప, ఇతర పిండి పదార్థాలను నెయ్యిలో కలిపారా? లేదా అని తెలుసుకోవడానికి ఒక స్పూన్ నెయ్యిని చిన్న గాజు గిన్నెలో వేయాలి. తర్వాత రెండు, మూడు చిన్న అయోడిన్ ఉప్పు ద్రావణాన్ని వేయాలి. అప్పుడు నెయ్యి నీలం రంగులోనికి మారితే కల్తీ జరిగినట్లు భావించాలి.

నెయ్యిలో వనస్పతి, పామాయిల్ ఉంటే..

ఒక స్పూన్లో నెయ్యి తీసుకుని, కొంచెం చక్కెర కలిపి వేడిచేసినప్పుడు అది ఎరుపు లేదా పింక్ రంగులోకి మారితే వనస్పతి కలిపినట్లు గుర్తించాలి. అలాగే గ్లాస్ వేడి నీటిలో స్పూన్ నెయ్యిని వేస్తే ఒరిజనల్ నెయ్యి అయిన పక్షంలో అది పైన తేలుతుంది. వనస్పతి కలిపిన నెయ్యి చిన్నచిన్న ముద్దులుగా మారుతుంది.

ఒక చుక్క నెయ్యిని అరచేతిలోనికి తీసుకుని గట్టిగా రుద్దినట్లయితే సువాసన రావాలి. సువాసన రాకుండా ఉంటే నెయ్యిలో కల్తీ జరిగినట్లుగా భావించాలి. ఈ పదార్థాలు ఏమైనా కల్తీ జరిగినట్లు భావిస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం కొన్ని నెంబర్లను అందుబాటులో ఉంచింది. కల్తీ ఘటనలపై టోల్ ఫ్రీ 1800 425 3857, ఐపీఎం ప్రధాన కార్యాలయం నెంబర్ (08645 297245)కు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది.

Tags:    

Similar News