సూపర్ సిక్సు లేదు.. సూపర్ సెవనూ లేదు: జగన్
ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సూపర్ సిక్సూ లేదు.. సూపర్ సెవనూ లేదు.. అని వ్యాఖ్యానించారు.;
ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సూపర్ సిక్సూ లేదు.. సూపర్ సెవనూ లేదు.. అని వ్యాఖ్యానించారు. బుధవారం తాడేపల్లిలోని నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో రెవెన్యూలోటు పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 2026-27 బడ్జెట్‌లో మాయ చేశారని వ్యాఖ్యానించారు. బడ్జెట్‌పై తాను గత ప్రెస్‌మీట్లో నేను ప్రస్తావించిన వాటిలో ఒక్క ప్రశ్నకు కూడా ముఖ్యమంత్రికాని, మంత్రులుకాని సమాధానాలు చెప్పలేదన్నారు.
నిరుద్యోగ భృతి, ఎప్పుడు అమలు చేస్తారన్నదానిపై మాట మాత్రం కూడా చెప్పలేదని జగన్ అన్నారు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీని ఆడిపోసుకున్నారని వ్యాఖ్యానించారు. 18 ఏళ్లు నిండిన 60 ఏళ్లు లోపు ఉన్న మహిళలకు “ఆడబిడ్డ నిధి’’అని నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామన్నారని, వీరికి ఎప్పుడు ఇస్తారన్న విషయంపై అసెంబ్లీ సమావేశాల్లో కనీసం ప్రస్తావన కూడా చేయలేదని అన్నారు. 50ఏళ్లు నిండిన ఎస్ సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెన్షన్ కింద నెలకు రూ.4వేలు చొప్పున ఇస్తామన్నారని, దీనిపై మాట్లాడలేదన్నారు.
కూటమి ప్రభుత్వంలో5,64,709 పెన్షన్లు కట్ చేశారని జగన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇస్తున్న వారికి కూడా పెన్షన్స్ ఇవ్వడానికి సరిపడా బడ్జెట్ కేటాయింపులు లేవని చెప్పారు. ప్రతి నెలా 25వేలకు పైగా పెన్షన్లు కట్ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వద్ద లక్షల సంఖ్యలో పెన్షన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని జగన్ చెప్పారు. తల్లికి వందనం కింద చంద్రబాబు మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదన్నారు.
రెండో ఏడాది తల్లికి వందనం పథకం కింద.. కొందరికి రూ.8 వేలు, కొందరికి రూ.9 వేలు, కొందరికి రూ.10 వేలు, కొందరికి రూ.13వేలు ఇచ్చారని.. పూర్తిగా ఏ ఒక్కరికీ పడలేదన్నారు. ఉచిత బస్సు ప్రయాణానికి దారుణమైన షరతులు పెట్టారని జగన్ విమర్శించారు. 16 రకాల సర్వీసులు ఉంటే 5 రకాల సర్వీసులకే ఎందుకు పరిమితం చేశారని దీనిని తాము ప్రశ్నిస్తే… నోరు మెదపలేదని అన్నారు. `దీపం` పథకం కింద మహిళలకు ఏడాదికి మూడు సిలెండర్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారని విమర్శించారు. దీపం పథకానికి ఇప్పటివరకూ రూ.6,143 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు.