విశాఖకు బిగ్ అలెర్ట్....అంతా కలిస్తేనే మేలు !

విశాఖ దేశంలోని టైర్ టూ మెగా సిటీస్ జాబితాలో ఉంది. అయితే మహా నగరాల వారసత్వం కూడా విశాఖకు వచ్చేసింది అని అంటున్నారు.

Update: 2026-08-08 00:30 GMT

విశాఖ దేశంలోని టైర్ టూ మెగా సిటీస్ జాబితాలో ఉంది. అయితే మహా నగరాల వారసత్వం కూడా విశాఖకు వచ్చేసింది అని అంటున్నారు. దేశంలోని అనేక ప్రధాన నగరాలను పట్టి పీడిస్తున్న వాయు కాలుష్యం విశాఖను సైతం ఇబ్బంది పెడుతోంది. స్వచ్చమైన గాలి కోసం విశాఖ కృషి చేయాల్సిన అవసరాన్ని ఈ కాలుష్యం గుర్తు చేస్తోంది. అదే సమయంలో విశాఖలో గాలి నాణ్యతను మెరుగుపరచుకోవాల్సిన హెచ్చరికలను కూడా నిపుణులు జారీ చేస్తున్నారు.

పొల్యూషన్ హాట్ స్పాట్స్ గా :

ఇప్పటికి పాతిక లక్షల దాకా జనాభా ఉన్న విశాఖ సమీప భవిష్యత్తులో మరింతగా పెరిగే అవకాశం ఉంది. దాంతో పాటుగానే కాలుష్యం కూడా హెచ్చు కానుంది అని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే విశాఖలో పొల్యూషన్ హాట్ స్పాట్స్ ని పెద్ద ఎత్తున గుర్తించారు. అక్కడ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించి సాధారణ పరిస్థితులు తీసుకుని రావాల్సిన అవసరం ఉంది, దీని మీదనే ప్రస్తుతం ప్రభుత్వాలు యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేశాయి. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (ఎన్‌సీఏపీ) కింద ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అమలు కమిటీలు ఈ యాక్షన్ ప్లాన్ లో భాగం అవుతున్నాయి.

వేగవంతం చేయాల్సిందే :

ఇదిలా ఉంటే ఎన్‌సీఏపీ లక్ష్యాలకు అనుగుణంగా విశాఖ మహా నగరంలో వాయు కాలుష్య స్థాయిలను తగ్గించేందుకు అన్ని శాఖలు తమ కార్యాచరణ ప్రణాళికలను వేగవంతం చేయాలని అధికారులు కోరుతున్నారు. నగరంలో గుర్తించిన ప్రధాన కాలుష్య హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ జంక్షన్లను అభివృద్ధి చేయడంతో పాటు, రహదారుల మెరుగుదలకు కృషి, అలాగే హరితాభివృద్ధి, రోడ్డు శుభ్రపరిచే యంత్రాల వినియోగం, నీటి ఫౌంటెన్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్న ఎన్‌సీఏపీ లక్ష్యాలను విశాఖలోని పొల్యూషన్ హాట్ స్పాట్స్ లో అమలు చేయనున్నారు. ఇక విశాఖకు అతి పెద్ద పొల్యూషన్ హాట్ స్పాట్ గా పోర్టు ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ అను నిత్యం దుమ్ము, ధూళి వ్యాప్తి చెందుతూండడం వల్ల కాలుష్యం పెరగకుండా సంబంధిత సంస్థలు నిర్దేశిత పర్యావరణ ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే బల్క్ కార్గో నిర్వహణ, రవాణా కార్యకలాపాల్లో కాలుష్య నియంత్రణ చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు.

ఆ నగరాలే హెచ్చరికలు :

దేశంలో కాలుష్య నగరాలైన ఢిల్లీ, ముంబయి వంటివి కాలుష్యానికి హెచ్చరికలుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఆ తరహా కాలుష్యం విశాఖను ముంచెత్తకుండా కాపాడుకోవాల్సి ఉందని అంటున్నారు. ఈ విషయంలో బాధ్యత కేవలం అధికారులు ప్రభుత్వాలదే కాదు ప్రతి శాఖపైన ప్రతి సంస్థపైన ప్రతి పౌరుడిపైన ఉందని ఉందని ఎన్‌సీఏపీ జిల్లా కమిటీ స్పష్టం చేస్తోంది. విశాఖలో స్వచ్ఛమైన వాతావరణాన్ని పరిరక్షించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన నగరాన్ని అందించాలని మేధావులు పర్యావరణ హితైషులు సూచిస్తున్నారు. విశాఖ నగరంలో వాయు నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అదనంగా మూడు నిరంతర వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల ఏర్పాటుకు తగిన స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎన్‌సీఏపీ సంబంధిత అధికారులకు సూచించింది.

గణనీయంగా తగ్గించాలి :

విశాఖ నగరంలో ప్రస్తుతం పీఎం-10, పీఎం-2.5 స్థాయిల తగ్గింపునకు అవసరమైన చర్యలను మరింత పటిష్టం చేయాల్సి ఉంది. వాయు కాలుష్య నియంత్రణ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం అధ్యాపకులు పరిశోధకులు విద్యార్థులను మరింతగా భాగస్వాములను చేయాలని ఎన్‌సీఏపీ కోరుతోంది. అదె విధంగా శాస్త్రీయ అధ్యయనాలు అవగాహన కార్యక్రమాలతో పాటు ఫీల్డ్ పరిశీలనలు కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమాల ద్వారా యువతలో అవగాహన ద్వరా వారి భాగస్వామ్యం పెరగడం వల్లనే కాలుష్య నియంత్రణ చర్యలు మరింత ఫలితాలను ఇస్తాయని ఎన్‌సీఏపీ అభిప్రాయపడుతోంది.

Tags:    

Similar News